Loading...

27, అక్టోబర్ 2011, గురువారం

కార్తీకం




                                                                    ఈరోజు కార్తీక శుద్ధ పాడ్యమి. ఈ రోజు తో కార్తీక మాసం మొదలవుతుంది. ఈశ్వర, నారాయణ రూపాల్లో ఏ రూపాన్ని ఆరాధించే వారయినా ఈ మాసం మరింత భక్తి శ్రద్ధలతో నామ జపం చేసుకునే ఆచారం ఉంది. కార్తీక మాసంలో ప్రతిరోజూ సంధ్యాసమయంలో ఇంటి ముందు మట్టి ప్రమిదలతో కడుప్మాను (గడప) ముందు రెండువైపులా రెండు దీపాలు పెట్టే ఆచారము ఉంది.

                                                                       దీపావళి అమావాస్యకు ముందు రోజు నరకచతుర్దశిరోజు తో మొదలుపెట్టి, నరకచతుర్దశి, దీపావళి రోజుల్లో వరుసగా అనేక దీపాలు పెట్టినా తర్వాత రెండు దీపాలు మాత్రం పెడుతూ వస్తాం నెలంతా. ఈ నెల దీపదానం , కంబళీదానం ప్రశస్తమైనది అని చెపుతారు. త్వరగా చీకటి పడే రోజులు కాబట్టి దీపాల అవసరం, చలి మొదలయ్యే రోజులు కాబట్టి కంబళీ అవసరం గుర్తించిన పెద్ద వారు ఆ రోజుల్లో  ఏర్పరచిన ఆచారాలివి
                                         
                                              నిరంతరం అందరి గురించీ ఆలోచించి పరస్పర సహాయ సహకారాలతో సమాజం జీవించాలని మన పూర్వీకులు ఇలాంటి నియమాలను పెట్టారు. కార్తీక మాసంలో చన్నీళ్ళ స్నానమే చెయ్యాలంటారు. అదెందుకో తెలీదు కానీ, రోజూ చన్నీళ్ళ స్నానాలు చేస్తున్నా కార్తీకం వచ్చేసరికి నీళ్ళు మరీ చల్లబడి వేణ్ణీళ్ళు కావాలనిపించటం వింతగా ఉంటుంది.

                   
                                                                                ఇక కార్తీక మాసం లో శుద్ధద్వాదశినాడు క్షీరాబ్ధి/చిలుకద్వాదశి అని సర్వరోగనివారిణి, సకలశుభదాయిని అయిన తులసి మాత పూజ జరుపటం విశేషం. తలంటి నీళ్ళు పోసుకొని వంట చేసి తులసికి నైవేద్యం చేయటం, సాయంకాలం నలుగురిని పిలిచి తాంబూలాలు ఇచ్చుకోవటం ముఖ్యం. నా చిన్నతనం లో తెల్లవారేసరికి తులసి దగ్గర అమ్మ వెలిగించే దీపం (నూటఎనిమిదేమో మరి) నాకింకా కళ్ళలోనే ఉంది. మా ఇంట్లో నాలుగడుగల ఎత్తు బృందావనం హుందాగా నిలబడి ఉండేది. అందులో తులశమ్మ, ముందుభాగములో ఇద్దరు కూర్చునేంత  అరుగు లా ఉండేది. సాయంకాలం అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోవటం, మా చిన్న చిన్నాన్న మూడో కూతురికి ళ శ్రద్ధగా పలికించటం మనసులో అప్పుడప్పుడూ మెదలుతూ ఉంటాయి.

4, అక్టోబర్ 2011, మంగళవారం

భువనేశ్వరీ !

భువనేశ్వరీ !
అఖిల లోకములఁ గన్న తల్లివీ,
ఆశీస్సులనే కోరివచ్చితిని........... భువనేశ్వరీ!

రాగము ద్వేషము లేని దానవు
లోకములన్నిటి నేలెదవూ..
ద్వేషము పెరుగగఁ బంతముఁ బూనిన
దేశము నిపుడు కావగరావా... భువనేశ్వరీ!

ఎల్లరమూ నీ పిల్లలమమ్మా
చల్లటి నీ ఒడి నుండగ నిమ్మా..
కల్లల,కపటాలన్నిటినీ..
చెల్లగబోవని చూపగదమ్మా.....భువనేశ్వరీ!
                -----లక్ష్మీదేవి