Loading...

23, డిసెంబర్ 2018, ఆదివారం

తప్పే కదా!

                     భారతదేశం పక్కదేశాలపైన దండెత్తదంటూ మన భుజం మనమే చరచుకోవడం గొప్పలకు బానే ఉంటుంది, అది నిజంగా ఎంతవరకు నిజం? అవతలి దేశపు బలహీనతలను దురుపయోగం చేసుకోకుండా ఉండగల స్వభావం, సత్ప్రవర్తన మనకు ఎంతవరకు ఉన్నాయో, ఆకాలం విషయాలు పక్కన బెట్టి సమకాలీన పరిస్థితులలో మనం ఏం చేస్తున్నామో చూద్దాం.
https://www.forbes.com/sites/saritharai/2013/10/30/indian-outsourcing-firm-infosys-to-pay-record-u-s-visa-fine/#3c923548806f

             అమెరికా  లో ప్రతిభకు గుర్తింపు, మంచి సంపాదన, లివింగ్ కండీషన్స్ అంటూ ఆలోచించే వ్యక్తిగత వలసల విషయం సరే. ఆ మధ్య కాలంలో అమెరికా వీసా నిబంధనల సడలింపు జరిగాక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగస్తులను హెచ్ ఒన్ బీ వీసాల ముసుగులో మిగతా వీసాల వాళ్ళను కూడా అక్కడికి తరలించి, వాళ్ళు వాళ్ళ స్పౌసులను, క్రమేపీ ఇన్ లాసు ను ఇలా గుంపులు గుంపులుగా అక్కడ సెటిలైపోయి, కంపెనీలలో ఇలా వెళ్ళిన వాళ్ళు పాలెగాళ్ళుగా ఆధిపత్యం చెలాయిస్తూ, అక్కడి అమెరికనులను, అమెరికను పౌరసత్వం పొందిన ఇతర భారతీయులను కూడా వివక్షకు గురి చేస్తున్నారని స్వయంగా భారతీయకంపెనీల ఐటీ సేవలను పొందిన ఒక ఎన్ ఆర్ ఐ వ్రాసిన వ్యాసం ఒకటి  ఉదయకాల అనే కన్నడ పత్రికలో రెండు భాగాలుగా ప్రచురింపబడింది.
      
            ఇవేవీ వ్యక్తిగతంగా ఒకరో ఇద్దరో చేయగలిగిన పనులు కాదు, కంపెనీలు వెనుక ఉండి చేయిస్తున్న పనులు. దీనిద్వారా వీళ్ళంతా ఒకదేశాన్నేదో నాశనం చేస్తారని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ వీసా నిబంధనల లో ఉన్న లొసుగులను ఇక్కడ చట్టాలకు మల్లేనే దురుపయోగం చేయడానికి కొన్ని కంపెనీలు వెనుకాడలేదు. ఎక్స్ పర్ట్ లన్న పేరుతో సాఫ్ట్ వేరు కు సంబంధంలేని వాళ్ళు కూడా తక్కువ రాళ్ళకే దొరుకుతారంటూ క్లయింట్లను మభ్యపెట్టి, క్రమంగా ఒకరికి నలుగురిని పంపుతూ ఇలా వెళ్ళిన గుంపులంతా అక్కడ భారతీయసంస్కృతిపేరుతో నానా రచ్చా చేస్తూ ఒక సంఘం మీద ఇంకొక సంఘం దుమ్మెత్తిపోసుకుంటూ చాలా కాలమే గడిచింది.
                  ఇప్పుడు అమెరికా మేలుకొని వీసా నిబంధనల పై వారికి ఉపయుక్తమైనట్టుగా ఆంక్షలు విధించేసరికి కంపెనీలెన్నో అమెరికాకు ఫైనులు కడుతున్నాయట. మేమేమీ నిబంధనలను అతిక్రమించలేదని వారంటున్నా, దురుపయోగాలంటూ జరిగాయి. green pastures ను వెదుక్కుంటూ పోవడం వేరు. వ్యాపారపరంగా ఒకనాడు ఈ దేశానికి వలసలు జరిగాయి. ఈనాడు మేధోపరంగా మనదేశం చేస్తున్నదాంట్లో ఏ సమస్యా లేదనీ, రాదనీ చెప్పగలమా? భావిప్రశ్నలు అలా ఉండనీ నేడు జరుగుతున్నది చూస్తుంటే ఈ వ్యాసం మొదట్లో చెప్పుకున్న గొప్పలకు మనం అర్హులమేనా అన్న ప్రశ్నకు పూర్వపు ఆధారాలవరకూ అక్కర్లేదు, ఈ నాటి ఈ ఆధారాలే చాలు కాదనడానికి అని తెలుస్తోంది కదా.

27, నవంబర్ 2018, మంగళవారం

గీతం

ఈ పాట నేను వ్రాయగా 26-11-18 న ఆకాశవాణిలో ప్రసారమైంది.
గానం- డి వి మోహనకృష్ణ మరియు బృందం.
 సంగీతం - కే సూర్యనారాయణ దీక్షితులు
 ఆకాశవాణికి కృతజ్ఞతలు.

హరినారాయణ యని మనసారగా అననీయరా
కరివరదా నిను శరణాగతిగా కననీయరా ॥ హరి॥

సుఖసౌఖ్యమ్ముల సంతోషమ్ముల
నంతో ఇంతో గాంచితినయ్యా
కష్టమునోర్చి ఇష్టము విడచి
నిష్టూరమ్ముల నొచ్చితినయ్యా
 నీకడ నాకిక నిలకడ నొసగుము నమ్మకముంచేనురా ॥హరి॥

విసిగితినయ్యా భవ బంధమ్ముల
వేసారితినీ యారు గుణమ్ముల
రోసితినయ్యా ఇహలోకమ్మున
నలిగితి నేనూ ఆశనిరాశల
నీ కడ నాకిక నిలకడ నొసగుము నమ్మకముంచేనురా ॥ హరి॥

----
సంవత్సరం క్రితం (ఋషిపీఠం పత్రికకు) వ్రాసిన పద్యాలు -
ఇందులో భావం గురించిన అజ్ఞానం మీద గురుకృప వలన కొంత కాంతి ప్రసరించింది. పద్యాల నడక గురించిన ఇష్టంతో ఇక్కడ పెడుతున్నాను.  (సంస్కృతం లోని నయనపథగామీ అష్టకానికి స్వేచ్ఛాను వాదము)
మత్తకోకిల ఛందోరూపము-
1. నాదమా యమునానదీ తటి నల్లనల్లన మ్రోగగా,
నాదిలక్ష్మి, గణేశ, బ్రహ్మ, మహా శివాదులు మ్రొక్కగా,
స్వాదుమాధురి గోపిమోమున సాజరీతులఁ గ్రోలుచున్,
నాదు దృక్కుల నిల్చియుండుము నాథ! నీలపు మాధవా!

2. వంశి, పింఛము, పట్టుదట్టియు, పాలనవ్వుల తోడుగా,
నంశుమంతులు వేలు కూడిన నబ్బురంపు ప్రకాశమున్,
సంశయమ్ములఁ దీర్చుచుండెడి చల్లనైన కటాక్ష మే
యంశమైనను నాకుఁజూపుమటందు, నీలపు మాధవా!

3. నీలపర్వత శ్రేణులందున, నీలి సంద్రపుతీరమున్,
చాల ప్రీతిని యన్నతోడ, నిజానుజాత సుభద్రతోన్,
మేలుకొల్పులు వేల్పులందరు మించు భక్తినిఁ బాడగా,
నేలుచుంటివి. దర్శనమ్మిడు నేడు, నీలపుమాధవా!

4. ఆ కృపార్ణవు, మేఘవర్ణుని నా సతీ కమలాక్షియున్,
నాకనాథుఁడు, శారదాసతి నమ్మి కీర్తనఁ జేయగా,
లోకబంధుగ నా శృతీస్మృతులొక్కటై నినుఁ గొల్వగా,
నాకు దిక్కుగ నిల్చియుండుము నాథ! నీలపు మాధవా!

5. భూతలమ్మను స్యందనమ్మున పుణ్యవంతుల పంటగా
గీతనాట్యపు సంభ్రమమ్ముల కృష్ణభక్తుల వేడుకై
జోతలందుచు నేగుచుండెడి శోభఁ గాంచగ వేడుదున్,
నా తమింగని కానుపింపుము, నాథ! నీలపు మాధవా!

6.నీరజాక్షుఁడు, దివ్యతేజుఁడు, నీలికొండకు నేలికై,
కోరుకున్న లలామ రాధకు కొంగుబంగరు పోలికై,
కూరిమిన్ తననాదిశేషుఁడు కోరి మోయుచునుండగా,
దారి చూపెడి స్వామివందురు, దారు నీలపుమాధవా!

7.హాటకమ్ములు, సంపదల్ మరి యాధిపత్యముఁ బెండ్లియున్
మాటకైనను కోరనెప్పుడు. మా మహాశివుడర్చనల్
మాటిమాటికి చేయు స్వామివి, మాదు డెందము నిండ, నే
నాటికిన్ స్థిరవాసముండుము నాథ! నీలపుమాధవా!

8.సారహీనపు బంధనమ్ములు, చాల పాపపు మూటలున్
భారమైనవి. మోయజాలను పాపనాశ! భవాబ్ధినిన్
తారకమ్మయి కావరాగదె, దానవాంతక వేగమే!
జారకుండెడి భక్తినీయవె చాలు, నీలపుమాధవా!

ఈ సంబోధన ల వంటి నామరూపలింగభేదాలు వర్జ్యాలు.
ఈ విషయంలో దారిచూపగలిగిన వారు సూచనలివ్వగలరని ఆశిస్తాను.

7, నవంబర్ 2018, బుధవారం

యుక్తము - అయుక్తము




కం.
యుక్తము కానిది యెయ్యద,
యుక్తము కానిదది యేదియొ, తెలుపు సరియౌ
క్తినొసంగు వివేకము
ముక్తి నొసంగును జగతిని ముమ్మాటికినిన్.

డిగియు తెలియందగు, నీ
డుపును మొగమాటమియును ప్పున విడుమా!
విడుమిక యజ్ఞానమ్మును
డిగా జ్ఞానుల పదముల ట్టుము సుమ్మా!

గాడిద భంగిని పనులను
నేడులు గడువగ, పనితనమెంతగనున్నన్
పాడియు గాదది, జ్ఞానము
నేడుగడగ తెలియక నరుడెచ్చట నున్నన్.

చెప్పిన శ్రద్ధగ వినిననె,
ప్పున యవగతమగునను క్కని మాటన్
ప్పియు మరువగరాదది
యొప్పుగ నడవడి గలిగిన నొజ్జయు నేర్పున్.

తెలివిడి యున్ననె విషయము
తెలియును మూఢత మునుగ తేలగ గలమే?
లువురు జ్ఞానులు జగతిని
రని తెలిసిన యడుగులు దుపగ రాదే?


http://www.sanchika.com/5-kandamulu/

21, సెప్టెంబర్ 2018, శుక్రవారం

ఎటు పోతున్నాం?

.
ఈ రెండు మూడు రోజులు నిమజ్జనం, ట్రాఫిక్ జామ్ తో ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఈ పదిరోజులూ పనికిమాలినవీ భరించలేక అవాయిడ్ చేసిన పాటలన్నీ గణేశుడి పేర్లతో కలుపుకొని మైకులలో వినక తప్పదు. లడ్డూల వేలం వేయడాలు చిన్న ఊళ్ళకు కూడా పాకింది. డెబ్భై వేలు ఎనభైవేలు పలుకుతుంది. అక్కడ వాడిన హారతిపళ్ళాలు ఏవీ వేలానికి అనర్హాలు కాదు. అంటే ఇలా విగ్రహాలు పెట్టి వాటికి పెట్టుబడి పెట్టి మళ్ళీ వేలం వేసి అమ్ముకుంటున్నారు. అంటే ఇదంతా వ్యాపారమైపోయింది. వ్యాపారంగా విస్తరిస్తూనే ఉంది.

దేవుని మీద నమ్మకం ఉంటే ప్రశాంతంగా పూజ చేస్కోవచ్చు. లేదా ధ్యానం చేస్కోవచ్చు. లేదా ఎవరింట్లో వారు పండగ చేస్కోవచ్చు. అంతే కానీ ఈ పండుగ బజారులో చేయిజారి పడిన పండు లా అయిపోయింది.
విగ్రహం సైజులో పోటీలు ఒకదాన్ని మించి ఒకటి పెద్దగా, ఒకదాన్ని మించి ఒకటి వింత భంగిమల్లో ఎన్ని చేస్తారో , పోయినేడు చేసినవి కూడా ఆ యా తయారీ చోటుల్లో అలా పడి ఉంటాయి.


తర్వాత నిమజ్జనంలో మునిగినవి మునగగా కొన్ని విరిగి పడిన ముక్కలు తీసి చెరువులు శుభ్రపరచడం దీనిలో ఏమైనా పవిత్రత మిగిలిఉందా? పూజ చేసిన వాటిని చెత్తలో పడేసినట్టు పడేస్తున్నామా అని ఇక ఎప్పటికీ ఆలోచించమా మనం?
దేవుడిని నమ్మడం, పూజచేయడం నుంచి ఆత్మజ్ఞానం వరకూ వెళ్ళే దారి కనుచూపుమేరలో లేదు. కనీసం చేసే పని అయినా ఒక అంకితభావం లేకుండా మొక్కుబడిగా వ్యాపార వృద్ధి పథకాల మార్గదర్శనంలో వెళ్తూ ఉంటే చివరికి మనలను చూసి మనమే సిగ్గుపడే దారిలో మాత్రమే నిరవధికంగా సాగుతున్నామా? ఎటు పోతున్నాం? 

9, సెప్టెంబర్ 2018, ఆదివారం

కందములు- సంచిక

శరీరంలో ఉంటూ శరీరక్రియకు తోడ్పడేవి
సృష్టిలో ఉంటూ సృష్టి లయకు తోడ్పడేవి
 పంచభూతాలు అని పెద్దలు చెప్తారు.

http://sanchika.com/kandamulu-pancha-bhootamulu/

27, జూన్ 2018, బుధవారం

విద్య - జిజ్ఞాస

సమస్య ఏమిటి? 
                   ప్రపంచంలో అనేక మూలల నుంచి అనేక  కొత్త సిద్ధాంతాలు, కొత్త పరికరాలు నిరంతరం కనిపెట్టబడుతూ ఉన్నాయి. వీటివలన విద్యార్థులు, జనబాహుళ్యం అధికాధికంగా ప్రయోజనం పొందుతున్నారు. వీటన్నిటిలో నేటి కాలంలో మన భారతదేశంలో జరుగుతున్న పరిశోధనలెన్ని? ఆవిష్కరణలెన్ని? దాదాపు లేనట్లే. శాటిలైట్ ప్రయోగాలలో , సాఫ్ట్ వేర్ రంగంలో మాత్రం మన దేశంలోని మేధకు మిగతా దేశాలతో సమానంగా, కొండొకచో అధికంగా గుర్తింపు ఉంది. సంతోషించదగ్గ విషయము.

  ప్రాథమిక శాస్త్రాలలో ఈ మధ్య కాలాలలో మన దేశపు పరిశోధకుల పాత్ర దాదాపు మృగ్యము.
                  దీనికి కారణాలు అనేకములు. కావలసిన వస్తుసామాగ్రి, ప్రోత్సాహకర వాతావరణాలు లేకపోవడం వంటి అనేక కారణములు ఉండవచ్చు. అయితే ఇవన్నీ ఈ క్షణమే కల్పింపబడినా అన్నిటి కన్నా ముఖ్యంగా కావలసింది వ్యక్తిగత జిజ్ఞాస. వ్యక్తులు జీవితాలను అంకితం చేస్తూ స్వసౌకర్యాలను వదలుకొని పరిశోధన చేయడానికి కావలసినది ఆ వ్యక్తి లోపలి జిజ్ఞాస. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే తీవ్రమైన ఇచ్ఛ. అది పరిశోధనకు ముఖ్యమైన ఆధారము. దీనికి తోడ్పడేది అంతవరకు తెలుసుకున్న- విద్య. విద్ అంటేనే తెలియడం, ప్రాథమిక జ్ఞానం అది గురువులు అందించేది. అదికూడా గూగుల్ సెర్చ్ లో నేడు తెలుసుకున్నట్టు, ఇప్పుడు బళ్ళలో మెదడును నింపుతున్నట్టు తెలియడం కాదు. పూర్తి అవగాహనతో తెలియడం.ఒకే ఒక విషయాన్ని తెలుసుకున్నా పూర్తి అవగాహనతో తెలుసుకోవాలి. అప్పుడే ఆ విషయం గురించి మరింత ముందుకు వెళ్ళి శోధించే (వెనుదిరగనంత) బలమైన ఆలోచన కలుగుతుంది.

పరిశోధనాలక్ష్య జిజ్ఞాస ఎందుకు లేదు?
               జిజ్ఞాస సహజంగా రావచ్చు లేదా విషయం లోతుగా అవగాహన అయ్యేకొద్దీ రావచ్చు. కొద్దిస్థాయిలో జిజ్ఞాస ప్రతి వారికీ ఉంటుంది. జిజ్ఞాస ప్రాథమికస్థాయి విద్యను అభ్యసించే సమయంలో ప్రోత్సహింపబడాలి. తరువాత తగు పాండిత్యం/అవగాహన పెంపొందింపబడినాక చేయూత పొందాలి. ఈ రెండు దశల్లో మన విద్యావిధానము, దాని అమలు మెఱుగు పడాలి.

విద్యావిధానం
                   విద్యావిధానం అన్నది బడులలో వివిధ స్థాయిలలో బోధించ వలసిన పాఠ్యాంశాలలో దశలవారీ స్థాయి విజ్ఞానము,  బోధనాపద్ధతి, కావలసిన గ్రంథాల ప్రచురణ మరియు వితరణ, మూల్యాంకనా పద్ధతి మొదలైన విషయాలలో అత్యున్నత స్థాయిలో అనుభవము, ప్రతిభ ఉన్న వారు సమితులుగా ఏర్పడి, తగు పరిశోధన, చర్చ, తులనాత్మక అధ్యయనాల తర్వాత మెఱుగైన రీతిలో మనకోసం ఏర్పరచబడింది.
      ఈ పద్ధతులలోనే చదువుకొని చక్కటి నిష్ణాతులైన చదువరులు ఎంతో మంది ఉన్నారు. కానీ గమనిస్తే, 
       ఈ విషయంలో మూల్యాంకనా పద్ధతి  విద్యార్థుల ప్రతిభను అంచనా వేసే ప్రక్రియలో మనోస్థైర్యాన్నిదెబ్బతీసే విధంగా ఉండడం విచారకరము. దీనికి ఫలితాలు వచ్చినరోజు  విద్యార్థుల ఆత్మహత్యల/ క్రుంగుబాటు ల ఘటనలు సాక్ష్యం. అంతే కాదు, ఇంజనీరింగ్ పాసవుట్స్ ఎంతోమంది తమ కంపెనీల్లో ఉద్యోగానికి అర్హులు కారని ఆయా కంపెనీల స్టేట్ మెంట్స్ చూస్తుంటాం. డాక్టర్స్ కు కూడా అందరికీ ఒకేస్థాయి పరిజ్ఞానం ఉంటుందని పేషెంట్ లోకం నమ్మటంలేదు. ఇక  పిహెచ్ డీ పేరుకే గాని తగిన స్థాయి ఎంతమందికి ఉంటుందో చెప్పలేని పరిస్థితులున్నాయి. ప్రొఫెషనల్ చదువులు ఇలా ఉన్నప్పుడు మామూలు చదువుల నాణ్యత గురించి పెద్ద ఆశలేమీ లేవు. ఇవన్నీ సాక్ష్యాలు.ఇందులో ఫెయిల్ అయిన వారే కాదు, పాస్ అయిన వారే కాదు, తొంభైశాతం మార్కులు తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. అయినా ప్రతిభ లేకపోవడానికి కారణం ఏమిటి? దీనిని పరిశీలించేముందు కొన్ని విషయాలు-

          ఈ విద్యావిధానంలో సక్రమంగా ప్రణాళిక వేసిన మొదటి మూడు అంశాలనైనా అదే స్ఫూర్తితో అమలు పరచడం జరుగుతున్నదా అంటే లేదనే చెప్పాలి. చాలా వరకు ప్రభుత్వ, ప్రయివేటు బడులలో శిక్షణ పొందిన సిబ్బంది ఉండడం లేదు.   అన్ని సబ్జెక్ట్ లలో , భాషలలో కూడా థియరీ తో పాటు ప్రాక్టికల్ గా అభ్యసించవలసిన అనేక సంగతులు పాఠ్యపుస్తకాలలో ఉన్నా వాటి తయారీ బడులలో ఉండడం లేదు.
               ఊహ తెలియని వయస్సులో ఒక యూనిఫార్మ్ డ్రెస్సింగ్ లో లేచీ లేవగానే బడికి వెళ్ళిన పసిబాలలు సాయంత్రం ఇంటికి వచ్చాక హోమ్ వర్క్ ముగించేవరకూ సమాచారం సేకరించడం, పరీక్షల రూపంలో వెళ్ళగ్రక్కడం అనే పనుల్లో శిక్షణ ఇస్తూ ఉన్న నేటి పరిస్థితులలో వారి సహజమైన ప్రతిభ, జిజ్ఞాస, ఆలోచనాశక్తి పెంపొందే అవకాశాలు సగం తగ్గిపోతున్నాయి. థియరీ తో పాటు ప్రాక్టికల్ గా చేసే ప్రాజెక్టులు , అభ్యాసాల పైన శ్రద్ధ లేదు. ఈ మధ్య అతి కొద్ది సంఖ్యలో బడులు దృష్టిపెడుతున్నాయి కానీ ఎక్కువ బడులలో లేదు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ గ్రాంటులు సమయానికి రావు. ప్రైవేటు బడులలో ఒక రూపాయి పెట్టుబడికి రెండు రూపాయల లాభం రానిదే వారేమీ చేయరు.
కాబట్టి విద్యార్థులు కేవలం పుస్తకజ్ఞానమునే తప్ప ఆలోచనల వికాసాన్ని పొందడం లేదు.
           ఫార్ములాలు, టెర్మినాలజీ, ఎక్కాలు వంటివి కొన్ని బట్టీ పట్టడం తప్ప మార్గం లేదు కానీ పాఠ్యాంశంలోని కాన్సెప్ట్ ని కూడా  అర్థమయ్యే వారు  చేసుకోవడం, లేని వారు దాన్నీ బట్టీ పట్టడం జరుగుతోంది. కానీ ప్రతి కాన్సెప్ట్ మీద థియరీతో సమానంగా, అంతకంటే ఎక్కువగా అభ్యాసాలు/ప్రయోగాలమీద కేటాయిస్తే అందరికీ కనీస స్థాయిలో అవగాహన వస్తుంది. పుల్ల విరుగుతుంది అని పది సార్లు చదవడం/వ్రాయడం తో పాటు ఒకసారి విరిచి చూస్తే పూర్తి అవగాహన వస్తుంది. దేశంలో ఉన్న రాష్ట్రాల గురించి చెప్పే టపుడు ఆ ఊర్లో ఉన్న వీధుల గురించి, ఆ పట్టణ పాలన విషయాల గురించి పరిచయం చేయగలిగితే పూర్తి అవగాహన వస్తుంది. ఛందస్సు నడకను బట్టీ పట్టే బదులు ఒకటికి నాలుగు తేలిక పద్యాలు వ్రాయడం అభ్యసిస్తే పూర్తి అవగాహన వస్తుంది. ఇవన్నీ పుస్తకాలలో ఉంటాయి. ప్రతీ పాఠం వెనుకా తరగతి స్థాయికి తగిన ఏదో ఒక ప్రయోగం గురించి సూచన ఉంటుంది. చేయించేవారెంతమంది టీచర్లున్నారు? లేరు. మార్కులు తెప్పిస్తే చాలు అనుకుంటున్నారు.
         చాలా వరకు స్కూళ్ళలో ఏ నెలకా నెల సిలబస్ తయారు చేస్తారు. ఒక్కోటీచరు నాలుగైదు క్లాసులకు తక్కువ అటెండ్ కారు. అన్ని క్లాసులకు చెప్పాల్సిన సిలబస్, క్లాసు పరీక్షల ప్రశ్నపత్రాల తయారీ, ఆన్సర్ షీట్లు దిద్దడం వరకూ ఆ టీచర్ ఎక్జాస్ట్ అయిపోతుండడం తోనో/ అసలు టీచింగ్ మీద ఆసక్తి లేక ఏ ఉద్యోగం దొరక్క చేస్తుండడంతోనో, జీతం మీద అసంతృప్తితోనో ఇక పాఠ్యాంశపు ప్రయోగాలు, అభ్యాసాల మీద శ్రద్ధ తీసుకోవడం లేదు. థియరీ మరియు మార్కుల మీదే దృష్టి.  వీరి శిష్యులే మళ్ళీ తరంలో టీచర్లు. ఈ విషచక్రం తిరుగుతూనే ఉంది.

                విద్యావిధానపు ఉత్తమ ప్రణాళిక ఇలా దెబ్బతినడానికి కారణం ఏమిటి? 
                 మూల్యాంకనా(మార్కుల) పద్ధతిలో ఉన్న లోపము. 
          మార్కులలో మూడుభాగాలు థియరీకి, ఒకభాగం ప్రయోగాలకూ/అభ్యాసాలకూ ఇస్తున్నారు.( అదీ పెద్ద క్లాసుల్లోనే. చిన్న క్లాసుల్లో అంతా థియరీకే.) ఈ ఒక భాగం మార్కులు స్థానిక పంతుళ్ళ చేతిలోనే ఉండడంతో వాళ్ళు ఎన్నోసార్లు, ఎన్నో చోట్ల రాజీధోరణిలో ఇచ్చేస్తూ ఉంటారు (ప్రయోగాలు చేయించినా నామమాత్రపు తంతే). దాంతో ఈ ప్రాథమిక, ఉన్నత అని పిలుచుకునే ప్రాథమిక స్థాయి విద్యలో మొత్తం పుస్తక జ్ఞానమే ఉంటున్నది. తర్వాత కళాశాల చదువులలో సైన్స్ విద్యార్థులు కొద్దిగా కష్టసాధ్యమైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద పట్టు సాధించుకుంటూ వస్తారు. సైన్స్ / ఆర్ట్స్ విద్యార్థులంతా కూడా ఉత్తమంగానో , మధ్యమంగానో డిగ్రీలు, పీజీలు ముగిస్తారు. ఇక అక్కడితో  కొద్దిమందికి తప్ప మిగతా అందరికీ ఈ మూల్యాంకనా పద్ధతి (వ్రాత పరీక్షలు, దానికి మార్కులు) వల్ల చదువు ఇంక కొనసాగించాలనే తృష్ణ ఏ మాత్రం మిగలకపోవడం చూస్తూనే ఉన్నాం.
              విద్య మీద కొంత అవగాహన, పట్టు వచ్చే నాటికి చదువుకొనే తృష్ణే తగ్గిపోతుంటే ఇక శోధించే జిజ్ఞాస ఎలా వస్తుంది?
ఆసక్తి, తృష్ణ తగ్గడానికి కారణం ఒత్తిడి

          ఇదే పరిస్థితిలోనూ కొన్ని ఇస్రో లాంటి సంస్థల విజ్ఞానులూ, సాఫ్ట్వేర్ కంపెనీల నిపుణులూ ఇతర దేశాలతో పోటీ పడుతున్నారు, నిజమే. కానీ సైన్స్ , టెక్నాలజీ లలో , ఆటల్లో , కళల్లో కూడా ఇప్పుడున్న దానికంటే మంచి ఫలితాలు సాధించాలంటే ఒత్తిడి లేని స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలి. ప్రాథమిక విద్యలో పాస్/ ఫెయిల్, మొదటి రాంకు/ రెండో రాంకు అన్నిస్థాయిల్లో మార్కుల భయాలే ఆవరించి ఉండకూడదు. సెంట్ పర్సెంట్ పాస్ అన్న లక్ష్యంతో స్కూళ్ళు పని చేయడం మొదటి తప్పు. మొదట్లో నాకింకో కోణం తెలియలేదు, టీచర్ గా పని చేసినప్పుడే,  ఫేలయ్యే వాళ్ళ ( అర్థం చేసుకోగల శక్తి తక్కువ ఉన్నవాళ్ళ)/ మార్కులు అందుకోని వాళ్ళ శ్రమ , వైఫల్యం ఏంటో అర్థమైనాయి. నేను చేసిన స్కూల్ లో కూడా టైమ్ అండ్ టార్గెట్సే ముఖ్యం. కానీ అలా కొద్దిగా ప్రతిభ తక్కువ ఉన్నవారికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పుడు వాళ్ళూ మార్కులు తెచ్చుకోగలిగారు. వాళ్ళకు పాఠం అర్థం అయిందా లేదా అన్నదాంతో మేనేజ్ మెంట్ కు పనిలేదు. వాళ్ళూ పాస్ కావాలి, మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఇంకా ఇంకా మార్కులు తెచ్చుకోవాలి, అంతే. స్కూళ్ళలో మేనేజ్ మెంట్ వారి ఇలాంటి విధానాన్ని చూశాక ఇక ఏ స్కూల్ లో పనిచేయ బుద్ధి కాలేదు.
               విద్య మీద ఆసక్తి పెంచడం, ప్రోత్సహించడం, అభ్యాసాల్లో, ప్రయోగాల్లో తోడ్పాటునివ్వడం, స్వీయ అధ్యయనం వైపుకు దారి చూపడం టీచర్ పని. చదువు మీద నిజమైన ఆసక్తిని పెంచడం, ఒత్తిడి లేని వాతావరణాన్నివ్వడం లో నా కర్తవ్యాన్ని నా పరిధిలో సరిగ్గా నిర్వర్తించి ఫలితాన్ని చూశాను.

        కాబట్టి ప్రణాళిక బాగున్నా టీచర్ల పైనా, స్టూడెంట్లపైనా ఒత్తిడి పెరగడం ఈ ప్రణాళిక అమలులో లోపం. మార్కులు తెచ్చుకోవడం, తెప్పించడం మీదే దృష్టి ఉండడం వల్ల ఈ ఒత్తిడి నానాటికీ పెరుగుతోంది.

ఒత్తిడి తగ్గడానికి ఏం చేయాలి?
.) మార్కుల మీద కన్నా సబ్జెక్ట్ మీద ఆసక్తి పెంచాలి. పాస్, ఫెయిల్, అరవై, తొంభై వీటి వలన పోటీ అనూహ్యదిశలో పరివర్తనం చెంది, ప్రతీదశలో (చదువులో, పరీక్షలో, తర్వాత ఉన్నతవిద్య ఎంచుకోవడంలో) ఒత్తిడి పెరుగుతుంది.
.) పరీక్షలు ఉండకూడదని కాదు. స్వచ్ఛందంగా వ్రాయడానికి ముందుకు వచ్చేలా వాతావరణం ఏర్పడాలి. ప్రతీ బాచ్ లోనూ ఆసక్తి ఉన్నవారు, లేని వారు ఉంటారు. వారి మధ్య బలవంతపు పరీక్ష తెచ్చే పోటీకాక ఆరోగ్యకర పోటీ ఏర్పడుతుంది. ఒకరిని చూసి ఒకరు ఉత్సాహం తెచ్చుకుంటారు.
.) దీనికంతా సమయం ఇవ్వాలి.  అతి చిన్న వయసులో రెండు, మూడేళ్ళలో బడులకు పంపనే కూడదు. ఆటపాటల్లో, ఇంటి చుట్టుపక్కల , మనుష్యులతో కలిసి మెలిగే దాంట్లో బోలెడు నేర్చుకునే విషయాలూ ఉంటాయి. ఒత్తిడీ ఉండదు. వాళ్ళు సిద్ధపడినపుడే స్కూలుకు పంపాలి. సిద్ధపడినపుడే పరీక్షలు వ్రాయనివ్వాలి. 
.) ఒకసారి గాడిలో పడినాక టార్గెట్ లు, పోటీలు ఉండవచ్చు. అసలు సిద్ధం కాకముందే పరీక్షల చక్రంలో తోసి, చదువంటేనే భయం, ద్వేషం కలిగించకూడదు.
.) పూర్వం టీచర్ / దండన మీద భయం ఉండేది. అప్పుడే ఆత్మహత్యలు లేవు. ఇప్పుడా అనాగరీక చర్యలు లేకపోయినా ఆత్మహత్యలు ఉన్నాయి. ఎందుకంటే మార్కుల కత్తి వారి మెడ మీద వ్రేలాడుతూ ఉంది.
---------------
{పాతాళ భైరవి లో మొన్నెప్పుడో ఒక సీన్ చూశాను. నాయకుడు కత్తులో/పాములో వ్రేలాడుతున్న ప్రదేశాన్ని ఒక్కంగలో దాటేస్తాడు. ఎందుకంటే వాడి లక్ష్యం మీద వాడికి గుఱి ఉంది. మిగతావి భయపెట్టవు. కానీ వాడికి ఇంకా లక్ష్యం ఏర్పడని స్థితిలో ఆడుకునే వయసులో చూడూ నీవా కత్తుల బోనును దాటాలి అని చెప్తూనే ఉంటే ఖచ్చితంగా భయపడి ఉండేవాడు.}
------------
.) థియరీలో ఉండే డొంకతిరుగుడు మాటలు, టెర్మినాలజీ కన్నా మొదట ప్రాక్టికల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాతే థియరీ పాఠాలు చెప్పాలి. అప్పుడు వారికి తేలిగ్గా అర్థమౌతుంది.
.) చాలా స్కూళ్ళల్లో ప్లేగ్రౌండ్ ఉండనే ఉండదు. ముఖ్యంగా బి సి క్లాస్ టౌన్లలో.  మొత్తం ఏడెనిమిది అవర్సూ లెక్చర్సే. పిల్లలు , టీచర్లూ ఎక్జాస్ట్ అయిపోతారు. చివరి అవర్స్ లో శ్రద్ధ పెట్టలేరు. ఆటలు, ఆటస్థలాలు, లైబ్రరీలు కంపల్సరీ చేయాలి.
(ఇవన్నీ విద్యావిధానం లో ఉన్నవే. అమలు సరిగ్గా లేదు. లంచాలతో లేనివి ఉన్నట్టు చూపి, క్లియరెన్స్ తెచ్చుకుంటూ రెండు తరాలు గడిచిపోతున్నాయి.)
.) స్కూళ్ళల్లో పుస్తకాల చదువు మాత్రమే కాక ఇతర కళలు, పనులు నేర్చుకొనే అవకాశాలుండాలి. చిత్రలేఖనమో, నటనో, సంగీతమో కావచ్చు, కుండలు చేయడం, ఫోన్ల రిపేరీ వంటి టెక్నాలజీ కావచ్చు. ఆటలు కావచ్చు. ప్రతీ రంగంలోనూ రాణించడానికి అవకాశముంది. వారికిష్టమైన పని చేయనివ్వాలి.
{ఇంగ్లండ్ లో సమ్మర్ హిల్  అని ఒక స్కూలు ఉంది. ముఫ్ఫై నలభై ఏళ్ళు టీచర్ గా పని చేసినతను ఒక స్కూల్ పెట్టాడు. అక్కడ విద్యార్థుల మీద ఏ రిస్ట్రిక్షన్సూ , కండిషన్సూ ఉండవు. ఎంతో మొండికి పడి చదువు మీద ద్వేషం చూపిన దేశవిదేశాల పిల్లలు ఆ స్కూల్ లో చేరినాక మారి  జీవితంలో సక్సెస్ చూశారు. ఈ వివరాలన్నీ సమ్మర్ హిల్ అనే పుస్తకం(ఆన్లైన్ పిడిఎఫ్ దొరుకుతుంది)లో డెబ్భై పేజీలకు పైగా ఉన్నాయి. ఆ స్కూల్ లో- చదవాలంటే చదువుకోవచ్చు. వేరే ఏదన్నా పని నేర్చుకోవచ్చు. ఏమీ వద్దని ఉన్న పిల్లలు కూడా రెండు మూడు నెలలలో మిగతా పిల్లలను చూసి ఇన్పైర్ అయి చదువుకోవడం మొదలుపెట్టారుట. మాగ్జిమమ్ ఏడాది ఊరుకున్న పిల్లలు కూడా తర్వాత చదువుకుంటారుట. 
డెబ్భై పేజీల తర్వాత పిల్లలలో భయం, మొండితనం, శిక్షలు వంటి అధ్యాయాలపైన జనరల్ గా మనందరికీ తెలిసిన విషయాల మీద పుస్తకం సాగుతుంది.}
{ ఇప్పుడే తెలుసుకున్న విషయం ఏమిటంటే ఇటువంటి స్కూల్ ఇండియాలోనూ ఒకటుందని ఆ స్కూల్ గురించి తెలిసినవారు చెప్పారు. నెట్ లో ఆ స్కూల్ లింక్ ఇది - http://childrensgarden.in/} దీనిని గురించి మరింత వివరంగా తెలుసుకోవాల్సి ఉంది.
౯.)  పరీక్ష ఎంత సిద్ధపడి వ్రాస్తున్నా, ఇష్టపడి ఏ చదువు నేర్చుకుంటున్నా ఉండే ఒత్తిడి వేరు. దానికి మానసిక సంసిద్ధత ఉంటుంది. ఇతరులు ఫోర్స్ చేసినపుడు సంసిద్ధత ఉండదు. అప్పుడు కూడా కొంతమంది మధ్యలో మానేయవచ్చు. అదివేరు సంగతి. అసలు ఇప్పుడు ఇష్టపడింది నేర్చుకోడానికి గానీ, శ్రమనో ఇంకోటనో మానేయడానికి కానీ ఏ ఛాన్స్ లేని పరిస్థితి ఉంది విద్యార్థులలో. అందుకే ఆత్మహత్యలు చేసుకుందామని కొందరు, లేదా సంపాదనలో స్థిరపడేంత ఏదో ఒక డిగ్రీ/పీజీ ముగిద్దామని కొందరు ఆలోచించే  ఒత్తిడి పెరుగుతోంది. ఇక ముందుకు చదివే తృష్ణ , శోధించే జిజ్ఞాస ప్రసక్తి ముగిసిపోతోంది.
         ఇక ఈ ఆటంకాలన్నీ దాటి కొందరు జిజ్ఞాస పెంపొందించుకుంటారు. పరిశోధన చేయాలనుకుంటారు. ఇది రెండో దశ. బాల్యము, కౌమారము గడిచింది. ఒక స్థాయిలో తమకు నచ్చిన/వచ్చిన రంగంలో కొంతవరకూ నిపుణులైనారు. ఇంజనీర్లో, డాక్టర్లో, సైన్స్ లలో పిహెచ్ డీ లో అయినారు. ఇక మీదట  పరిశోధనలో అడుగుపెట్టాలి. మన దేశంలో ఎన్నోప్రభుత్వ పరిశోధనా సంస్థలున్నాయి. నియమాల ప్రకారం అందులో ఉద్యోగంలో ప్రవేశించిన  అందరికీ వారి స్థాయికి తగిన పరిశోధన చేయడానికి లేదా పత్ర సమర్పణల ద్వారా తమ ఫీల్డ్ లో స్వీయ అధ్యయనం కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ధనరూపంలో మద్దతునిస్తుంది. ఈ రూల్స్ అన్నీ ఉన్నాయి.
        ఏ రూల్స్ అయినా పాటించేది/పాటించనిది మనుష్యులే. ప్రాథమిక విద్యల దగ్గర్నించీ అనారోగ్యకర పోటీ (మార్కుల ఒత్తిడి వల్ల) లో పెరిగిన మనస్తత్వాలు జిజ్ఞాస కాన్సెప్ట్ కు దూరంగా జరిగిపోయి ఉంటాయి. దాంతో ఒకరికి ఒకరు అడ్డుపడడమే సరిపోతుంది. ప్రభుత్వ పరిశోధనా సంస్థలలో ఉన్న పరిస్థితి ఇది. ప్రతి రీసెర్చ్ కూ అప్రూవల్ కావాలి. అక్కడ ఎన్నో పాలిటిక్స్. తనకు నచ్చని వారికి అడ్డుపడ్డానికి మనిషి లక్షమార్గాలు వెతుక్కుంటాడు. ఈ మధ్య ప్రతి పరిశోధనా సంస్థలో పరిశోధనావిభాగాల ఆయా ఉద్యోగులు తమ రీసెర్చ్ గురించి రిపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలనే రూల్ వచ్చింది. ఇది ఉండడం వల్ల అడ్డుపడే అవకాశం తగ్గి పరిస్థితి మెఱుగు పడుతుందేమో చూడాలి. ఇక ప్రైవేట్ రంగంలో ఉదాహరణకు ఫార్మసీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ లలో కొద్ది మేరకు పరిశోధనలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఈ విధంగా ప్రాథమిక స్థాయిలోనూ, సబ్జెక్ట్ పై తగుమాత్రం అవగాహన పెంచుకొని పరిశోధన వైపు మళ్ళే స్థాయిలోనూ కూడా జిజ్ఞాసకు తగిన ప్రోత్సాహకర వాతావరణం ఉండడం లేదు. అందుకే మన దేశంలో చెప్పుకోదగ్గ ఆవిష్కరణలు లేవు. 
-------------------------------------------------------------
ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తాయి.
ఈ పరిస్థితి మన దేశంలో మాత్రమే ఉందా? వేరే చోట్ల ఆవిష్కరణలు ఎలా జరుగుతున్నాయి?
       
       అఫ్కోర్స్- ఈ పరిస్థితి ఉందనుకుంటేనే ఈ ప్రశ్నలు తలెత్తుతాయనుకుంటాను.
         మన దేశంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. వేరే దేశాల్లో ప్రాథమిక విద్య ఇక్కడి వలె లేదని వింటున్నాను. వివరాలు తెలీవు. ఉన్నత విద్య, పరిశోధనలకైతే భారతీయులు ఇష్టపడి విదేశాలకు వెళ్తుండడమే సాక్ష్యం. అక్కడ పరిశోధనకు తగిన అవకాశం ఉందని, అందుకే పలు ఆవిష్కరణలు జరుగుతున్నాయని ఊహించవచ్చు. ఇంతకు మించి విదేశాల విషయం తెలీదు.
   ఈ పరిస్థితి మన దేశంలో ఎప్పట్నించీ ఉంది? ఈ విషయంలో పరిష్కారం దిశగా అడుగులు వేయకపోవడానికి కారణమేమిటి?
         ఇప్పటి స్థితికి మెకాలే, ఆంగ్లేయ విద్యావిధానం కారణమన్నది మిత్రులతో చర్చలో నేను మొదట చెప్పిన కారణమైనా, వారినెందుకు నిందించాలి అన్న ప్రశ్ననెదుర్కొన్నప్పుడు,  ఆ చర్చ కారణంగా నేను మరికొంత విషయసేకరణ చేయడం జరిగింది.  ఆంగ్లేయులు వచ్చేటప్పటికే  సైంటిఫిక్ టెంపర్ కానీ, జిజ్ఞాస కానీ పెద్ద స్థాయిలో ఇక్కడ మిగిలి లేవు. కాబట్టి వారు రావడానికి ముందున్న పరిస్థితులను పరిశీలించవలసి ఉంటుంది.
 ఈ విషయంలో నేను చెప్పగలిగిందేమిటంటే -
           విదేశీయాత్రికులు/చరిత్రకారులు అయిన హ్స్యుయన్ త్సాంగ్ వంటి వారి రచనలలో మన విశ్వవిద్యాలయాల గురించి ఉన్న వివరాల ప్రకారం ప్రాచీన కాలంలో మనదేశంలో ఒక సువ్యవస్థిత విద్యా విధానం ఉండేది.  విక్రమశిల, ఉజ్జయిని, కాశీ, వల్లబి , స్కాంతలూరు(కేరళ), కాంచీపురం, శారదా(కాశ్మీరు), తక్షశిల, నలందా వంటివి ఎన్నో విశ్వవిద్యాలయాలు. వీటిలో ప్రవేశపరీక్ష ఆధారంగా మాత్రమే విద్యార్థులను చేర్చుకున్నారు. వేలకొలదీ విద్యార్థులు వీటిలో చదివారు. దేశవిదేశాలనుంచీ వచ్చారన్నది చరిత్ర. ఊహ కాదు. అందులో వివక్ష  లేదు.
       ఇంత చదివీ సాధించినదేమిటి ? ఆర్యభట్ట, భాస్కరాచార్య, శుశ్రుత, చరక, అమోఘ వజ్ర, వరాహమిహిరుల  వంటి ఎందరో శాస్త్రవేత్తలు (పురాణ కవులు కాదు) ఖగోళము, వైద్యము, గణితము వంటి వివిధ శాస్త్రాలలో  పరిశోధన చేసి, గ్రంథాలు వ్రాసి సిద్ధాంతాలు ప్రతిపాదించినారన్నది సత్యం. చైనీస్, అరబిక్ పూర్వకాలం నాటి గ్రంథాలలో 'భారతదేశంలో అభ్యసించి, అనువదించి లేదా శాస్త్రజ్ఞులను ఇక్కడినుండి తీసుకునివెళ్ళి వాళ్ళ భాషలలో అనువదింపజేసుకున్నది' వారి పూర్వపు గ్రంథాలలో ఈ విషయానికి సాక్ష్యం ఉన్నదని ఆధునిక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అరబిక్ నుంచి పాశ్చాత్య ప్రపంచం ఇవి గ్రహించడం సత్యం. 
     భౌతిక ప్రపంచానికి చెందినవే కాక ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన పరిశోధనలు , గ్రంథాలు, విశిష్ట సిద్ధాంతాలు ఉన్నాయని తెలిసిన విషయమే.
       అయితే ఇవన్నీ నేటికాలానికి ఔట్ డేటెడా కాదా అన్నది మన తరం శాస్త్రజ్ఞులు పరిశోధించి తేల్చవలసిన విషయం. కాదనుకుంటే వదిలివేయడం పూర్తిగా మన ఛాయిస్.
     అయితే ఈ జిజ్ఞాస, సైంటిఫిక్ టెంపర్ తర్వాత లింక్ ఎలా పోగొట్టుకుంది?
              ఈ పై విషయాలన్నీ దాదాపు ఐదు, ఆరు శతాబ్దాలనుంచి పది పదకొండు శతాబ్దాల మధ్య కాలం నాటివి. ఈ దేశానికి రాకపోకలు సాగించిన అరబిక్ దేశాలు ఈ శాస్త్రజ్ఞుల ప్రతిభను గుర్తించడం, వారి పేర్లు తమ గ్రంథాలలో మెన్షన్ చేయడం చేసినా, తర్వాత కాలంలో పన్నెండో శతాబ్దం నుంచీ దాదాపు  అటువైపు నుంచి కొందరు స్వార్థపరులు ఇక్కడి ప్రాంతాలపై దండయాత్రలు చేయడం మొదలుపెట్టారు. ఆక్రమించడం మొదలైన కొంతకాలంలోనే భక్తియార్ ఖిల్జీ వంటి వారు ఇక్కడి విశ్వవిద్యాలయాలను, సంస్కృత గ్రంథాలను, శాస్త్రాలను , దేవాలయాలను సర్వనాశనం చేశారు. ఎంతో మందిని చంపి, జ్ఞానభాండారాన్ని నాశనం చేశారు. చనిపోయినవారు చనిపోగా , పారిపోయినవారు పారిపోయారు. వివిధ దేశాలకు ప్రయాణించారు. వాటితో పాటు వారు జ్ఞాన సంపద కూడా వీలైనంత తీసుకుని వెళ్ళగలిగారు.  అప్పట్లో ముద్రణాయంత్రాలు గానీ, పెన్ డ్రైవ్ లు కానీ ఇటువంటివేమీ లేని రోజుల్లో భారతీయులు జ్ఞాన సంపదను ఏమాత్రం  కాపాడలేకపోయారు. కోటిలో ఒక్క వంతు మాత్రం అక్కడక్కడా మిగిలింది. తర్వాత  కూడా ఔరంగ జేబు కాలం వరకూ కూడా పర్షియన్ విద్యలు బోధించడం జరిగింది. అది కూడా అందరికీ ప్రవేశం ఉండదు. ఔరంగ జేబు కాలం వరకూ కూడా వారి విద్యలలో సైన్స్ కు ప్రాముఖ్యత ఎంత మాత్రం లేదు. అప్పటి కాలంలో పాశ్చాత్యులు వచ్చి సభలో ప్రదర్శించిన గడియారం, చైనా నుంచి వచ్చిన ముద్రణాయంత్రం వంటివాటిని మొఘల్ రాజులు ఆదరించకుండా తిరగగొట్టిన విషయం సైన్స్ కు వారెంత వ్యతిరేకులో తెలుపుతుంది.మొఘల్ రాజులే తిరగళగొట్టాక వాటికి దేశంలో ఆదరణ ఉండడం నాటి కాలంలో సాధ్యమయ్యే పని కాదు.
                ఇది కొంత కాలం కాదు దాదాపు నాలుగు వందల సంవత్సరాలు- పన్నెండు నుంచి పదహారు శతాబ్ది ,ఆంగ్లేయులు వచ్చేదాకా సాగింది. కవిత్వాన్ని మాత్రం వారు వదలిపెట్టారు. శాస్త్రవిద్యను తిరస్కరించారు. అంటే దాదాపు ఐదు తరాలు సంస్కృత శాస్త్రవిద్య చదవడానికి అవకాశాలు తగ్గిపోయాయి. గ్రంథాలు , గురువులు నాశనమైనాక, సర్వత్రా భయభ్రాంతులు ఎప్పుడు ఎవరిని చంపుతారో, మతం మారకుంటే ఏం ఘోరాలు చేస్తారోనన్న వాతావరణం ఉన్నప్పుడు చదువు, జిజ్ఞాస, సైంటిఫిక్ టెంపర్ మిగుల్తాయా? నాలుగేండ్లు  ఒకరిని గదిలో పెట్టి తన్నినాక, బయటికొచ్చినా వాడు ఏ స్థితిలో ఉండగలడు? ఇక్కడ నాలుగువందల ఏండ్లు!!
                సరిగ్గా ఆంగ్లేయులు వచ్చినప్పుడు పరిస్థితి అలా ఉంది. దేశమంతా ఉన్నత విద్య, పరిశోధనలు నశించాయి, పరంపరాగతంగా వచ్చిన ప్రాథమిక విద్య ఉంది. ఈ విషయాలన్నిటినీ ఆంగ్లేయులు  వచ్చినప్పుడు వారు సర్వే చేశారు. దాంట్లో ఇక్కడి విద్యావ్యవస్థ గురించిన సర్వే కూడా ఒక భాగం. ఉన్నత విద్య నశించినా ఇండ్లల్లో గుళ్ళల్లో చెప్పుకుంటున్న విద్యలు, ఆయా గురువులకు, గురుకులాలకు గ్రామాలు ఏర్పాటు చేసిన ఆర్థిక తోడ్పాటు వ్యవస్థలు, గురువు స్వయంగా అందరి శిష్యులతో ప్రత్యక్షపరిచయం కలిగి, శిక్షణ, పర్యవేక్షణ చేయడాలు వీటి గురించి తెలుసుకున్నారు. ఈ సర్వే ఫలితాలు రికార్డ్ చేసినవి, వాటి గురించి వారు వ్రాసుకున్న పుస్తకాలు అక్కడి లైబ్రరీలలో  ఇక్కడి నుంచి వెళ్ళి పరిశీలించిన వారున్నారు.
            ఇక్కడ ఇంకా మిగిలిన అపార ధనసంపద, ప్రజలనుంచి వసూలు చేసే శిస్తులు, ఇక్కడి మార్కెట్ అన్నీ కావలసినప్పుడు భాషతో సమస్య రాకుండా వారికి కావలసిన సదుపాయాలు తక్కువ కాకుండా అన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడి వారికి విద్య నేర్పడం గురించి ఆంగ్లేయులు రెండు పక్షాలుగా చీలిపోయారు. ఇక్కడి భాషల్లో నేర్పాలా, ఇంగ్లీషులో నేర్పాలా అని. చర్చలూ నడిచాయి. చివరికి 1857 లో సైనిక తిరుగుబాటు వచ్చాక ఇంత పెద్ద ప్రాంతాన్ని అణచాలంటే వాళ్ళ స్వతంత్ర విద్యావిధానాన్ని రూపుమాపాల్సిందేనని నిర్ణయించారు.
--------------
ఇవన్నీ చెప్పడంలో నా ఉద్దేశ్యం మొఘలులనూ,ఆంగ్లేయులనూ నిందించడం కాదు. మునుపటి విజ్ఞత ఎలా పోయిందో చెప్పడం వరకే.
నిందించబోను.
వారినీ, వీరినీ నిందించడం కంటే ఈ దండయాత్రల నుంచి తమను కాపాడుకోలేకపోయిన మన పూర్వులనే నిందించవచ్చు కదా!
వారిని మాత్రం ఎందుకు? మన తరం వచ్చేసరికి ఆ బాధలన్నీ అనుభవించి స్వాతంత్ర్యం సంపాదించి పోయారు కదా! వారినీ వద్దు.
        అప్పటి పరిస్థితులలో అప్పటి కాలమానానికి తగినట్టు ప్రారంభించిన విద్యల కాలంలో కూడా రామానుజన్, జగదీశ్ చంద్రబోస్, సివిరామన్ వంటి వారు ఆంగ్లంలోనే , వారి విద్యావిధానంలోనే చదివి దేశానికి పేరు తెచ్చారు. అది ఎలా జరిగింది? ప్రాచీన కాలం నుంచీ ఉన్న ఒత్తిడి లేని పరిస్థితి.
           నేడు, ప్రస్తుతం ఉన్న ఎవాల్యుయేషన్/ మూల్యాంకనం/ మార్కుల పద్ధతి అంటూ ఒకటో తరగతి నుంచీ వద్దురా చదువు అనేదాకా ఉన్న ఒత్తిడి ఆనాడు లేదు.  చదవగలిగిన వాళ్ళు చదివేవారు. చదవగలిగినంత చదివేవారు. ఎప్పుడు వద్దనుకున్నా మానేసే వారు. వారిమీద నేటి విద్యార్థుల్లా  ప్రాథమిక స్థాయిలో అసలు ఒత్తిడి లేదు.
       వారి బుద్ధి వికాసం సహజంగా జరిగింది. తర్వాత విద్య మొదలుపెట్టారు. ఉన్నత విద్యాభ్యాసాలు, పరిశోధనల్లో ఆర్థిక, ఇతర సహాయాలకై ఎంతో ఇబ్బందులు పడి సాధించుకొని శోధించారు.
            అంత జిజ్ఞాస ఉండాలంటే, ఏర్పడాలంటే నేటి విద్యావిధానంలో అన్నీ బాగున్నా, మూల్యాంకన పద్ధతిని పునరాలోచించాలి. ఈ సరికే గ్రేడ్ సిస్టమ్ అక్కడక్కడా వచ్చింది. ఫెయిల్ లేకుండా. పరీక్షల, మార్కుల ఒత్తిడి, తల్లిదండ్రుల ఒత్తిడి తగ్గాలి. ఇంజనీరింగే చదువు, డాక్టరే చదువు, వాడి మాదిరే నీకూ పాకేజీ ఉండాలి వంటి ఒత్తిడి తల్లిదండ్రులివ్వకుండా ఉండాలి.
మనదేశమూ బేసిక్ సైన్స్ లో, మోడరన్ సైన్స్ లో తన ప్రతిభ చాటాలి. అదే నా ఆకాంక్ష.
-------------------------------------------------------------------------

 గమనిక- ఇది నా ప్రాథమిక అవగాహన.
ఇందులో తప్పొప్పులు దిద్దుకునేందుకు సిద్ధం.

31, మే 2018, గురువారం

మధ్యాహ్నార్కుడూ మానవలోకము

పద్యాలలో సంభాషణ-

http://sanchika.com/madhyahnaarkudu-manavalokamu/


-----------------

మధ్యాహ్నార్కుడూ మానవలోకము
-----------------------------------------
మధ్యాక్కర-
. ఎంలో నొకచెంప కంద, హింసగా తోచెనే రమణి
మండెనే హృదయమ్ము మేను, మానినీ వినుమునా బాధ
బంలన్ పగులగా కొట్టు, పాటును పడువారి తలువ
నిండెనే నా కండ్లు చెలియ, నీరుగా కరుగ, నా మనము.

. ఇండ్లను కట్టెడు వేళ నిద్ధర నున్నట్టి చెట్లఁ -
గండ్లను, బుద్ధిని మూసి కాటువేసిన పాపఫలము
ముండ్ల చెట్లనుఁ గూడ నిచట ముదమార కానంగలేము,
పండ్లనుఁ బండించి యిచ్చు పాదపముల వెన్ని గలవు?

. పామిట్టుల కాలుచుండ రుగునుఁదీసెడు వేళ
పారక్షలు కొన లేని డుగుజీవులఁ నెట్లు మరతు?
మీదుమిక్కిలినేటికేడు మిన్నయగుచునుండె వేడి,
పోమనగ వేరు గలదె భూమిని వీడినన్ మనకు?

. ల్లెపూలని, మామిడి యని దిని మురిపెమందరాదొ!
యెల్ల తావుల తావుఁ బఱపు హేరాళ సుమరాశి గనవొ!
యుల్లము రంజిల్లదేమొ! యొప్పు కొనగ నెట్టి బెట్టొ!
ల్లని కుండల నీటి క్కటి రుచినెఱుంగవొకొ!

. గొడుగులు, వీవనల్ దెచ్చి కొందరికైనను పంచి,
లక వాడక యుండ చ్చని చెట్లను తడిపి,
కుడువగ నీటిని నింపి కొన్ని కుండలనైన యుంచి,
కదారులఁ బెట్టఁ దగును, డచిపోయెడు వారికొఱకు.

. పాటల పసి వాండ్రు హాయిగా నుందురో గాదొ!
మామాటకు మురిపించి మాయలఁ జేయగా రారొ!
పేలో పెండ్లిండ్ల, పల్లె పేరంటముల కళ లేదొ!
తోలో నుయ్యాల లూగ తొందర కలుగునో లేదొ!

. చెటలుఁ బట్టుచునున్న చింలేమియు లేని వారు
గుములు గుములు జేరిరదిగొ కూడినాడుకొనగ, శలవు
బడులకటంచు మురిసి-  గ్గరకుఁ బిలిచి పాట
నీయముగ నేర్పుమోయి, ఖండనమండనలేల?

. ద్విపద
లోటులనెంచగా లొసుగులునటులె
నోట మంచి పలుక నూరును నటులె.
                                           ------------------


---లక్ష్మీదేవి.