Loading...

31, అక్టోబర్ 2020, శనివారం

పద్యస్మృతులు

 

అప్పుడప్పుడూ వ్రాసుకున్న పద్యాల్లో కొన్ని.
తప్పు దొర్లిన చోట్లు పరిశీలించుకుందామని పెట్టాను.
ఇప్పుడు వస్తున్న మూడొంతుల ఆధునిక కవిత్వం లా ఇవీ అర్థం లేని వ్యర్థాలే. అర్థం ప్రత్యేకంగా చెప్పేందుకు ఏంలేదు. తెలిసిన పదాలు, తోచిన భావాలూ కూర్చినది. ఇందులో నిఘంటువు కందని పదాలూ, దీర్ఘ సమాసాలు ఉండవు.
ఉత్పలమాల-
కారుణమూర్తియై జనుల గౌరవభావనకాలవాలమై
ధీరగుణంబులన్ సరళ దృష్టినిఁ గల్గి సదానుకూలుఁడై
మారని శ్రద్ధతో గురువు మానక బోధలఁ పాఠనమ్ములన్
చేరిన శిష్యులందుఁదగు శీలగుణమ్ములఁ బెంచగాదగున్.
_______
చంపకమాల-
చదువుల తల్లి శారదకు చక్కని రీతుల పిల్లలందరున్
కుదురుగ చేసిరర్పణలు గొప్పగ పద్యపుపద్మమాలికల్,
మదిని ముదమ్మునిండగను మాయమ రాదొకొ తాను ముగ్ధయై!
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.
________
చంపకమాల-
అనయము క్షీరనీర ముల నారసి పేరును గొన్నతీరుగన్
మనమొక రాజహంసయయి మంచిని పెంచి సుఖించు టొప్పగున్.
వినయము తోడ వేడుకొన వీణనుఁ బూనిన శారదాంబ వా
హనమున కున్న మంచిగుణమబ్బును. నమ్ముము మానసంబునన్.
--------
ఉత్పలమాల-
పాతకులై జనావళిని బాధలు పెట్టెడి హీనమైనదు
ర్నీతిని మట్టుబెట్టవలె. నేతలు పెద్దలు దేశభక్తులున్
మా తరమెట్టులౌననుచు మౌనము దాల్చుట పాడికాదికన్
చేతల యందుచూపవలె, చిక్కులు తీర్చుచు మానవాళికిన్.
----------
చంపకమాల-
నినుగని పొంగిపోవగ ననేకములైన మనోవికారముల్
ననువిడిపోవు నిక్కముగ, నాకములన్నియు నన్నుచేరునే!
మనమిక వెండికొండయగు, మాటయె మంత్రము కాకయుండునా
వినుమొక మాఱు నాదు మొఱ, వేడితి నీకడ నాదిదేవరా!
-----------
మత్తేభవిక్రీడితము-
మిసిమిన్ చూపెడు చిన్నియాకులవి నెమ్మేనన్, విలాసంబుగా
ముసినవ్వుల్ కురిపించుచున్ నటనలన్ మోహింపజెయ్యున్, నిలన్ .
కుసుమంబందున హాసముల్ సొగసులై కొంగ్రొత్త గా శోభిలున్,
హసితమ్మొక్కటి మోమునందు బలు వయ్యారమ్ము నొల్కించుచున్.
-------------
ఉత్పలమాల-
తెల్లని ఱెక్కలన్ గలిగి తీయగఁ బల్కెడు రాజహంసమా!
యెల్లరి మానసమ్మలర యిచ్చటికిప్పుడు వచ్చినావటే!
వెల్లువ లయ్యె నా మదిని వింతగ సంతసమో మరాళమా!
యుల్లము పాడె, నా సఖుని యొద్దకు చేరుచు మానసమ్మిదే!
----------
సరసాంక-
వినుమోయి నాదు మనవిన్ వినిపింతు నేడే
కనుమా ప్రియమ్ములొలికే కలహంసమా! నా
మనమందు ఱేని తలపుల్ మధురోహలై నే
డు నిజమ్ములయ్యె; తినరండు మృణాళరాజిన్.
-------------
ఉత్పలమాల-
కన్నుల నాట్యమున్ గనిన, గాంచి రసజ్ఞత తోడ నెప్పుడున్,
మిన్నుల తేరుపై చనిన మేలగు భావము పొందుచుందునే!
పన్నగధారి ! నిన్ దలచి, పాడెదనో నట రాజ! శంకరా!
మిన్నగ గొప్పదౌ రుచిని మెచ్చి యొసంగితివే నటేశ్వరా!
--------------
మత్తకోకిల-
నీలదేహము మోహనమ్మది నింగిబోలుచు నుండునే!
బాలకృష్ణుని వేణునాదము పారవశ్యము పెంచునే!
పాలసంద్రము జేతు నా మది పవ్వళింపవె శ్రీహరీ!
మ్రోలవాలితి నయ్య శీఘ్రమె మ్రొక్కులందవె నీవిదే!
------------
ఉత్పలమాల-
మాపురమందు భవ్యమగు మందిరమొక్కటి చూచిరావలెన్
గోపురమందు పావురము గూటిని కట్టిన తీరు నచ్చటన్
చూపరులెల్ల ముచ్చటగ చూచుచు నుందురు తప్పకుండగాన్.
జ్ఞాపకమందున నిల్చెనది చక్కని పల్లెకు తాను గుర్తుగాన్.
________
ఉత్పలమాల-
తేనెల నూరు మాధురుల, తీయదనంబును మెచ్చువారలున్,
జ్ఞానులు, కావ్య సంరచన కమ్మగ జేయుచు నుండువారలున్,
వీనులు మెచ్చు రీతి కడు వేడుక సాహితి విందుజేతురే!
మానసమందె సంతసము; మక్కువ తోడ నమస్కరింతు నేన్.
----------
ఉత్పలమాల-
జ్ఞానము నిచ్చు పెద్దలకు, చక్కటి విద్యను నేర్పు వారికిన్,
మౌనము దాల్చి; వందనము, మాన్య వరేణ్యుల దల్చి జేసెదన్.
ప్రాణము తోడ నే భువిని బాయక నుండెడు నాళులన్నియున్,
ధ్యానము లోన నిల్పి గురు దర్శన భాగ్యము చేయకుందునే?
-------------
ఉత్పలమాల-
బీటలు వారెనే పుడమి బీదతనంబున రైతులేడ్వగా
మాటలు కాదు సేద్యమును మానక జేయుట నేటి రోజునన్
నాటిన పైరు వచ్చునని నమ్మకమన్నది లేకపోయెనే
చేటగు కాలమే జనుల చింతల బెంచుచునుండెనే హలా!
-------------
ఉత్పలమాల-
ఎవ్వరు నేర్పిరో మరుల నిట్టుల నద్భుత రీతులందులన్
మువ్వల సవ్వడో యనగ మ్రోవగ జేయుచు జెల్గెనీతడే!
పువ్వుల తావిలో కలము ముంచుచు వ్రాసెనొ! బొండు మల్లెలన్
రువ్వుచు, నిల్పె నిజ్జగము రోయక నుండగ భావుకత్వమున్.
--------------
చంపకమాల-
గగనపు సీమలోనరుగు కారుమొయిళ్ళను గాంచి, ముద్దుగా
నగవుల నొల్కు పత్నిని మనంబున దల్చిన యక్షుడాశతో
దిగులును మానమంచునొక తియ్యని వార్తను జేర్చకోరుటన్
సొగసుగ కావ్యరూపమున శోభిల వ్రాసెను కాళిదాసుడే.
-------------
మత్తేభవిక్రీడితము-
వినుమాముద్దులగూర్చుచున్ తిరిగి నువ్వీరీతి యాటాడుచున్
మనముల్లాసము జెందగా మిగుల సంభాషించ నింపాయెనే!
యినుడుంగ్రుంకెను ప్రొద్దు పోయెనిక నీవీ లాలిలో హాయిగా
కనుచున్ స్వప్నము నిద్దురించవలె , నీకై నేను పాడంగనే.
------------
ఉత్పలమాల-
ఇవ్వని తీరునన్ తనువ దెల్ల వసంతుఁడు పూనె, నమ్మవే
జవ్వని! నాఁడు నా ప్రియుఁడు చక్కని వాఁడు,మనోహరమ్ముగా
నవ్వులు రువ్వుచున్ భువికి నాకము దించుచు, నన్ను చేరగా,
మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్.
----------
ఉత్పలమాల-
పుస్తకరాశి యిట్లు బలు ముచ్చట గొల్పుచు నుండుతావిదే,
మస్తకమెల్ల నింపునివి, మానవజాతికి పెన్నిధౌ, మరే
వస్తువు గొప్ప కాదుకద, వ్రాసిన వారి కలంబు కన్న, నే
నాస్తిగ నెంచుకొందునిక హాయిని బెంచెడి గ్రంథరాశినిన్.
--------------
ఉత్పలమాల-
భూతలమందు వర్షణము పొంగగ వాగులు నెల్ల చోటులన్
కాతరులైరి యెల్లరట కాటుక మబ్బుల ధాటికె,ట్టులో
శీతల మంద వాయువులచే వణికించెడు వేళ, సాగె నా
రాతిరి; తూర్పుకొండ లభిరామము లైనవి సూర్యకాంతులన్.
------------
మత్తేభవిక్రీడితము-
నవలానాయకుడెవ్వడో? యెపుడొ యేనాడో చెలీ దర్శన
మ్ము? విశేషమ్మగు భాగ్యమెన్నడది? నా మ్రొక్కుల్ ఫలింపంగ నన్,
జవరాలన్ మురిపించు నాథుడెవడో? చక్కన్నివాడెవ్వడో,
ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తా నెవ్వాఁడొకో యెవ్వఁడో.
--------------
మత్తేభవిక్రీడితము-
పవిధాటిన్ తెగు పత్రముల్ పగిది నీ ప్రాణమ్ము కాయమ్ము,దా
లవలేశమ్మును ప్రీతి లేనటుల చేలమ్మంచు వీడంగనే,
భవబంధమ్ములు వీడ; బిడ్డలెవరో? ప్రాణేశ్వరుండెవ్వడో?
ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తా నెవ్వాఁడొకో యెవ్వఁడో.
--------------
ఉత్పలమాల-
అల్పమె రాలఁ జెక్కుకళ? లద్భుతమై యలరారుచుండదో
కల్పములెన్నొదాటినను, కన్నులకింపులు గూర్చి భవ్యమై
శిల్పుల పేర్మి బెంచునిది; శీతలమౌ తెలిమంచుతెమ్మెరన్
శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్.
----------
మత్తకోకిల-
కొత్తరూపును కీటకమ్మది కోరివచ్చిన నేమి? యీ
తిత్తి తోలును వీడి చేరుము దేవదేవుని సన్నిధిన్.
మత్తు వీడుము, జన్మ మృత్యువు- మాయమర్మమె కాదొకో!
చిత్తమందున భక్తినిల్పుచు సేవజేయుచు నుండుమా!
--------------
చంపకమాల-
హయముల మించు వేగమున హర్షమునింపు జనాళి వ్రాతలన్,
రయమునఁ దెచ్చి యిచ్చుచు, కలంతలఁ దీర్చగ నాప్తుఁగల్పుచున్,
మయసభఁ బోలు జాలమిది , మాయల జాలము; మేలు కార్యముల్
ప్రియముగ సల్పుమా! పరుల భీతిల జేయకు కీడొనర్చుచున్.
------------
చంపకమాల-
బుధజన సేవితాంఘ్రి యుగమున్ స్మరియించుచు పద్యమల్లగా
సుధలను నింపుమీవె విన సొంపుగ నుండగ నాంధ్రభారతీ!
మధువనమట్లు వేదికయె మారగ జేయవె శబ్దమాధురీ
దధిని రసానుభూతి యిక దక్కగ వెన్నగ మమ్ముబ్రోవవే!
--------------
మత్తకోకిల-
వచ్చెనోయి వసంతమిచ్చట బాలబాలకులెల్లరున్
వచ్చిచేరి సరాగమాడుచు పాడియాడిరి ప్రేమతో
పచ్చనాకుల రంగుపువ్వుల పల్లెసీమల అందమే
మెచ్చి వారికి రంగులిచ్చుచు మేలమాడగ వేడుకే!
------------
మత్తేభవిక్రీడితము-
జనసమ్మోహన శక్తి చేత, వినగా సంగీతమెల్లప్పుడున్,
విని యాస్వాదనఁజేయగల్గినను వెన్వెంటన్ ధ్వనుల్ పెచ్చుమీ
రినచో భక్తినిఁ బాడు గీతమయినన్, రెట్టింపు గానున్నచో
ధ్వని చేతన్ రసభంగమౌను పరమార్థం బెల్ల వ్యర్థం బగున్.
-------------
ఉత్పలమాల-
నే కలగన్న స్వామివని నిన్ను సదా నెఱనమ్మియుంటి నా
థా! కనులేల చెమ్మగిలె? తర్కముఁ జేయను, వాదులాడ, నే
నీ కమలాక్షిగానె? మరి నిక్కము ముఖ్యము నీదు శాంతియే,
నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు పండునే!
---------------
మత్తకోకిల-
కాలమెల్లను తోడునీడగ కష్టమందున సాయమై,
చాల మేలునుఁ జేయుచుండగ సఖ్యభావన చాలుగా!
నేల నింగినిఁ బోలి యున్నను నెయ్యమెప్పుడు స్వచ్ఛమే,
బాలలందున మైత్రి యేర్పడ పట్టువీడక నుండదే!
----------------
ఉత్పలమాల-
అల్లనసాగరమ్మున మహత్తగు నల్పపు పీడనమ్మదే
మెల్లగ నేర్పడంగను సమీరము వేగముతోడ వీచగా
జల్లులఁ జెట్లు చేమలును స్నానములాడుచునుండ హాయిగా
చల్లగ నయ్యె నీ ప్రకృతి సర్వము గ్రీష్మము వచ్చినంతనే.


22, అక్టోబర్ 2020, గురువారం

పంచచామరములు


 
వివేకమున్ననేమి యందు వృద్ధిఁగాంచకున్నచో
భవంపు మోహఛాయలైన వాడకుండనున్నచో
నవీనమార్గమేమిటన్న నాదు సందియమ్ము లో
దివమ్మురాత్రి జీవనంపు తీరు వ్యర్థమే కదా!
 
విమానయానమల్లె నింగి వేగిరమ్ము సాగుటన్
సమాహితమ్ముగా మనమ్ము చక్కజేయకున్నచో
ప్రమాదమెంత పొంచియుందొ భావియందునన్ కదా!
తమమ్ము నిండి యున్నదోయి ధాత్రియెల్ల దిక్కులన్. 
 
ప్రయాణమెల్ల చక్కనైన పద్ధతుండనీ సదా!
నయానయానముండనిమ్ము నావ సాగనీ సదా!
రయమ్ము తగ్గినంతనేమి రమ్యమై సు వాసనా
మయమ్ముగా వసంతవాసమై ఫలించనీ సదా