Loading...

19, నవంబర్ 2013, మంగళవారం

ప్రాచీన సాహిత్య శోధన మరియు నవీన సాహిత్య కల్పన

         ఆంగ్ల భాష మీది వ్యామోహమో లేక కూడు పెడుతుందనో ఒక తరం వాళ్ళంతా నేర్చుకోవడానికి/నేర్చుకోలేదని తపించి పోయినారు. తమ తరువాతి తరం వాళ్ళను ఎంతో శ్రద్ధగా తమ జీతాలను,జీవితాలను బలి పెట్టి మరీ ఆంగ్లాంధ్రులను/భారతీయామెరికనులను తయారు చేసి ఎంతో మురిసి పోయినారు. లాభపడి నారు. అంతా బానేఉంది కానీ, ఈ ప్రక్రియ లో భారతీయ ఆత్మను, స్వభాష లను తెలిసి కొంత తెలియక కొంత నిర్లక్ష్యము చేసినారు. ఇప్పుడు కూడా మేలుకోకపోతే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడమే ఐతుంది.
           ఇప్పుడు కూడా మించి పోలేదు. చదువుకుంటున్న పిల్లలకు తమ భాష లో పట్టు ఉన్నా లేకపోయినా వద్దనే వ్యతిరేకత మాత్రం లేదు. (పోయిన తరాలలో ఉన్నంత వ్యతిరేకత  లేదు.) కాబట్టి  రాష్ట్రాలలో స్థానిక స్థాయిలో సాహిత్యాన్ని తద్వారా చరిత్రను రక్షించుకొనే ప్రయత్నం చేయాల. సాహిత్యం రూపురేఖలు , దృష్టికోణాలు , భావజాలాలు నచ్చినా, నచ్చకపోయినా కూడా కనీసం రక్షించుకోవాల.
      ఇప్పటికే జరిగిన ఆలస్యం వలన ప్రాచీనత కోసమే ఋజువులు చూపించుకోవాల్సి ఉంది. ఇప్పటికైనా ఒక విశ్వవిద్యాలయము కేవలం ప్రాచీన సాహిత్య శోధన మరియు నవీన సాహిత్య కల్పనల కోసమే ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో కళాశాల పనులు , వాటి పరిపాలనాంశాలు వీటికోసం సమయం వ్యర్థం చేయడం లేకుండా ముద్రణ నోచుకోని డిమాండ్ ఉన్న , నాణ్యత ఉన్న గొప్ప రచనలను ముద్రించడము, ముద్రణలో ఉన్న వానికి వ్యాఖ్యానాలు, విమర్శలు వ్రాసేవారిని ప్రోత్సహించడమో చేయాల. ఇప్పటికే ఉన్న ప్రముఖ పండితులతో శోధనా కార్యక్రమాలకు అవసరమైన సహాయాన్ని తీసుకోవడము, కాలయాపన జరిగి ఆ తరం వెళ్లి పోక ముందే విలువైన శాసనాదుల భాషను పరిష్కరించడము వంటి పనులను పూర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఇవన్నీ అమలులో ఉన్న ఇతర రాష్ట్రాల పనులను చూసి నేర్చుకోవాల్సి ఉంది. తంజావూరు సరస్వతీ మహల్ లో ఉన్న ఆనాటి గ్రంథాలను తెప్పించి జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాల.
ఆసక్తి అవకాశము ఉన్న పక్క రాష్ట్రాలలో కూడా తులనాత్మక పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. మండలి బుద్ధప్రసాద్ గారు, మరి ఇతర పెద్దలు భాషా విషయాలలో ఆసక్తి , భక్తీ శ్రద్ధ చూపగల వారు అధికారం లో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగక పోతే ఇంకెప్పుడు జరుగుతాయి?