Loading...

31, డిసెంబర్ 2012, సోమవారం


17, డిసెంబర్ 2012, సోమవారం

శృంగేరి గురువుల అనుగ్రహ భాషణము

        
                             
 ఈ మధ్య భాగ్యనగరానికి ఇరవయ్యేళ్ళ తరువాత వేంచేసి భక్తులను అనుగ్రహించిన స్వామి అనగా శృంగేరీ మఠపీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్థానంలో ఉన్నవారికి నగర వాస్తవ్యులు గురువందన కార్యక్రమం చేసిన సందర్భంగా స్వామి వారు జగత్తుకు ఇచ్చిన సందేశము ఎంతో స్ఫూర్తిదాయకమైనది.

                             వారు చెప్పినది ఏమంటే ఎప్పుడైనా ప్రపంచాన్ని నడిపించేది ధర్మము. ఎవరి ధర్మాన్ని వారు తెలుసుకొని చక్కగా పాటించుట మంచిది. ధర్మము అంటే ఏమి అనగా నీ తల్లిదండ్రులను సేవించి వారి ఋణం తీర్చుకో, పరులకు చేతనైనంతలో సహాయపడు, నీవలన ఇంకొకరికి కష్టము కలుగకుండా చూసుకో మని చెప్పినారు.
                          ఎంతో మంచి మాటలు. ఈ మాటలు ఎవరైనా సరిగ్గా అర్థము చేసుకున్నారంటే, అందరూ మనసా పాటించినారంటే ప్రపంచశాంతి ఎందుకు రాదు? తప్పని సరిగా వస్తుంది. నిలిచి ఉంటుంది. ఇంక సంధ్యావందనము చేయుటకు గాయత్రీ మాత అనుమతి తీసుకున్నవారు తప్పని సరిగా సంధ్యావందనము చేయుట మాని వేసి మాకు ఈ కాలానికి, ఈ వేగానికి తగినట్టుగా ఏదైనా సూచించమని కోరుతున్నట్టు వారు చెప్పి, ఒక ప్రశ్న వేసినారు.

                     ఎప్పుడైనా భగవదారాధనలో ప్రతివారూ కూడా తమతమ శక్తి సామర్థ్యాలకు తగినట్టుగా చేయమనే మన సనాతనధర్మము చెపుతున్నది కానీ ఈ స్థాయిలో చేస్తేనే చేసినట్టు అని ఎప్పుడూ చెప్పలేదు. అట్లాంటపుడు మీ కాలానికి తగినట్టుగా ఎంత తక్కువసమయము(ఒక్క పదినిముషాలైనా) దొరికితే అందులోనే చేయగల వీలున్నపుడు ఇంకా మార్చమని మీరు ఎందుకు అడుగుతున్నారు? ఇంతకూడా మీకు వీలు లేదని మీరనుకుంటున్నపుడు ఇంకోటి కొత్తగా సూచిస్తే దానికి మాత్రము వీలు కుదురుతుందని ఏమి నమ్మకము? అసలు ఇది మన ధర్మమయినపుడు దీనిని మార్చే అధికారము ఎవరికీ లేదు.

                           అయినా మిగతాఅన్నింటికీ సమయము ఉన్నప్పుడు (మార్నింగ్ వాక్ ఖచ్చితంగా చేయాలని అదీ అరగంట అయినా తప్పదని అన్నపుడు, రూపాన్ని అభివృద్ధి చేసుకునే వ్యాయామాలు చేయాలనుకున్నపుడు...ఇట్లాంటివి) వీటిల్లో బేరాలాడితే మనకే నష్టమని తెలిసికొన్నమనము......
                  ఇన్నీ మనము చేయడానికి మనకు తగినంత శక్తినిచ్చిన భగవంతుని తలచుకోవడానికి సమయము లేదని , వేగవంత జీవితమని సాకులతో బేరాలాడాల్నా? అని ప్రశ్నించారు.

                   వారు చెప్పిన ఏ మాటా తిరుగులేనిదని అనిపించింది. ఎటూ దారిమళ్ళకుండా, క్లుప్తంగా, విషయాలను నొక్కి చెపుతూ వారు ప్రసంగించడం ఎంతో బాగున్నది.

1, డిసెంబర్ 2012, శనివారం

దైవం పేరుతో....

  సృష్టికి మూలమని నమ్మి దైవాన్ని ఆరాధించడం కాకుండా దైవభక్తి కూడా ఒక ఫ్యాషన్ గానో, సక్సెస్ ఫార్ములా గానో పెట్టుకోవడం కొత్త వింతగా తయారయింది. మన చలన చిత్రాల్లో నాయిక/నాయకుడు దైవభక్తులయి (తర్వాత క్రిమినల్స్ కావటం కూడా మర్చిపోరులెండి.)ఉండడం మిగతా వారు దానిని అతిగా భావిస్తూ సరదా పేరిట వ్యాఖ్యలు చేస్తూ ఉండడం మామూలుగా కనిపిస్తున్నాయి.
                      దైవం పేరుతో సెంటిమెంట్ ఉన్నవాళ్ళని, లేని వాళ్ళని కూడా కాష్ చేసుకోవడమే ఉద్దేశ్యంగా ఉన్నట్టుంది.
               ఇక సినిమాలను మించిపోతూ, ఈ మధ్య వ్యాపారప్రకటనల్లో కూడా మంత్రాలను కూడా నోటికొచ్చినట్టు పలుకుతూ, మారుస్తూ వాడేస్తున్నారు. దీనికంతా వ్యాపారదృక్పథం ఉన్నవాళ్ళే కాదు లేని వాళ్ళే ఎక్కువ సహాయం చేస్తున్నారు. వేదమంత్రాలను , అర్చనలను అన్నిటిని గురువు వద్ద శిష్యులు నేర్చుకోవడం ఉండేది. పూజ చేసేటప్పుడు శుద్ధులై మాత్రమే పలికేవారు.

ఏదైనా తప్పు పలికినా క్షమించమని దైవాన్ని అడిగేందుకే ఒక శ్లోకం ఉన్నది.

యదక్షర పదభ్రష్టం మాత్రా హీనం తు యద్భవేత్|
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు తే||


అంత నిష్ఠగా ఉచ్చరించడం పోయి నిర్లక్ష్యం ఎక్కువయింది.

ఇప్పుడన్నింటిని సీడిలు, ఇంటర్నెట్లలో ఉంచడం వల్ల ఎక్కడబడితే అక్కడ ఎప్పుడుబడితే అప్పుడు అన్ని మంత్రాలూ వినిపిస్తాయి. కళ్ళకు ఱెప్పలిచ్చినట్టు చెవులకు కూడా ఏదైనా ఉంటే బాగుండేదనిపిస్తుంది. మనం మాట్లాడే తెలుగే మనకు సరిగ్గా రానప్పుడు మంత్రాలను శ్లోకాలను పాడే దుస్సాహసం చేయడం ఎందుకు? అపస్వరం అంటే కూడా తెలియకుండా, గురువు నేర్పకుండా పాడేస్తుంటే వినలేకపోతున్నాము.