Loading...

21, డిసెంబర్ 2014, ఆదివారం

గంగా స్తుతి - తిక్కన

క. మును పాపములెన్ని యొన,
    ర్చినఁ బిదపను గంగనాడఁ జీఁకటి రవి దోఁ
    చిన విరియుగతి విరియు న,
    య్యనఘుఁడిలాతలము దొఱఁగి యమరతనొందున్.
తా. ఎన్ని చీకట్లున్నా రవి ఉదయించగనే అన్నీ అంతరించినట్లు, గంగా స్నానము చేసినవెంటనే పాపాలన్నీ తొలగి పోయి పాపరహితుడై జీవుడు అమరత్వమును పొందగలడు.

క. మేనించుక సోౕఁకిన గం,
    గానదితోయములు జనుల కల్మషకోటిం
    బో నడచి పురందర లో
    కానందముఁ బొందఁ జేయు నాగమవేదీ!
తా. గంగానదీజలములు మేనికి తాకగానే జనుల కల్మషాలన్నీ బోగొట్టి ఇంద్రలోకము చేరుస్తాయి.

సీ. అనఘ సోమము లేని యధ్వరంబును శశి
     లేని రాత్రియు రవి రవి లేని నభము
     నాత్మధర్మము లేని యాశ్రమంబును బుష్ప
    సంపద లేని భూజమును బోలె
   హీనత నొందు గంగానది లేని దే
    శంబు చాంద్రాయణ శతములైన
   గంగాపయః పానకరణంబు గావించు
  నిర్మలత్వముఁ జేయ నేరవగ్ని
ఆ. యందుఁ బడిన దూది యట్లగు గంగావ
   గాహనమునఁ బాతకంబులఖిల
   భూతములకు దుఃఖములు వాపికొనుటకు
   నేవిధములు గంగ కీడుగావు.
తా. సోమము లేని యజ్ఞము, చంద్రుడు లేని రాత్రి, రవిలేని ఆకాశము, ఆత్మధర్మము లేని ఆశ్రమము, పుష్పించని చెట్టు వలె గంగా నది లేని దేశం హీనమైనది. నూరు వ్రతములైన గంగాజలము లిచ్చు నిర్మలత్వములియ్యలేవు.
అగ్ని యందు పడిన దూది వలె సకలపాతకములనుఁ బాపి, దుఃఖములను దీర్చే గంగకు ఏవీ సాటి రావు
క. విను గంగ గంగ యను కీ
  ర్తనములతో నొండు నీటఁ దగ మునిఁ గిన య
  జ్జనులు దురితములఁ దొఱగుదు
  రనియార్యులు సెప్ప విందునంచిత చరితా.
తా. గంగ నామస్మరణ చేస్తూ మామూలు నదుల్లో మునిగినా దురితములు దొలగునని ఆర్యులు చెప్పుదురు.
తే. మూఁడు పథములఁ జని లోకములకు మూఁటి
    కుజ్జ్వలాలంకృతియుఁ బెంపు నొసఁగినట్టి
   యమలతరమూర్తి యగుదేవి నాశ్రయించు
   వాఁడు కృతకృత్యుఁడిది నిక్కువము కృతాత్మ.
తా. మూడు లోకములలో (స్వర్గలోకములో మందాకిని, భూలోకములో గంగానది, పాతాళములో భోగవతి) ప్రవహిస్తూ వాటికి అలంకారముగా నిలచిన  త్రిపథ అని పిలువబడిన గంగ నాశ్రయించువాడు సఫలుడగును.
--------------
తిక్కన విరచితమైన అనుశాసనికపర్వము, ద్వితీయాశ్వాసము నుండి ధర్మరాజు అడిగిన సందేహాలను నివృత్తి చేస్తున్న భీష్మపితామహుని మాటల్లో కొన్ని.