Loading...

30, నవంబర్ 2021, మంగళవారం

ఎన్నో..

 కంటికి కనిపించని యుద్ధాలెన్నో ఒక్కొక్కరికీ తనదైన చిన్ని ప్రపంచంలో
చికిత్సకు నయం కాని గాయాలెన్నో తనదైన మనో లోకంలో
దినసరి సమస్యలే ఊతంగా నిలువగలిగే చింతల సుడిగాలులెన్నో బతుకుబాటలో
ప్రతిష్ఠల ఆనకట్టలు ఆపే వరదలెన్నో  శోకవాహినీగతులలో


మాటలు వివరించలేని ఆనందాలెన్నో ఒక్కొక్కరికీ తనదైన చిన్ని ప్రపంచంలో
చికిత్సే లేకుండా నయమైన గాయాలెన్నో తనదైన మరో లోకంలో
ఆశించకుండానే వరించే చనవుల మందమారుతాలెన్నో జీవనపథంలో
సిరినగవుల తళుకు పొదిగిన కంటి చెమ్మలెన్నో హర్షాతిరేకాల సుస్వర శ్రుతులలో


'మెరుపు చెంగటనున్న మేఘమ్ము'కన్నా అందానందాలు కలిగినది - సిరినవ్వుతో కూడిన కంటిచెమ్మ. కాదా!!

24, నవంబర్ 2021, బుధవారం

మాయ

 ఇలలో విశ్వపు మాయలో పడుచు, నెంతే లోతులన్ మున్గుచున్,
కలగా లేచుచు, నంతలోనె విధిగా కల్లోలమున్ క్రుంగుచు,
న్నిలువంజాలక నుండియున్; మనికిని,న్నీకాయమున్, కాయమున్
విలువైనట్టివటంచు, కోరెదము వే ప్రేమమ్ములన్ చెల్ములన్. 


--- లక్ష్మీదేవి.

మత్తేభవిక్రీడితము.

23, నవంబర్ 2021, మంగళవారం

విముక్తి

 చివరి పయనం కదా విముక్తి..

విముక్తి కదా అచ్చమైన స్వేచ్ఛ..

22, నవంబర్ 2021, సోమవారం

పలుకు

 సౌరునుఁ గల్గియుండినను, ఛందపు రూపునఁ గూర్చి పెట్టినన్;
మారుగ నేర్పుతో వచనమందున నైన; కవిత్వశోభతో
స్వారసికాదులన్ , విమల స్వాంతములన్ మురిపించకున్నదై,
నీరసమైనచో పలుకు నిల్వగఁజాలునె? మెచ్చవచ్చునే?


-- లక్ష్మీదేవి.

ఉత్పలమాల.

తిట్లు _అపనిందలు

 రాజకీయాల్లో మాత్రమే కాదు, ఈ దరిద్రం ప్రతి వృత్తి ఉద్యోగాల్లో, ఇళ్ళల్లో కూడా ఉంది.  అవతలి స్త్రీమీద నెగ్గినట్లు ఆ యా మూర్ఖులకు తోచే పనికిమాలిన భావన కోసం ఆమె పర్సనల్ విషయాన్ని తీయడమో, లేని విషయాన్ని అంటగట్టడమో వంటివన్నీ చేస్తారు. ఆడవాళ్ళు పెద్దగా కొట్లాటల్లో లేకపోవడానికీ , కొట్లాటను పెద్దగా చేయాలంటే భయపడడానికీ కారణం ఇదేనేమో. లేకపోతే ఆవేశాలు, ఉద్వేగాలు మనుష్యులందరికీ ఒకటే కదా! చప్పున ఏమైనా అనేస్తే నిజం కన్నా ఇవే ఎక్కువ బయట తిరుగుతాయి అని నిజాయితీగా ఎదురుతిరగాల్సిన సందర్భంలో కూడా స్త్రీలు తగ్గే జీవనం గడుపుతుండడం ఎవరికి తెలియని విషయం?  వినోదం కోసం ఆ యా అపనిందలను అందరూ చెప్పుకునే బాచ్ లకూ తక్కువలేదు సమాజంలో.  ఇందులో ఇంకా పనికిమాలిన సంగతేంటంటే స్త్రీలు కూడా కొందరు ఇదే చేస్తారు. మానవ సమాజం అంటే అసహ్యం తప్ప ఇంకేమీ కలగదు.