Loading...

29, జూన్ 2014, ఆదివారం

నీలమాధవా!


లోకాధిదైవతం దేవేశపూజితం జగన్నాథ నాయకం సదాఽహం స్మరామి!

ఈ వేళ పురుషోత్తమపురమైనటువంటి పూరీ పట్టణమునందు విరాజితమైన శ్రీ జగన్నాథుని రథయాత్రా మహోత్సవం ప్రారంభమైనది.

జగన్నాథుని నీలమాధవుడని కూడా పిలుస్తారు. గర్భగుడిలో ప్రధాన విగ్రహాలు దారు శిల్పాలు. అంటే చెక్కవిగ్రహాలు. ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి కొత్త చెక్కతో విగ్రహాలు తయారు చేస్తారు. అప్పటివరకూ ఉన్న పాత విగ్రహాలలో నుంచి ఒక దివ్యపదార్థం తీసి కొత్త విగ్రహాలలో పెట్టి తయారు చేస్తారు. అలా అది కొన్ని వందల ఏళ్ళ నుంచి వస్తూ ఉన్న ఆచారం. మతదురహంకారులైన కొందరు సుల్తానులు పాలించేటప్పుడు అన్ని గుళ్ళను ధ్వంసం చేసినట్లుగానే పురాతనమైన ఈ గుడి మీదా దండయాత్ర చేసేందుకు వచ్చారని, అప్పుడు అసలు విగ్రహాలు కొన్నేళ్ళపాటు ఎక్కడో దాచేసి, అదే రూపంతో వేరే విగ్రహాలు అప్పగించగా, వాటిని ఆ మూర్ఖులు బహిరంగంగా వ్రేలాడదీసి భస్మము చేసి సముద్రంలో పడవేశారని చెపుతారు.

జగన్నాథుని గుడి చాలా విశాలమైన పెద్ద గుడి. అంతేకాదు రథయాత్ర ప్రపంచంలోనే పెద్దరథయాత్ర అని చెప్తారు. లక్షలమంది పాల్గొంటారు. సాధారణంగా హిందువులని మాత్రమే దర్శనానికి అనుమతించినా, సర్వులకూ దర్శనం ప్రసాదించటానికి స్వామి గుడి బయటకు వస్తారు. మానవాళికే కాక తాను సృజించిన విశ్వం లోని ప్రతి జీవికీ దర్శనభాగ్యం కలిగించి మోక్షాన్ని ప్రసాదించే అవకాశం ఇవ్వటానికే స్వామి రథయాత్ర అని చెపుతారు. జగత్తుకే నాథుడు కదా మరి.

ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభమయ్యే ఈ రథయాత్ర కు అవసరమైన రథాలను అంటే ౩ రథాలను (చక్రాలను, ఇరుసులను కూడా)వరసగా జగన్నాథునికి, బలభద్రునికి, సుభద్రకు ప్రతి సారి కొత్తగా తయారు చేస్తారు. రథయాత్ర పూర్తయ్యాక ఆ చెక్కను విక్రయిస్తారు. కొన్న జనాలు వాటిని తమ ఇంటికి సింహద్వారాలుగా బిగించుకొని శుభం జరుగుతుందని సంతోషంగా ఉంటారు.

పూరీ సముద్రతీరం చాలా అందమైనది. శుభ్రంగా ఉంటుంది కూడా. ప్రపంచవ్యాప్తం గా ఎంతోమంది పూరీని దైవదర్శనం కోసం, పురసందర్శనం కోసం కూడా వస్తారు.
(ఇది పాత పోస్టే.)