Loading...

16, ఫిబ్రవరి 2019, శనివారం

స్వయంకృతాపరాధమే

                         ఆత్మాహుతి జీహాదీ , మళ్ళీ పెద్ద సంఖ్య (ఈమధ్య కాలం) లో సైనికుల దుర్మరణం, మళ్ళీ అన్ని మీడియాల్లో నిప్పులు గ్రక్కడం, మళ్ళీ ఎమ్ ఎఫ్ ఎన్ స్టేటస్ తీసేయడం, మళ్ళీ  (నేరస్తులకు తగిన శిక్షల) అవే ప్రకటనలు, మళ్ళీ రెండు రోజులకు అదే ఆక్రోశాల వీధికి ఇంకొక ఘటన అతిథిగా వస్తే దీన్ని వదిలేసి మరిచిపోవడం. ఎన్నిమార్లిలా?
                ఎందుకు ఆవేశాలిలా అనేది ఇప్పటి నా సందేహం. అందాల కాశ్మీరు అఘాయిత్యాల ప్రదేశం గా మారి ఎన్నేళ్ళయింది? రోడ్ల మీద జవాన్ల దారిలో ఎన్ని సార్లు బాంబులు నాటారు? ఎన్ని సార్లు సూయిసైడ్ అటాకర్లు వచ్చారు? ఈ నాటి సమాచారయుగంలో ఇది ముందుగా కనిపెట్టడం , నివారించడం, కనీసం ఎదుర్కొనే సంసిద్ధత లేకపోవడం ఎలా? (రెండు రోజుల ముందు ట్విట్టర్ లో ఈ వార్త తిరిగిందని వదంతి)పైగా వెహికిల్ వేస్కుని వందలకేజీల విస్ఫోటకాలు పట్టుకొస్తూంటే అంత పెద్ద డెబ్భైఎనిమిది వాహనాల కాన్వాయ్ దగ్గరికి చేరుతుంటే ఎలా ఆపలేకపోయారు? ఆకాశం నుంచైతే ప్రత్యక్షం కాలేదు గా?మనకు చేతగాలేదు ఇక ఈ ఆర్భాటపు పలుకులెందుకు?

            యుద్ధం చేయాలని, బుద్ధి చెప్పాలని ఈసారి లెఫ్ట్ రైట్ లన్నీ రెచ్చిపోతున్నాయి. అసలు కనిపించని శత్రువుతో ఎవరు ఎలా యుద్ధం చేయగలరు? ఆర్మీకి ఫ్రీ హేండ్ ఇచ్చారట. ఇస్తే?? ఏమవుతుంది?

             యుద్ధానికి సిద్ధమవ్వాలంటే ఆయుధాలు, ఆత్మవిశ్వాసాలు మాత్రమే కాదు. ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. కార్గిల్ లోనో ఆత్మరక్షణ లాగా, బంగ్లాదేశ్ ను లిబరేట్ చేయడం లాగా, ఇంకా మిగతా వాటిలాగా ఒక లక్ష్యం ఉండాలి. (plan of action, strategy) శత్రువు ఎవరు అని ఒక స్పష్టత ఉండాలి. ఉన్నా ఉపర్యుక్త విషయాలలో జరిగిందేమిటి , ఎవరు ఎలా గెలిచారు, ఓడారు అన్నది వేరే మాట. అసలు అయితే లక్ష్యం ఉంది. ప్రత్యర్థి ఉన్నారు.

                పాకిస్తాన్ బేస్డ్ అనే అన్ని సమూహాల గురించీ పత్రికలు వ్రాయగలవు తప్ప పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందనడానికి మనం ఆధారం సంపాదించలేకపోయాం. ముంబయిదాడిలో అన్ని ఆధారాలు వగైరాలు పంపించినా పాకిస్తాన్ ని ఒప్పించలేకపోయినాం. పెద్ద నాయకులంతా నోటి వరకూ , ప్రసంగాల వరకూ తిట్టిపోయగలరే కాని వాస్తవమైన , క్షేత్రపరమైన, వస్తుపరమైన ఆధారాల గురించి రైటింగ్ లో పెట్టలేరు. చప్పున పోయి పాకిస్తాన్ శత్రుదేశమని యుద్ధం ప్రకటించడం కుదిరే పని కాదు. అంతర్జాతీయ సమాజమూ కట్టుబాట్లు కొన్ని ఉంటాయి.

         పైపెచ్చు ఒకటి రెండు నెలల్లో ఎన్నికలు ఇంత పెద్ద ప్రాంతంలో నిర్వహించే పెద్ద పెళ్ళి పని ముందుండగా , ఇప్పటి ప్రభుత్వం పెద్ద నిర్ణయాలు తీసుకుంటే ఎక్కడ పార్టీ పరంగా నష్టపోతామో అని పైపై మాటలు చెప్తుందే గానీ ఏ రిస్కూ తీసుకోదనేది బహిరంగ రహస్యమే.

      ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే ఏమీ జరగబోయేది లేదు. లేని పోని ఆవేశాలెందుకు వ్యక్తిగత , సంస్థాగత మీడియాల్లో? దండగ.

           పైగా ఇది మొదటిది కానట్టే చివరిదీ కాదు. అశుభం పలకాలని కాదు కానీ ఇదంతా మన స్వయంకృతాపరాధమే కాబట్టి ముందు వచ్చే పరిణామాలు ఇంతకన్నా గొప్పగా ఉంటాయని ఆశించలేము.
కాశ్మీరు రాజు హరిసింగ్ కలవాలనుకోలేదు కొన్నాళ్ళు  , ఏదో అవసరంకొద్దీ పాకిస్తాన్ దాడి చేస్తే సాయం అని వచ్చినప్పుడు కలిసిపోతేనే వస్తాం అని సంతకాలు పెట్టించుకున్నామన్నది మరిచిపోరాని చరిత్ర. తర్వాత నచ్చని వాళ్ళు కుట్రతో మాయోపాయాలతో (ప్రజల అభిప్రాయం అంటున్నారని) ప్రజలనే రిప్లేస్ చేసి అభిప్రాయాలను తిరగరాసేశారు, కుట్రో మరోటో. మనము వాళ్ళు కలిసి సృష్టించుకున్న ఈ మారణహోమం ఇప్పట్లో చల్లారే ఆశ కనిపించట్లేదు. మనము పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరని, వాళ్ళు ఇండియా ఆక్రమిత/పాలిత కాశ్మీరని కొట్టుకుంటూ ఉంటాము. ఉన్నట్టుండి ఏదో చమత్కారం జరిగి అంతా బాగై పోయే ఆశ పెట్టుకొని కూర్చోవడం తో సహా ఇప్పుడు జరిగే knee-jerk  reactions అన్నీ హాస్యాస్పదాలే.