Loading...

21, సెప్టెంబర్ 2017, గురువారం

సమస్యాపూరణలు

కష్టమైన ప్రాసతో గురువుగారిచ్చిన సమస్యకు నా పూరణ ప్రయత్నాలు.

సుజ్ఞానమ్మను భిక్షను
నా జ్ఞానులు నరులకిడుదు,రప్రతిహతమౌ
యజ్ఞతఁ బోగొట్టు కదా
విజ్ఞతలే! నట్టి నరుడె విజయముఁ బొందున్.


( ఆ జ్ఞానులనబడే వారే నరులకు సుజ్ఞానమను భిక్షను ఇడుదురు.
అడ్డూ ఆటంకమూ లేకుండా పెరిగే అజ్ఞను అట్టి విజ్ఞతలే కదా పోగొట్టును!
అని వ్రాశాను. అన్వయము కుదరలేదంటే దిద్దుకుంటాను.)

ధర్మ్యమ్మౌ నడవడికయు,
హర్మ్యమ్ముులనాశ వీడు నభ్యాసము, నై
ష్కర్మ్యము నానందమగున్.
హర్మ్యమ్మున వెదుకఁదగునె యానందమ్మున్?

ధర్మ్యము =ధర్మమును వీడనిది
నైష్కర్మ్యము=భౌతిక ప్రపంచమునుండి పూర్తిగా తొలగిన మనసుతో కర్మను వీడుట.

9, సెప్టెంబర్ 2017, శనివారం

కర్మయోగమా? కర్మసన్యాసయోగమా?

భారతీయం ప్రవృత్తి , నివృత్తి మార్గాలను రెండిటినీ విశ్వసిస్తుంది. బోధిస్తుంది. కానీ ప్రధానంగా ప్రవృత్తిమార్గం ఎందుకైందిఅంటే నివృత్తి మార్గం బహు క్లిష్టమైనది.
--
భగవద్గీత -కర్మయోగాన్ని, కర్మసన్యాస యోగాన్ని రెండిటినీ భగవద్గీత వివరిస్తుంది.
అర్జునుడు అడుగుతాడుకూడా. కృష్ణా, మీరు ఒకపరి కర్మసన్న్యాసమును, ఆ వెంటనే కర్మయోగమును ప్రశంసించుచున్నారు.ఈ రెండిటిలో నాకు శ్రేయస్కారి యగు దానిని నిశ్చయించి చెప్పుడు అని.
రెండూ పరమశ్రేయస్సును కలిగించునవియే అనేదే(మూర్ఖులే ఇవి వేరు వేరు ఫలాలనిచ్చునని భావిస్తారని కూడా) భగవానుని నిశ్చయాత్మకమైన సమాధానము. అయితే సాధనయందు సులభమైనది కాబట్టి కర్మయోగము శ్రేష్ఠమైనది అని చెప్తాడు.
ఎందుకంటే శరీరధారికి కర్మసన్యాసము అంత సులభమైనది కాదు. ఇంద్రియములు చేసే పనులన్నీ ఊపిరి పీల్చడముతో సహా కర్మాచరణ అయినపుడు ఏ శరీరధారికీ అది అంత సులువైనది కాదు. (మనస్సునునిగ్రహించడం మరింత కష్టసాధ్యము)
అందుకే కర్మ త్యాగము కన్నా, కర్మఫల త్యాగము మంచిదని , నిష్కామకర్మ ఉత్తమమని చెప్పబడుతోంది.
--
బౌద్ధము దీనికి వ్యతిరేకమైనదాన్ని కనుగొన్నదని అనుకోను. ఇందులో అత్యుత్తమమైనదని ఒకదాన్ని ఎంచుకున్నది.
ఇందులో ఒకదాన్నే ఉత్తమమని భారతీయం నిర్ణయించదు. ఎందుకంటే ఎవరికి ఏది సాధ్యమో దాన్ని నిర్ణయించుకోవడం మంచిదని భావిస్తుంది. ఉదాహరణకు క్లోజ్/ ఓపెన్ బుక్ పరీక్షలను నిర్వహించే వారికి ఆ యా స్థాయిలననుసరించి నిర్వహించడం అవసరమని మనకూ తెలుసు కదా?
అలా కాదని నివృత్తి మార్గమే దిక్కని బోధించడం వల్ల, జ్ఞానులైన వారు కర్మల పట్ల అశ్రద్ధను కలిగించిన వారవుతారు. ప్రకృతి సిద్ధమైన గుణములతో ప్రభావితమై కర్మలలో ఆసక్తి కలిగినవారిని నిరోధించడం మాత్రంచేత వారికి కర్మసన్యాసము పట్ల శ్రద్ధ రావడం కష్టం. పైగా ఇది విపరీత పరిణామాలకు దారితీసే పరిస్థితులూ ఏర్పడతాయి. ఏర్పడడం వల్లే బౌద్ధం ఇక్కడ నిలువలేదు. ప్రాపంచిక విషయాలను వదులుకోవడం కష్టమైన అనుచరులకు అది దారి చూపలేకపోయింది. ఆ కష్టమైన దారికి ఒక ఊతకఱ్ఱను గానీ ప్రత్యామ్నాయాన్ని కానీ అందించలేనందు వల్లే అది విఫలమైంది.
--
కర్మాచరణను ఆలంబనగా అది అంగీకరించనందువల్ల అది ఇక్కడ ద్వేషానికి గురి అయి ఉండవచ్చు. కానీ అది ఉన్న ప్రాంతాలలో కూడా అది ఉంది అంతే గానీ, భౌతిక/ప్రాపంచిక లంపటాన్ని(కర్మాచరణను) వదలడం అనే విషయంలో ప్రభావాన్ని చూపించిందా అన్నది సందేహమే.
--
ఏదో ఒక ప్రయత్నము చేయనీ అని విడువడమే మంచిదికానీ, అసలు ప్రయత్నం పట్లే ఆసక్తి పోయేటట్లు చేయకూడదు కదా. ఏ ప్రయత్నాన్నీ విలువలేనిది గా తీసిపారేయకుండా, ప్రోత్సహించడం వల్ల కొన్ని ప్రయత్నాలు శీఘ్రంగాను, కొన్ని నిదానంగాను ఫలితాలను ఇస్తాయి.
---
కళలు మనోరంజకం కాకుండా అస్తిత్వాన్ని పొందలేవు. అప్పుడది ఇంద్రియాశ్రితమే అన్నది సుస్పష్టం.వీటికీ నివృత్తి మార్గానికీ చుక్కెదురు కదా?
ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం అన్నది కూడా కాకుండా పూర్తిగా ద్వంద్వాలకు అతీతంగా ఉన్నప్పుడే నివృత్తి మార్గం సాధ్యం. అదీ ఆచరించినవారు ఇక్కడ ఉన్నారు. కానీ అది అతిక్లిష్టం.
----
కారణరహితం గా అంతర్ముఖుడవడం-ఈశ్వరుడు ,నరనారాయణులు, దక్షిణామూర్తి , సనకసనందాదులు అంతర్ముఖులే అయి ధ్యానిస్తారన్న ఉదాహరణ ఉండనే ఉంది. రమణమహర్షులు ఇప్పటి ఉదాహరణ.
మానవమాత్రుల్లో మనకు తెలిసిన పరిధిలో ఉదాహరణలు పరిమితమై ఉండవచ్చు. హిమాలయాల వంటి చోట ఇప్పటికీ ఉండవచ్చు.
ఇక ఆనందాన్ని అనుభవించినపుడు అది బ్రహ్మానందం, ఆనందాన్ని కాక వస్తువు ద్వారా అనుకున్నప్పుడు మాత్రమే ఆనందం దూరమౌతుంది. అహం బ్రహ్మాస్మి అన్న దానిలో పరమార్థం ఇదే కదా.
----
నేను, నాది అనుకున్నపుడే దుఃఖమని చెప్పబడింది. ఉన్నదంతా ఒక్కటి. అదే ఉంది, ఇంకోటేదీ లేదు అన్నప్పుడే ద్వంద్వాతీతమౌతుందనీ చెప్పబడింది. అప్పుడే నాది అనేది నాది కాదు అనేది రెండు ఉండవు.
మాస్నేహితురాలు అందమైన ఇల్లు దారిలో కనబడగానే అబ్బ ఎంత అందంగా ఉందో అనేది.
మరుక్షణం అటువంటిది నాకుంటే ఎంత బాగుండునో అని చింతించేది. మొదటి క్షణంలో ఉన్నదే ఆనందం. నాది,నాదికాదు అన్న ఆలోచన ఇప్పుడు అవసరమా అనిపించేది నాకు.
:) ఇది  బోధ కాదు. నాకు ఏది ఎంత అర్థమైందో అదే చెప్తున్నానంతే.