Loading...

31, జనవరి 2023, మంగళవారం

పల్లె

 పల్లె పట్టులఁ గొల్వు తీరిన పైరుపంటల బాటలో

చల్లచల్లని గాలియుయ్యెల సద్దుఁజేయుచునుండగా

పొల్లుమాటల నవ్వులందునఁ బుణ్యకాలపు బాల్యమై

చెల్లిపోయెను సంబరమ్ములు జీవనమ్మున భాగమై


--లక్ష్మీదేవి.

మత్తకోకిల


30, జనవరి 2023, సోమవారం

లోకం

 వింతవింతగ లోకమన్నది వేల రూపులఁజూపుచున్

సుంతయైనను తోచనీయదు సొంతమన్న ప్రమోదమున్

మంతనమ్ములు గుంపుగుంపుల మర్మమై కొనసాగగా

నంతకంతకు రోత కల్గదె యంతరంగమునందునన్. 


-లక్ష్మీదేవి

మత్తకోకిల


27, జనవరి 2023, శుక్రవారం

అందామా

 ఆటలన్నీ ఆడుకుందాం

పాటలన్నీ పాడుకుందాం

మాటలల్లో తీపి మాగే కథలు విందామా

బాట వేసీ బావి పెట్టీ

దాటలేనీ గోడ కట్టీ

కోట కట్టీ జట్టు కూడీ తుర్రుమందామా 


-- లక్ష్మీదేవి 

భామినీ షట్పద (అనుసరణ)

24, జనవరి 2023, మంగళవారం

చిత్రమే

 శ్యామల స్నిగ్ధరూపుఁగని స్వాంతముశాంతమునందు నిల్పి ని

ష్కామపు కార్యముందొడగఁగష్టముఁదోచును, నాటుపోటులన్

భ్రామికలెండమావులనుఁ బర్వులు పెట్టెడు కార్యమందు నే

నేమియు కష్టముంగననిదెంతయు చిత్రముగాదె చూచినన్?


--లక్ష్మీదేవి 

ఉత్పలమాల 

22, జనవరి 2023, ఆదివారం

ఓర్వగలనె?

 సుందర పదముల సొంపుగా కూరిచి

పాడినట్టి నిధుల భాగ్యముండి

మంద మంద గతుల మాధుర్యములతోడ

కూడినట్టి పగిది కూర్మి యుండి

విందు చేసి జనుల ప్రీతినిఁ గొనుచును

వేడుకఁ జేసిన  పేర్మి యుండి

నిందను పడవైచి నిర్మల జన్మము

నడవిని వీడినదగుచునుండ

 

నట్టి గాథఁ జదువ నంతరంగమునందు

గట్టితనము మదినిఁ గానరాదు

గుండె చిక్కఁబట్టి ఘోరమైన కథల

నుండు శోకమెపుడునోర్వలేను.


--లక్ష్మీదేవి.

సీసము, ఆటవెలది.



16, జనవరి 2023, సోమవారం

తరళ

 అనలమై జ్వలియించు తీరుగ నంతరంగపు వేదనన్

దినదినమ్ము భరించుచుండిన తేలికైన విధమ్మునన్

కనులకొల్కులజారునశ్రువు కంటగింపనువారు నీ

మనసులోపలనున్న మాటల మర్మమెన్నడెఱుంగరో! 


-- లక్ష్మీదేవి 

తరళము

15, జనవరి 2023, ఆదివారం

Ho

 


11, జనవరి 2023, బుధవారం

రాయడై

 లిపులి జాడ యేదని ప్రజాళి యనంగనిదో యిటొచ్చితిన్

వరమేలటంచు చలి మ్ముచునున్నది పట్టణమ్ములన్
నలు రంగవల్లినిడు లౌల్యములందునఁజేతఁజిక్కిరే
సులువుగ నంచు సంబరముఁజొక్కెనుపో చలి రాయడై యిలన్.

- లక్ష్మీదేవి 
చంపకమాల 

8, జనవరి 2023, ఆదివారం

పాటవమా?

 నిరాశఁ బెంచు లోకమందు నేరమున్నదందువా?

బిరాన నమ్మి నీవు యాశఁ బెంచుకొందువేలనో?

పరాకు సేయకుండనుండి పాటవమ్ముఁ బెంచుకో!

కరమ్ముఁబట్టి నిన్ను నెప్డు కాచు నట్టిదే సదా!


-లక్ష్మీదేవి 

పంచచామరము 

5, జనవరి 2023, గురువారం

అంతే మరి!

సుందరనయనారవింద!

దృక్స్రగధర! మోహక వాగ్ధారాన్విత!

చిత్తభ్రమణకర! చిద్విలాస లోల!

మానసచోరా ! నిర్మలహృదయా! నిర్వికార స్వభావా!

1, జనవరి 2023, ఆదివారం

Exactly