Loading...

19, నవంబర్ 2014, బుధవారం

ఆనాటి జాతీయ రచనలు

       వందేమాతరం పలుకునే నిషేధించి కఠినంగా అప్పటి దురాక్రమణదార్లు ప్రవర్తిస్తున్నప్పటికీ, మొక్కవోని ఆత్మస్థైర్యంతో వెనుదీయని గుండెబలంతో మన జాతీయస్ఫూర్తిని పెంపొందించే విధంగా జనచైత్యన్యం కదం తొక్కే విధంగా కవులు ఎందరో ఎన్నో జాతీయ రచనలు చేసినారు.
    గురజాడ అప్పారావు గారి దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా అటువంటిదే. రాయప్రోలు వారి సిరులు పొంగిన జీవగడ్డయి పాలుబారిన భాగ్యసీమై అటువంటిదే.
  ఇప్పుడు మరి కొన్ని చూద్దాము.
****************
బలిజేపల్లి లక్ష్మీకాంతమ్మ గారి స్వరాజ్యసమస్య అన్న పద్యగ్రంథము లోని పద్యము.

సకల రత్న ప్రభా చటులాంబరంబైన హిమనగం బాత పత్రముగ మెరయ
చేరి భాగీరథీ సింధునదీ తటుల్ విమల వీచీ చామరములు వీవ
ప్రాక్పశ్చిమాగ్ర భూముల గొల్చి గభీర వారిధీశ్వరులు కైవార మొసగ
ఆర్షసంతతి యుదాత్తాను దాత్తములైన  స్వరములు స్వస్తి వాచనములిడగ
ముప్పదియు మూడుకోటుల ముద్దు సతులు
సమత తన యాజ్ఞ శిరసావహింప
సింహళద్వీప పీఠికాసీన యగుచు
కరుణ జగమేలుగాత మాభరతమాత.

గౌతమీ కృష్ణవేణి తుంగభద్రాది పావనోదక ముగ్గుబాలు త్రావి
నన్నపార్యాది మాన్య కవిత్రయము చేత నల్లనల్లన మాటలాడనేర్చి
ఆంధ్రరాష్ట్ర స్థాపనాచార్య వర్యుడౌ విష్ణువర్ధను భుజాపీఠి నెక్కి
ఆంధ్రసేవాపరాయణ కృష్ణ రాయాది పతులచే సకల సంపదల బొదవి
కడుపు చల్లగ గాంచి పెక్కండ్ర సుతుల
బహువిక్రమతేజః ప్రభావధనుల
నిస్సమాన మహోన్నతి నెగడినట్టి
ఆంధ్రమాతా నమస్కారమమ్మ నీకు.
*********************
జాషువా గారి ప్రసిద్ధ పద్యము

సగరమాంధాత్రాది షట్చక్రవర్తుల యంకసీమల నిల్చినట్టి సాధ్వి
బుద్ధాది ముని జనంబుల తపంబున మోద బాష్పము ల్విడిచిన భక్తురాలు
కాళిదాసాది సత్కవి కుమారుల గాంచి కీర్తినందిన పెద్ద గేస్తురాలు
కమల నాభుని వేణుగాన సుధాంభోది మునిగిదేలిన పరిపూతదేహ
సింధు గంగానదీ జల క్షీరములను
కురిసి బిడ్డల బోషించుకొనుచున్న
పచ్చి బాలింతరాలు మా భరతమాత
మాతలకు మాత  సకలసంపత్సమేత
****************

మన రాజపుత్రవీరుల శౌర్యచరిత్రలు దాస్యములో మగ్గి ఎలా కాంతి సమసినాయో చెపుతూ
ఓలేటి నారాయణమూర్తి గారు
సూత్రయుగముల శుద్ధవాసన
క్షాత్రయుగముల చండశౌర్యము
చిత్ర దాస్యముచే చరిత్రల
చెరిగిపోయెర తమ్ముడా!!

జనపదుల గీతాలూ ఎంత ఉత్తేజపూరితంగా ఉన్నాయో చూడండి.

అచ్చరాలొచ్చీ అచ్చన గాయలాడుకుండే రాజ్యములో రయ్యో కొయ్యోడ!
కిన్నరులొచ్చీ కీర్తనపాడే కీర్తివంత రాజ్యములో రయ్యో కొయ్యోడ!

కొయ్యోడ= కోయవాడా!

************
గరిమె ళ్ళ సత్యనారాయణ గారి

నూరు మంది మలబారు వాసులానూ
 కూరినాడొక పెట్టె లోన (!!!అమ్మో, పాపం కదా!!)
గాలి దూరనీయడు ఇంచుకైన
నోట నీరు పోయడు దేవునాన

పరపాలకులదౌర్జన్యాలు చూడండి. గుండెలవిసిపోతాయి.

******************

చారిత్రక క్షేత్రాలూ పుణ్యక్షేత్రాలూ శిథిలమైనాయని చూపి చెప్పడము దేశము వన్నె తరిగి కృశిస్తున్నదనీ, అన్యాపదేశంగా దేశాన్ని నీవు పునర్నిర్మించవలెననియు చెప్పడమే.

శేషాద్రి రమణకవుల పలుకులు
అది తటాకము కాదాంధ్ర కుమార అరివీర దుస్సాధ్యమైనట్టి పరిఘ
అద్ది కుంకుమము గాదాంధ్ర కుమార తెలుగు నెత్తుటి గడ్డ దెరలిన దుమ్ము
****************

ఓరుగల్లు కోట దుస్థితి గురించి వానమామలై వరదాచార్యులు
కుక్కలు చింపు విస్తరిగ కూలిన యోర్గలు కోటకంటివే?
మక్కువ ఊపిరుండియును మూతికి మీసము గల్గు నాథుడా
*********************

కొడాలి సుబ్బారావు
శిలలు ద్రవించి యేడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలోపల
గుడి గోపురమ్ములు సభాస్థలులైనవి కొండముచ్చు గుంపులకు
************

పురిపండా (అప్పలస్వామి)
భయద దాస్య విశృంఖలా బంధితుడవు ఓయి! జీవచ్ఛవాంధ్రుడా!
ఒక్కమారు ఒలుక నిమ్మిట నింత కవోష్ణ బాష్ప మలినధార స్వాతంత్ర్య సంప్రాప్తి కొఱకు
 *************

కాళోజీ
ఇల పుట్టిననాటి నుండి ఇలవేల్పుగ నిల్చి మనల ఇరుగుపొరుగు
దుండగాల కొరగాకుండగ కాచిన హిమవంతునికాపద యట
పదపదపద ఆదుకొనగ ఆంధ్రావళి అండదండ అస్సాముకు అందింపగ
నయ్యర్లకు తోడ్తోడుగ నాయర్లను నిలిపి ఉంచ
బదరీనాధుని రక్షకు మధురను కంచిని కదుపగ
కాశ్మీరమునకు జంటగ కన్యాకుమారిని నిలుపగ
బిహారీల రణభేరిగ మహా రాష్ట్రము హుంకరింప
గురుగోవిందుని గర్జన ఘార్జరులను కదలింపగ
కర్ణాటక చాముండియే కలకత్తా కాళికాగా
కైలాసము పిలుపును విని కాకతి చిందులు త్రొక్కగ
ఏడుకొండలెలుగెత్తుచు హిమవంతుని పురిగొల్పగ
నగరము చేయూతకు రంగము ఎగిరి దుముక
శైలము గంతులిడుచు శీత నగరము నాదుకొనగ
కలము కుంచె కదలింపుము
సరిహద్దును కాపాడే జై సేనా జైహింద్
లద్దాకును కాపాడే లచ్చన్నా జై హింద్
ఈశాన్యము రక్షించే ఎంకన్నా జైహింద్
ప్రాణాలకు లెక్కించని పంజాబీ జైహింద్
అరచేతిలో తల ఉన్న అస్సామీ జై హింద్
సాదోబా జై హింద్ మదోజీ జైహింద్
మల్హారూ జైహింద్
******************

విశ్వనాథ సత్యనారాయణ
పాడినగీతమే మరల బాడెదం గూడిన భావమే మరి గూడెద వేమి పేయవలె గుండియ శోషలి దుఃఖ వేదనల్ గాడిన
నా హృదంతర ముఖంబున మా తొలినాటికీర్తి రాపాడిన నాదు వాక్కులెగబారదు నూత్నపథాల వెంబడిన్.

నా జాతి పూర్వ ప్రథాజీవరహితమై శక్తి నాడుల యందు చచ్చిపోయి
నా మాతృభూమి తేజో మహాశ్యుతుని బ్రహ్మ క్షత్రతేజంబు మంటగలిపి
నా మాతృభాష నానా దుష్ట భాషల యౌద్ధత్యమును తల నవధరించి
నా తల్లినేల నేనాటి వాచారముల్ పై మెరుగులు చూచి భ్రమసిపోయి
ఏమి మిగిలినదీనాటికిట్లు
పొంగులొలయు వర్షానదీ గభీరోదకముల
దైన్యగర్భచారిత్రముల్ దక్క భిన్నగిరి
శిఖర దుర్గ పరిదీన గీతి దక్క
***************


తుమ్మల సీతారామమూర్తి
నీ రమణమూర్తి కమనీయ వచస్స్ఫురణంబు దాతృతాగౌరవ  మద్వితీయ రసికత్వ విభూతి విశిష్ట శౌర్య విద్యా రుచిరత్వ మంతకొని యాడినా మత్కవితా పిపాస చల్లారదదేమి తల్లి! ఇది యారక మారక ఇట్లె నిల్చుతన్.
అన్నారు.
" తథాస్తు" అని దీవించును గాక తెలుగుతల్లికి తల్లి.


డా శ్రీపాద గోపాల కృష్ణమూర్తి గారిచే రచింపబడిన అర్థశతాబ్దపు ఆంధ్రకవిత్వం పుస్తకం నుంచి  తీసుకోబడిన వివరాలివి.

 _/\_        _/\_       _/\_         _/\_       _/\_      



































13, నవంబర్ 2014, గురువారం

అందరికీ తెలియవలసిన నిజాలు.

పూర్తి వివరాలకు ఈ వ్యాసం చదవండి.

http://tetageeti.wordpress.com/2014/11/13/nehru_the_great/#comment-2695