Loading...

23, ఏప్రిల్ 2009, గురువారం

జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!


1. దేవకీ సుతుడై ధరకేతెంచి
వసుదేవునికి ముక్తిని గూర్చి
నదిమధ్యమునే బాటలు వేసిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

2. వెన్నకు మన్నుకు భేదము గానక
తల్లి యశోదకు వింతలు చూపగ
నందుని కులదీపకుడై వెలసిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!


3.వేణుగానమున మైమరిపించి
గోలోకమునే మురిపించితివి
గోజను( గావగ గిరిధరియించిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

4.మాయలమామను కంసుని జంపి
తల్లిని తండ్రిని చెర విడిపించి
మధురకు తాతను రాజుగ చేసిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!


5.నీలమాధవు రూపము దాల్చి
సుభద్రయు బలభద్రుని తోడ
పూరీ సాగరతీరాన వెలసిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

6.అసురుల బాపగ దీనుల గావగ
అవతారమునే దాల్చితివి
అవనికి భారము దింపేవాడివి
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

7. అనురాగానికి అధిపతివై
అష్టభార్యల ప్రేమను పొంది
లీలలు ఎన్నో చూపినవాడివి
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

8.సూత్రధారివీ రాయబారివీ
రథసారధివై రణమునకేగి
గీతార్థమునే తెలిపినవాడివి
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!

9.ముద్దూ మురిపెము రేపల్లియకు
కేళీ విలాసం బృందావనికీ
కర్ణామృతమును భువికొసంగిన
జగన్నాథ స్వామీ! సర్వాంతర్యామీ!
- లక్ష్మీదేవి.

13, ఏప్రిల్ 2009, సోమవారం

అందరికీ మంచిరోజులు

భగవంతుని పూజలో అందరూ సమానమని నమ్మేసిద్ధాంతం నాది. అందరూ అన్నప్పుడు చిన్నా,పెద్దా, ఆడా, మగా,వికలాంగులూ,బుద్ధిమాంద్యం గల వాళ్ళూ, ఏ లోటూ లేని వాళ్లూ,ఉన్నవాళ్ళూ, లేని వాళ్ళూ అందరూను.

మరి భర్త ఉన్నవాళ్ళూ, భర్త లేని వాళ్ళని స్త్రీలలో మాత్రం ఎందుకు ఈ భావన?
పైన చెప్పినట్టు వయసూ,ఆరోగ్యం, డబ్బు ఉన్నవాళ్ళని లేనివాళ్ళని చూడనప్పుడు భర్త ఉన్న వాళ్ళని, లేనివాళ్ళని ఎందుకు చూడాలి?

కొంత మంది అంటారు -వాళ్ళు తృప్తిగా ఉందే పరిస్థితి లేదు కాబట్టి నిండు మనసు తో చేయాల్సినవాటిలో పాల్గొనరాదు అని.

మరి ఎంతో మంది వేరే ఎన్నో విషయాల్లో జీవితమంతా అసంతృప్తి తో ఉండే వాళ్ళూ, అసూయ తో ఉండేవాళ్ళూ ఉంటారు కదా, వాళ్ళంతా ఎలా అర్హులౌతారు?

కొందరనుకోవచ్చు - ఈ కాలంలో అవన్నీ ఎక్కడున్నాయని. ఖచ్చితంగా ఉన్నాయి. పెద్ద నగరాల్లోనే జీవితమంతా ఉన్నవారికి అనుభవంలోకి వచ్చి ఉండకపోవచ్చు.కానీ పల్లెల్లో, పట్టణాల్లో ఉన్నవారికీవిషయం తప్పక తెలిసే ఉంటుంది. ఏమని అడిగే ధైర్యం ఎవరికీ ఉండదు. సో కాల్డ్ నగరవాసులు అక్కడున్నా కూడా! చూసీ చూడనట్టు పోతూ ఉంటారు. భార్య లేని భర్తలకు ఈ బాధలేవీ ఉండవు.

దంపతులుగా చేయాల్సిన వాటి గురించి నేను చెప్పట్లేదు.

పిల్లలకు ప్రత్యేక సందర్భాల్లో ఆరతులివ్వడం,వ్రతాలూ,పూజలు చేసేప్పుడు ఏర్పాట్లు చేయడం, శుభ సందర్భాల్లో ఉదయం కనిపించడం ఇలాంటివి కూడా పాపాలా?

అయితే కొందరు స్త్రీలు (ఆ కాలం వారు) మనమెంత చెప్పినా వినరు. పైగా ఇంకా వివరించబోతే తమ పరిస్థితికి ఇంకా బాధ పడడం మొదలెడతారు.

ఇక వాళ్ళకేదో మనమే గుర్తు చేసి మరి బాధ పెట్టామేమో అని మనమే బాధపడాలి.
ఎన్నికలొస్తున్నయి కాబట్టి మనం సమాజంలో సమస్యల్ని పట్టించుకోలేదని అందరూ చెప్తున్నారు. కానీ రోజూ మన ఇంట్లో జరిగేదాన్నే పట్టించుకోని మనం ఇక సమాజాన్ని పట్టించుకుంటామా?

ఈ పట్టింపులు ఎంతో గొప్పదైన మన సంస్కృతిలో భాగమని నేను అనుకోను. అందరిలో పరమాత్మని చూడమని, లోన ఉండే ఆత్మ అందరికీ ఒక్కటేనని తెలిసిన మనకు ఈ వివక్ష తప్పని తెలీడానికి ఇంకెంత కాలం పడుతుంది?

ఒక పక్క భర్త పోయిన తర్వాత రెండో పెళ్ళిళ్ళు జరుగుతున్నయి. కాదనను. అబ్బాయికి మొదటి పెళ్ళి అయినా భర్త లెని వారిని చేసుకున్న వాళ్ళని నేనే చూశాను.సంతోషం. కానీ ఇంకో వైపు ఈ పరిస్థితి కూడా ఉంది.
క్రమంగా అందరికీ మంచిరోజులొస్తాయని ఆశిద్దాం.