Loading...

24, ఆగస్టు 2016, బుధవారం

కృష్ణా! నిను నా మనమున......



కం.
కృష్ణా! నిను నా మనమున
విష్ణువునవతారమంచు వేడుచునుందున్,
తూష్ణీకరణమ్మువలదు,
నిష్ణాతుడవీవె మమ్ము నీ కడఁ జేర్పన్.
ఉ.
శ్రావణమాసమందు నిలఁ జల్లగ వచ్చితివంద్రు, వేడుకల్
నీవిట పుట్టినావనుచు, నిర్మల ప్రేమలఁ దేల్చు కృష్ణుడే
దేవుడు మాకటంచు పలు తీరుల పూజల చేసి, భక్తితో
త్రోవల పాదముల్ పువుల తోరణముల్ వెలయింపజేయరే!
చం.
కలకల నవ్వ క్రొవ్విరులు కన్నెలమోముల పూచె నెల్లెడన్
జలజల మంచి ముత్తెములు జాణలపల్కుల జారెనెల్లెడన్
తొలకరి చిన్కులందు కడు తొందరగా నభిషేకమందుచున్
కొలువయె రంగనాథుడదె కోవెలలందున పూజలందగా
మ.
వాన వచ్చిన వేళలందున వాసుదేవుడు పుట్టెనోయ్
కోనలందున కొండలందున కొత్త శోభలు తోచెనోయ్
చేనులందున చెమ్మ చేరెను చెట్టు చేమలు హెచ్చెనోయ్
వీనువిందుగ గానమాధురి పేరటాళ్ళిలఁ దేలగా
పం.
నమామి కృష్ణ దేవదేవ నారదాది సన్నుతా
అమేయ సత్కృపానిధీ జయమ్ము మంగళమ్ములన్
ప్రమోదమంద పాడుచుంటి పంకజాక్ష పాహిమాం
రమాపతీ! సదా జగమ్ము రక్షసేయుచుండుమా!
---------లక్ష్మీదేవి