Loading...

29, ఏప్రిల్ 2018, ఆదివారం

కొన్ని పద్యాలు

ఉ. సారములెల్ల నేర్చిన విశారదు తండ్రికి నొక్క దెబ్బకీ
భూరి ప్రపంచమెల్ల విన బొబ్బలు వెట్టుచు స్తంభమొక్కెడన్
తీరుగ వ్రచ్చిలన్ వెడలి తీండ్రిలు వానిని మట్టుబెట్టవే!
పారము ముట్ట, నా దుడుకు బద్దలు చేయగరమ్ము శ్రీహరీ! 


కం.  ఇచ్చకములనాడగ, మది
ముచ్చట పడినట్లు చేయ మోహములెన్నో.
హెచ్చగుచుండగ , మరిమరి

యిచ్చట నెగ్గుటలెటులను నెఱుకయు నిమ్మా..


కం. మాయామేయము జగమిది
కాయమ్మైనను మురిపెపు కలయేయైనన్
ప్రాయమ్మైనను నొకచో
బాయక మానునె, యెవరిది పంతము చెల్లున్?
--------లక్ష్మీ దేవి.

18, ఏప్రిల్ 2018, బుధవారం

పది రూపాలకు మంగళమ్.

సీసము-

నీటిలో నొక చేప, నిక్కి చూసెడిదొక
కూర్మమ,దియె చూడు గొప్ప కిటియు,
గర్జించు సింహమ్ము, గరిమ గల వటువు,
విల్లు బట్టెడు వాఁడు, నల్ల చెలుఁడు,
హలము భుజమునున్న బలుఁడ,దొ పరశువు
బట్టిన వాని,దా పదనుఁ గనుము
తురగమ్ము నెక్కుచు తొందర నొచ్చెడు
కల్కి యొక్కడినిటఁ గాంచగలము. 


ఆటవెలది-
 వందనములు పలికి పద్మనాభునికిట
పలుకు పాట వోలె పాడుచుంటి
మంగళముల పాట బంగారు నోటనఁ
బలుకుచుంటి స్వామి పదము చేరి.

14, ఏప్రిల్ 2018, శనివారం

ఓర్వబోకుమా!

కర్కశమానసులకు, కటు
మర్కట బుద్ధులకు కఠిన మరణము విధిగా
నర్కుని యుదయము లోపల
తర్కములాడక విధింప తామసమేలా?

ధర్మపు మార్గమున్ విడచి తామసబుద్ధిఁ బ్రజాళినిట్టులే
మర్మమెఱుంగజాలరని, మాయల నుచ్చుల వ్రేల్చునట్టి దు
ష్కర్మలఁ జేయగాఁ దలచు క్రౌర్యముఁ జూపెడు వారికి, నదే
దుర్మతితోడఁ దోడ్పడెడు దుష్టులనెప్పుడు నోర్వబోకుమా!

కిలకిల నవ్వుతో, పలుకు కీరముఁ బోలెడు బాలలిద్ధరన్
పలువుర దీవనల్ బడసి భద్రమునుండగ కోరుకొందమీ
యిల గల తావులెల్లెడల నెక్కుడు క్షేమము నుండ పెద్ద వా
రలు కడు శ్రద్ధతో మసలి రక్షణఁ జేయగ శక్తి కావలెన్.
----