Loading...

13, డిసెంబర్ 2021, సోమవారం

పోతన సందేహం

 బాల్యములో పోతన తన తల్లిదండ్రులతో నాటకం గురించి సందేహాలనడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పడం, అందులోని తాత్వికతను లౌకికముగా కానదగిన విషయసమాచారంతో నిరూపించి చెప్పడం సుప్రసిద్ధ కవి వానమామలై వరదాచార్య విరచిత 'పోతన చరిత్రము' కావ్యములో ఒకానొక (కల్పితమైన ?) చక్కటి సన్నివేశము.

-

వచ్చుచుఁ బోవుచుండె నటవర్గము లోనికదేల యన్నచోఁ 
జచ్చుచుఁ బుట్టుచుండె జనసంఘము భూస్థలినేలయంచు వా
రెచ్చట కేఁగుచుండిరన నెవ్వడు వారికి వేసమిచ్చుచు
న్బుచ్చునొ యట్టి సూత్రధరు పొంతకుఁ బోదురటంచుఁ బల్కినన్.


"వస్తూ పోతూ ఉన్నారేం ఈ నటులు లోపలికి?"

"చస్తూ పుడుతూ జనులు భూమిలో ఉండడం లేదూ అలాగే."

"ఎక్కడికి వెళ్తున్నారలా?" "ఎవడు వారికీ వేషం కట్టి

పంపాడో ఆ సూత్రధారి దగ్గరకే"


ఏఁగిన వీరిఁగాంచి యతఁడేమని పల్కునటన్న వారి వే షాగతులంబొనర్చి యెటులాడుఁడు పాడుఁడటంచుఁ దెల్పెనో
యాగతి యాడిపాడిన నహా! యని వారల మెచ్చు నిచ్చు మే
ల్భోగములట్లు జేయమిని పొండని దండనఁ జేయువాఁడనన్.


" అలా వెళ్ళిన వారిని చూసి అతడేమంటాడు?"

" వారి వేషాలను ఎలా ఆడిపాడమని చెప్పాడో అలా 

చేస్తే ఆహా అని మెచ్చి మరిన్ని మంచి భోగాలనిచ్చి చేయనివారిని

పొండని దండన చేస్తాడు"

-

ఇలా సాగుతుంది.

అందమైన పద్యాలు, చక్కటి ధార, సన్నివేశకల్పన, సహజవర్ణన.

--

పరిచయం చేసిన సన్మిత్రుల పట్ల కృతజ్ఞురాలను.

7, డిసెంబర్ 2021, మంగళవారం

ఇంపైన గానము

 రాగాలాపమ్ములో సారముఁగలిగినదై, రమ్య శబ్దంపు ప్రోదై,
సాగే గానమ్మె యింపై, సహృదయముల సంస్కారముంజేయు మందై,
భోగాపేక్షల్ ప్రమోదమ్ములు నొసగెడి యాపూర్ణరాగంపు జల్లై,
యోగానందంపు కొమ్మై, యురవడి పరుగై, యుల్లసమ్మిచ్చునోయీ!


--లక్ష్మీదేవి.

స్రగ్ధర.