Loading...

30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

నిధి

 శ్రీచక్రాంకితమై చెలంగు గుడిలో శృంగేరి గ్రామమ్ములో

రోచిశ్శోభల చిద్విలాసములతో రుద్రాణి రూపమ్ముతో

ప్రాచీనామృత కావ్యవస్తునిధిగా ప్రఖ్యాత తేజమ్ముతో

నా చేతమ్ముల నిల్చితీవు, లలితానామాఖ్యవై పావనీ!

-లక్ష్మీదేవి 
శార్దూలవిక్రీడితము 

ఇంపు

 కలలో, బంగరు మెరుపుల

శిలలో, తెలితెలి నురుగులఁ జిందుచు నురికే

యలలో, శ్రద్ధనుఁ గలిగిన

నిలలో నినుఁగను మనములనింపుగనిమ్మా!


-లక్ష్మీదేవి 


పుణ్యమై

 లలనా! శ్రీయుత పాదశోభితములై, లావణ్యమై యొప్పు ని

గ్గులతో, తోషము నింపు పల్కులమరంగూర్పంగదే పద్యముల్,

తొలి నేఁ జేసిన పుణ్యమై పలుక, నిర్దోషంపు సత్కావ్యముల్,

తిలకించంగదె యొక్కమారు నను,నో దివ్యాంబకా యంబికా!


- లక్ష్మీదేవి 

మత్తేభవిక్రీడితము 


డ్రైవింగ్

 మీటను నొక్కి చక్రమును మెల్లగ త్రిప్పుచు శాంతచిత్తమున్,

బాటనుఁ జూచుకోగలిగి, బాధ్యతఁగల్గిన చోదకత్వమున్,

సాటి మనుష్యులెవ్వరికి సంకటమీయని సంయమమ్ముతో,

దీటగు జాగరూకతను తేఁకువ మీరగ సాగుచుండుమా!


-లక్ష్మీదేవి 

దేవీ!

 శ్రీక్రమ్మందు సింహాసినిగ, ముఖకళల్ శ్రీల రాజిల్లు రాజ్ఞీ!

వీచీశోభాయుతమ్మై వెలయు కురుల సుప్రీతమై యొప్పు దేవీ!
నా చిత్తమ్మందు నిస్వాము పలుకగ నీ నామమై మ్రోగనిమ్మా!
క్వాచిత్కమ్మైనఁ బల్కుంవనము నిడు, సత్కావ్య సౌందర్య దీప్తుల్. 

--లక్ష్మీదేవి 

29, సెప్టెంబర్ 2022, గురువారం

నా చేతమందు...

 శ్రీక్రాంకితమై చెలంగు గుడిలో శృంగేరి గ్రామమ్ములో

రోచిశ్శోభల చిద్విలాసములతో రుద్రాణి రూపమ్ముతో
ప్రాచీనామృత కావ్యవస్తునిధిగా ప్రఖ్యాత తేజమ్ముతో
నా చేతమ్ముల నిల్చితీవు, లలితానామాఖ్యవై పావనీ!

25, సెప్టెంబర్ 2022, ఆదివారం

ఏలో మరి

ద్యమ్మందే గుణముఁ గలదో, ప్రాణమై తోచునేలో!
విద్యున్మాలా తళుకు వలెనే వేడుకై వెల్గు రూపై,
ద్యోజాతంబయిన రసమై, సంతసమ్మిచ్చు తీరై
హృద్యమ్మై నా మదినిఁబలికే హేల చేకూరుటెట్లో!

--లక్ష్మీదేవి 
మందాక్రాంతము. 

23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

సంశయాలు

  లోకోత్తరులఁగని లోకంపునుపమల

లోకువఁగట్టగా లొసుగు గాదె?
నాకమ్ము తెలియని నుఁ బోలు వారని
తులుంచి కూర్చుండ యముగాదె?
పాకానఁ బడినట్టి పాండిత్యవిద్యను
రిణతిఁగోరగా పాడిగాదె?
శ్రీకారములఁ జుట్టి చిరునడల నరుగు
జిజ్ఞాసనుండగా శివముఁగాదె?

ప్రశ్న నుత్తరములు లోన ప్రభవమంద
సంశయాత్మక చర్చల సాగుచుంటి
నమితమైనట్టి యాకాంక్షలందలేక
అలసి యుంటి నిట్లు సొలసి యుంటి.

20, సెప్టెంబర్ 2022, మంగళవారం

పాడవోయి

 విపంచిరాగమాలపించి విందుఁగూర్చుమోయి నీ

వు పంచచామరమ్ము బాడవోయి హాయిహాయిగా 

ప్రపంచమెల్ల నాలకించి పాడునోయి తోడుగా 

తపించుచున్న మానసమ్ము తన్వినందునందు నే


-లక్ష్మీదేవి 

పంచచామరము.

6, సెప్టెంబర్ 2022, మంగళవారం

నయము

సీ  . మిత్రులనినవారు మేలుఁగోరి పలుకు

         మాటలందున శ్రద్ధ మనకుఁగలుగు

      శత్రువులంటివా,  జరుగు కీడు నెఱుగ

             మాటలందున శ్రద్ధ మనకు వలయు

       ఆత్రుతఁ గనకుండ, హసియించి పోఁద్రోలు

             చేతల నలసత చేటుఁ గూర్చు

        చిత్రమేమొ, యదెట్టి చీకు చింతయు లేని

              నడతఁగలుగు మన్కి నయము తుదకు.


ఆ. నెంచి యెంచి మనిన నెట్టి కీర్తి దొరకు?

 భ్రమలు తొలగు పొద్దు పలకరింప,

 వెఱ్ఱియగుటె మిగులు. విబుధజనులనుండి

విన్నమాటలివియె విశ్వమంత.


-లక్ష్మీదేవి.

సీసపద్యము.


#నాపద్యాలు

#ఆనందాలు

😊😊