Loading...

31, ఆగస్టు 2022, బుధవారం

ఆలోచన

 No photo description available.May be an image of text

ఎల్లరు

 పిల్లని రూపుఁడై, జనని ప్రేమగఁ దీర్చిన ముద్దుపాపడై,
పిల్లలకిష్టుఁడై, జగతిఁ బెద్దల కార్యములందుఁ బూజలం
దెల్లెడనాద్యుడై, జనుల నెల్ల విధమ్ముల నూతనమ్ముగా
నుల్లసమొప్పఁ జూడదగు నొజ్జని యాతని నమ్మిరెల్లరున్.

- లక్ష్మీదేవి 
ఉత్పలమాల 

28, ఆగస్టు 2022, ఆదివారం

పంతమేలో...

 పంతమేల నోయి పసిడి మనసు మీద

పాలవెల్లి వెడలు వన్నెకాడ!

పిలుపునందు వేళ వేవేగ రావేల,

కడలి యలల వోలె వడిని పోలి?


తెల్లవారుమునుపె తిరిగిపోదువు గాని

యాటలాడి మనకు యలుపు రాగ

చనువుతోడ పిలువ సాగివచ్చెదవంచు

నమ్మకమ్ము మనది వమ్ముకాదు.


సగము రూపు మటుకె యగుపించె కనులకు

పూర్ణరూపమెపుడు పొందదగునొ?

దరిసెనమ్ము నొసగ దయలేదొ నాపైన

పున్నమెపుడటంచు పొలతివేచె.

25, ఆగస్టు 2022, గురువారం

జిజ్ఞాసువునై

 మానాదృతమైన యాకులను, పుష్పాలంకృతంబౌ మహీ

మందైనను, రాతి భూధరపు నిర్వ్యాపార సత్త్వమ్ములన్,
నావేశపు లేఖనమ్ములను, సత్కావ్యంపు వ్యాఖ్యానమున్,
శిగామీ! నినునెల్లచోటులను నేఁ జేరంగఁ యత్నింపనే?

--లక్ష్మీదేవి
మత్తేభవిక్రీడితము.

శివము = మంగళము, శుభము. ఎప్పుడూ శుభము గోరునది అని కూడా అర్థము. ఇంకా, ఎప్పుడూ యుక్తియుక్తమైన విషయములను జిజ్ఞాసువై చర్చించునదిగా ప్రసిద్ధమైనది కూడా.

18, ఆగస్టు 2022, గురువారం

కృష్ణా!

 కృష్ణా! నన్నెడబాసితే! నిను వినా క్రీడింపగా తోచునే!

నిష్ణాతుండవు నీవు మానినిని నన్నీరీతి యాడించగా,

తూష్ణీభావము పూనితే! యముననెంతో ప్రేమతోఁబిల్తు, నీ

తృష్ణాపాశములందు నేనిట సదా దిదృక్షతో  నుంటిరా!

- లక్ష్మీదేవి 

శార్దూలవిక్రీడితము 

దేవీకృష్ణం

 సామాన్యంగా కృష్ణునికి ఉండే వర్ణనలతో దేవీస్తుతి.


मौलौ केकिशिखण्डिनी मधुरिमाधाराधरे वंशिनी

पीनांसे वनमालिनी हृदि लसत्कारुण्यकल्लोलिनी।

श्रोण्यां पीतदुकूलिनी चरणयोर्व्यत्यस्तविन्यासिनी

लीला काचन मोहिनी विजयते वृन्दावनावासिनी॥


మౌలౌ కేకి శిఖండినీ మధురిమాధారాధరే వంశినీ

పీనాంసే వనమాలినీ హృది లసత్కారుణ్యకల్లోలినీ

శ్రోణ్యాం పీతదుకూలినీ చరణయోర్వ్యత్యస్తవిన్యాసినీ

లీలా కాచనమోహినీ విజయతే వృందావనావాసినీ


మౌళిన్ నెమ్మిలి పింఛమో మధురవాణీ భూధరానందినీ

 తల్లీ శ్రీవనమాలినీ హృది సదా కారుణ్యకల్లోలినీ          

బాలా చేలము హేమమో పదములన్ విన్యాసవ్యత్యస్తమా   

లీలామోహనభామినీ విజయతే బృందావనీవాసినీ       


అవే పదాలలో తెలుగుగా వ్రాద్దామని తోచింది. ఒకటి రెండు పదాలు వదిలిపెట్టక తప్పలేదు. 

--లక్ష్మీదేవి.

శార్దూలము.