Loading...

15, మే 2023, సోమవారం

The Last Emperor of South India, Venkatapathi Devaraya.

 

Venkatapathi Devaraya, The Last Emperor..!-by
Neelayapalem Vijay Kumar
వెంకటపతి దేవరాయలు !
ఎవరితను ? బహుశా ముందుగా వచ్చే ప్రశ్న ఇదేనేమో?
‘ఖులీ కుతుబ్ షా’ ఎవరు అంటే నూటికి అరవై మంది హైదరాబాదు, గోల్కొండ అంటూ చెప్పేస్తారేమో
అదే వెంకటపతిదేవ రాయలు ఎవరు అంటే, వాడెవడు అంటారేమో..!
వెంకటపతి దేవరాయలు, గోల్కొండ కులీ కుతుబ్ షాహీ సమకాలికుడు. బీజాపూర్ ఆలీ ఆదిల్షా సమకాలికుడు. ఇంకా చెప్పాలంటే, మొఘలు రాజు అక్బర్ సమకాలికుడు. అక్బర్ రెండు సార్లు దక్షణాది దక్కన్ మీద దండెత్తి రావాలి అనుకోని రెండుసార్లు చంద్రగిరిలోని వెంకటపతిదేవరాయలకి రాయబారం పంపించాడు. దక్షిణాపతిని మొత్తం ఏలిన వాడు ఇతను. కానీ మనకు మన తెలుగు చక్రవర్తి పేరు కూడా తెలీదు.
మన ఆంధ్ర చరిత్రను మనం మరచిపోయాము. ఇంకా చెప్పాలంటే మనము అసలు పట్టించుకోమేమో ! కోపం వస్తుందేమో కానీ, చరిత్ర పట్ల అత్యంత అనాదరణ వున్న రాష్ట్రం ఏదైనా వుంది అంటే అది ఆంధ్ర మాత్రమే...
విజయనగర సామ్రాజ్యం తళ్ళికోట యుద్ధం, హంపీ విద్వంసంతో అంతం అయిపోయిందని మనం చిన్నప్పటి నుంచీ చదివాము. కానీ ఆ సామ్రాజ్యం, హంపీ విద్వంసం తర్వాత దాదాపు తొంబైఏళ్ళు నడిచిందని, హంపీకి ముందు వున్న రాజ్యంలో 70 శాతం రాజ్యంతో, నాటి ఆంధ్రలోని పెనుకొండ, చంద్రగిరి, రాయ వెల్లూరు రాజధానులుగా దాదాపు దక్షిణ భారతదేశమంతా పరిపాలించారని మనకేవ్వరూ చెప్పలేదు. చరిత్రలో చదవలేదు. మన పాఠశాల సోషల్ పుస్తకాల్లో చూడలేదు. 
1565లో అయిదు బహమనీ ముస్లిం రాజ్యాలు కలిసిపోయి, జిలానీ సోదరుల డబుల్ క్రాసింగ్ తో, తళ్లికోట యుద్ధంలో ఆళియ రామరాయలను చంపేసిన నాటి రాత్రి, అతని సోదరుడు తిరుమల రాయలు, ఖజానా ధనం, భంధువులు, సన్నిహితులతో రాత్రికి రాత్రికి పెనుకొండకు పారిపోయి అక్కడ సామ్రాజ్యం ఏర్పరచారు అనేదాకా చదివాము.
కానీ, ఆ తర్వాత, 1585 నుంచి వెంకటపతి దేవరాయలు చక్రవర్తిగా ఈ రోజుటి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాల్లతో దక్షిణ భారత దేశాన్ని, నాటి తంజావూర్, మదురై, జింజీ, వేలూర్, చిత్రదుర్గ, రామనాద్, పుదుక్కోటై ,కంజీవరం, చిదంబరం, మధురాంతకం, ఇక్కేరీ, మైసూర్, బేలూర్, కోలార్, మంగలూర్ నాయక రాజ్యాల నుంచి, ఈనాటి రాయలసీమ లోని, కర్నూల్, ఆదోని, నంద్యాల్, గుత్తి, కడప, సిద్ధవటం, గండికోట, మడకశిర, అనంతపూర్, చంద్రగిరి, మొదలుకొని, నెల్లూరు నుంచి, కొండవీడు దాటి, వినుకొండ, కొండపల్లి మీదుగా ఇప్పటి వైజాగ్ దగ్గర కశింకోట వరకు ఏక చ్త్రదిపత్యంగా దక్షిణ భారతావని మొత్తం ముప్పై సంవత్సరాలకు పైగా పరిపాలించిన విజయనగర చక్రవర్తి.
విజయ నగర రాజ్యాన్ని, తిరిగి దాదాపు కృష్ణదేవరాయల నాటి పూర్వ వైభవానికి తెచ్చిన ఒక “తెలుగు చక్రవర్తి” వెంకటపతి దేవరాయలు.  
పోర్చుగీస్, డచ్, డెన్మార్క్, దేశస్తులకు తన సముద్ర పోర్టులయిన, పులికాట్, నుంచి తూర్పు తీరంలో వ్యాపారానికి ఇచ్చి పన్నులు వసూలు చేసిన వాడు. ఒక్క మచిలీపట్నం (కుతుబ్ షా ఆధీనంలో వుండేది), తూర్పు తీరం మొత్తం వేంకటపతిరాయల ఆధీనంలో వుండేది. ఇంగ్లిష్ వారికి మొదట వ్యాపార అనుమతిని ఇచ్చిన వాడు కూడా వేంకటపతే. కానీ ఆ ఒప్పందం సంతకాలు అయ్యే లోపలే చనిపోయాడు. తదనంతరం అతని వారసులు 15 సంవత్సరాల తర్వాత అదే చంద్రగిరి కోటలో అప్పటి వేంకటపతిరాయల ఒప్పందాన్ని పునరుద్ధరించి ఇప్పటి మద్రాసుని, అప్పటి చెన్నపట్నాన్ని వ్యాపారంకోసం బ్రిటీష్ వారికి ఇచ్చారు,
వెంకటపతి రాయల తర్వాత, దక్షిణాపదిని ఇంత పెద్ద ఎత్తున ఏలిన సర్వం సహా చక్రవర్తి ఎవరూ లేరు. కొంతవరకు టిప్పు సుల్తాన్ ఆ స్థాయికి వచ్చాడు గానీ, అతని సామ్రాజ్యం మధ్యలో చాలా రాజ్యాలు అతని ఆధీనంలో లేవు. పైగా అదికూడా అతి కొద్ది కాలమే.
అందుకే, అరవీటి వెంకటపతి రాయలు అనే ఈ విజయనగర చక్రవర్తి, శ్రీ కృష్ణదేవరాయల రెండవ కూతురి కొడుకు, దక్షణభారత దేశంలోకి ముస్లిం రాజ్యాలైన, గోల్కొండ, బీజాపూర్ , మొఘల్ రాజ్యాలు రాకుండా కర్నూల్ దగ్గర కృష్ణా నదిని, ఇటు వైపు నేటి బెజవాడ పక్కన వుండే కృష్ణా నది తీరాన్ని సరిహద్దుగా నిర్ణయించి ముప్పై సంవత్సరాలపాటు దక్షినాదిని ఏలిన వెంకటపతి రాయలు “దక్షిణాపద చివరి చక్రవర్తి....". The Last Emperor of South India, Venkatapathi Devaraya.  
ఇంకా నమ్మకం కుదరకపోతే, ఈ సారి “తిరుమల”, వెళ్ళినప్పుడు, అవును బాబూ, మన వేంకటేశ్వరుని తిరుమలకు వెళ్ళినప్పుడు, లోపలి వెళ్ళేటప్పుడు, మహాద్వారం దాటగానే, వెండి వాకిలికి ఎడమ వైపున, తులాభారం వుంటుంది, చూసే వుంటారు, ఆ పక్కనే. నిలువెత్తు వెంకటపతి దేవరాయల విగ్రహం వుంటుంది, చూడండి....
అతని చరిత్రే, ఆ తెలుగు చక్రవర్తి చరిత్ర
ఈ Last Emperor of South India…..
ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనిపిస్తే, ఈ పుస్తకం అన్నీ ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభ్యం అవుతుంది. అలాగే ఆన్ లైన్ లో Amazon ద్వారా కూడా లభ్యం అవుతుంది.
చివరిగా, ఇంతటి ఆఫ్ బీట్ పుస్తకాన్ని అడగ్గాన్నే ప్రచురించిన “అన్వీక్షికీ పబ్లిషర్స్” కు ఎన్నెన్నో ధన్యవాదాలు.
Amazon Purchase Online Link ::::::....




12, మే 2023, శుక్రవారం

జనులు

 ఒండొరులననుకరింపను

నొండొరులను వెక్కిరింపనుత్సాహితులై

దండుగ పనులనుఁ జేయగ

దండిగ జనులుంద్రు కనగ ధారుణియందున్. 


--లక్ష్మీదేవి.

కందము.



9, మే 2023, మంగళవారం

మాయ

 కోటలును మిద్దెలను గొప్పవగు తీరుగనుఁగొత్తపఱి కట్టగలవారై

తోటలను పువ్వులను తోపులను మానులనుఁదుష్టిఁ గన పెంచగలవారై

మాటలనుఁ గూర్చుకొని మంత్రముల తీరుగను మాయలనుఁ బెట్టగలవారై

సాటి సరి లేదనగ సర్వులను మీరుచును సాగుదురు గెల్చగలవారై. 


--లక్ష్మీదేవి.

మంగళమహాశ్రీ.


అడ్డొచ్చునా

 పూవనమందు వాయువన పోవగ రాదొ, విరక్తి రక్తులన్

యావను వీడి సాగుటకు యౌవనమేటికి నడ్డువచ్చునో?

భావము మేల్మిగా కలిగి, పావన సుధ్వనులందు పాడగా

జీవము సంస్కరింపబడ, చేవను నీ బ్రదుకెల్ల సాగదే! 


--లక్ష్మీదేవి.

ఉత్పలమాల