Loading...

4, సెప్టెంబర్ 2013, బుధవారం

మూర్ఖ ధనిక బాటసారి


ఒక బాటసారి ఒక చేతిసంచీలో వజ్రాలు, మాణిక్యాలు, రత్నాలు, ముత్యాలు, బంగారు నాణెములు, వెండి నాణెములు పెట్టుకొని ప్రయాణిస్తుండగా, రకరకాల ప్రమాదాల వల్ల అంటే దొంగల వల్ల, బండో/నావో తిరిగి పడడం వలన , వరదలలోనో, సంచీకి పడిన చిల్లు వలననో ఉన్నవాటిలో చాలామటుకు పోగొట్టుకొని వాటికోసం బాధపడకుండా చేతి సంచీ ఎక్కడ పోతుందో అని దానిని ప్రేమిస్తూ, జాగ్రత్తగా కాపాడుకొన్నట్టు ......

అంత మూర్ఖంగానూ మనము శరీరంలో కన్నులు,  చెవులు, పళ్ళు, జీర్ణశక్తి, గమన శక్తి ఇట్లాంటి అమూల్యమైన రత్నాలను మొదట గుర్తించము, గుర్తించినా జాగ్రత్త గా రక్షించుకోవాలనుకోము. రక్షించుకున్నా విధివశాత్తూ పోగొట్టుకున్నా ఇంక మునుపటి మాదిరి పనికి రాని శరీరాన్ని పట్టుకు వేలాడుతూ ఎక్కడ దీనిని పోగొట్టుకుంటామో అని జాగ్రత్త పడతాము కానీ,

మన గమ్యము ఏమి మనము అక్కడికి ఎట్లా చేరుకోవాలని ఏమాత్రమూ ఆలోచించము. కన్నుల శక్తి క్షీణించుచున్నా, బాడుగ కన్నులు తెచ్చుకొని లోకాన్నే చూడాలనుకుంటాము కానీ అంతర్దృష్టి ని పెంపొందించుకోవాలనుకోము.

పండ్లు రాలి పోయినా, జీర్ణశక్తి నశించినా ఆకలిని, తిండిపై మోజును విడిచి పెట్టము. మనము విడిచిపెట్టడానికే ప్రయత్నించము. ఇంకా ఆకలిని , మోహాన్ని జయించేది కుదురుతుందా?

ఎప్పుడూ దీండ్ల మీదే మనసుంచి, దీండ్లను సంపాదించుకొనే ప్రయత్నాలే చేస్తున్న మనము ఏనాటికి మంచంలో పడినా, అంత్యకాలములో ఉన్నా ఈ మోహాన్ని ,మోజును విడిచిపెడతామా? చేతనవుతుందా?

ఎప్పుడు ఎవరు కరుణిస్తారా, ఎవరు ఇంత గంజి పోస్తారా అని ఎదురుచూస్తున్నా( ధనికులైనా, బీదలైనా, ప్రేమించే వారున్నా ఈ పరిస్థితి ఎవరికైనా రావచ్చు.) కూడా విడిచిపెట్టలేము. ఆ రోజుకు తయారవడానికి ఈ మోజును ఇప్పటినుంచే విడిచి పెట్టే ప్రయత్నాలు ఎందుకు చెయ్యము?

ప్రతిరోజూ ఎందరు చస్తున్నా, మనము మాత్రము ఉంటామనే రేపటికి పనికొస్తుందని డబ్బులు సంపాదించడాలు, చీటీలు కట్టడాలు, ఇడ్లీకి రుబ్బడాలు చేస్తుంటాము.

ఈ ప్రశ్నలకు సమాధానము ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే.
ఎందుకంటే ఎన్ని ప్రవచనాలో విన్నా వినేంతవరకే కానీ దానిని వంటబట్టించుకొని అమలు జరిపేవాళ్ళు ఒక్క శాతం ఉంటారేమో.
ఎవరికి వారికే ఆశామోహముల పట్ల విరక్తి జనించవలసిందే. లేదంటే మళ్ళీ మళ్ళీ జనించవలసిందే. పుణ్యపాపాలనుభవించవలసిందే.