Loading...

5, జూన్ 2013, బుధవారం

మయూరుని సూర్యశతకము- అర్థము- 9

రవివర్ణనము
౮౧. సిద్ధైః సిద్ధాన్తమిశ్రం  శ్రితవిధి విబుధై శ్చారణై శ్చాటు గర్భం
గీత్యాగన్ధర్వ ముఖ్యై ర్ముహు రహిపతిభి: యాతుధానై ర్యతాత్మ
సార్ఘం సాధ్యై ర్మునీన్ద్రై ర్ముదిత మత మనోమోక్షిభిః పక్షపాతా
త్ప్రాతః  ప్రారభ్యమాణ స్తుతిరవతు రవిర్విశ్వవంద్యోదయః  వః ||
సిద్ధాన్తమిస్రం= సిద్ధాంతమిశ్రముగా, శాస్త్రానుసారముగా ననిసిద్ధైః= సిద్ధులచేత శ్రితవిధి= విధివిహితముగా విబుధైః= దేవతలచేత, చాటు గర్భం= స్రోత్రగర్భముగా, చారణైః= చారణులచేత, గీత్వా= గానముతో గంధర్వముఖ్యులచేత, యతాత్మ= పవిత్రములగు ఆత్మలు కలిగి, అహిపతిభిః యాతుధానైః= నాగలోకముఖ్యులచేత , రాక్షసులచేత , సార్ఘ్యం= అర్ఘ్యప్రదానముతో , సాధ్యైః= సాధ్యులచేత, ముదిత తమమనః = మనస్సంతోషముగా మునీంద్రైః = మునులచేత, పక్షపాతాత్= పక్షపాతమువలన, మోక్షిభిః = ముక్తులచేతను, (సూర్యద్వారమున మనము ముక్తులమయితిమి కదా అను భావముతో అని భావము) , ప్రాతః = ప్రాతఃకాలమందు, ప్రారభ్యమాణస్తుతిః = ప్రారంభింపబడిన స్తుతి కలిగిన (పై అందరి స్తోత్రములతో ప్రారంభించిన అని), విశ్వపంద్యోః దయః =అందరికి నమస్కరింపదగిన , ఉదయము కల రవిః = సూర్యుడు, వః = మిమ్ము, అవతు= రక్షించుగాక.
భావము (నాకు తెలిసి)
శాస్త్రానుసారముగా, విధివిహితముగా దేవతలచేత, చారణులచేత, గంధర్వముఖ్యులచేత, పవిత్రములగు ఆత్మలు కలిగిన, నాగలోకముఖ్యుల చేత, రాక్షసులచేత, సాధ్యుల చేత, మునులచేత, ముక్తులచేత, గానముతో, అర్ఘ్యప్రదానముతో, సంతోషముగా స్తుతులతో ప్రారంభింపబడుచూ అందరిచేత నమస్కరింపబడదగిన ఉదయము కలవాడై  సూర్యుడు మిమ్ము రక్షించుగాక.
_______________________________
౮౨.భాసామాసన్న భావాదధికతర పటోశ్చక్రవాళస్యతాపా
చ్ఛేదా దచ్చిన్న గచ్చత్తురగ ఖురపుటన్యాస నిఃశఙ్కటఙ్కైః
నిః సఙ్గ స్యన్దనాఙ్గ భ్రమణ నికషణాత్ పాతు వస్త్రీప్రకారాం
తప్తాంశుః తత్పరీక్షా పర ఇవపరితః పర్యటన్ హాటకాద్రిమ్ ||
అర్థము
అధికతరపటోః = మిక్కిలి సమర్థములయిన(చాల వేడిమి కల అని), భాసాంచక్రవాళస్య = కాంతికిరణమండలము యొక్క, ఆసన్న  భావాత్ తాపాత్= దగ్గర అగుటచేత కలిగిన తాపముతో, మరియు అచ్ఛిన్న గచ్చత్తురగఖురపుటన్యాసనిశ్శంకటంకైః=ఎడతెగక పరుగెత్తు గుఱ్ఱపుడెక్కలనెడి టంకములతో (టంకమనగా రాతిని పగలకొట్టు సాధనము) చేదైః = నరకుట చేత నిస్సంగస్యందనాంగభ్రమణ నికషణాత్= ఇంకొకదానిచేత సంబంధములేని రథచక్రభమణమనెడి ఒరిపిడి వలననుప్రపకారాం = పైన చెప్పిన మూడు విధములుగా తత్పరీక్షాపర ఇవ= ఆ మేరుపర్వతమును పరీక్షించు వానివలె , హాటకాద్రింపరితః = బంగారు కొండచుట్టును , పర్యటన్= తరుగుచున్న, తప్తాంశు= సూర్యుడు, వః = మిమ్ము , పాతు= రక్షించుగాక.
తాత్పర్యము
బంగారమును పరీక్షించువాడు బంగారమును కాల్చి కత్తరించి ఒక ఒరిపిడి పెట్టి, పరీక్షించును. బంగరు కొండ అగు మేరువు చుట్టూ పరిభ్రమించు సూర్యుడు మూడు విధములుగా సువర్ణ పరీక్షకుని వలె నున్నాడు.
భావము (నాకు తెలిసి)
బంగారాన్ని పరీక్షించి మెరుగు పెట్టువాడు వేడిమితో కాల్చి టంకముతో కొట్టి ఒరిపిడి కలిగించునట్టుగా సూర్యుడు చాలా వేడిమి కల కాంతి కిరణముల తాపముతో, గుఱ్ఱపుడెక్కలనెడి టంకముతో , చక్రభ్రమణపు ఒరిపిడి కలిగించుచూ మేరువు అను బంగారుకొండ చుట్టూ దానిని పరీక్షించువానివలె తిరుగుచున్న వాడైనట్టి సూర్యుడు మిమ్ము రక్షించుగాక.
______________________________
౮౩. నో శుష్కం నాకనద్యా వికసిత కనకామ్భోజయా భ్రాజితన్తు
ప్లుష్టా నైవోపభోగ్యా భవతి భృశతరం నన్దనోద్యానలక్ష్మిః
నో శృఙ్గాణి ద్రుతానిద్రుత మమరగిరేః కాలథౌతానిథౌతం
నీద్ధం ధామ ద్యుమార్గే మ్రదయతి దయయా యత్ర సోఽర్కోన్ వతాద్వః ||
అర్థము
యత్ర = ఎవడు (సూర్యుడు), ద్యుమార్గే= ఆకాశమార్గమందు, ధామ= తనతేజస్సును , మ్రదయతి= మృదువుగా చేయుచుండగా, (తేజస్సునతి తీవ్రంగా ప్రసరింపజేయకుండగా తర) వికసిత కనకాంభోజయా= వికసించిన బంగారు పద్మములు కలిగిన నాకనద్యా= గంగచేతనో, శుష్కం= శోషింపబడలేదో, ( ఎండిపోలేదని) , భ్రాజితంతు= మీదు మిక్కిలి ప్రకాశింపబడినది (ఎండలేదు సరికదా ప్రకాశించినది అని అర్థము మరియు నందనోద్యాన లక్ష్మీ= నందనందనోద్యానవనము యొక్క శోభ , ప్లుష్టానైవ= దహింపబడలేదు , మీదు మిక్కిలి, ఉపభోగ్యా= అనుభవించుటకు యోగ్యమైనది , భవతి= అగుచున్నదో మరియు, అమరగిరేః = మేరు పర్వతము యొక్క, కాలదౌతాని శృంగాణి= బంగారపు శిఖరములు, ద్రుతః = శీఘ్రముగా నోద్రుతాని= కరగిపోవుట లేదో, సః =అట్టి, ఇనః = సూర్యుడు దయయా= దయతో, వః = మిమ్ము, అవ్యాత్= రక్షించుగాక.
భావము (నాకు తెలిసి)
ఎవరైతే తన తేజస్సు యొక్క తీవ్రతను తగ్గిస్తూ   ఆకాశగంగ లోని బంగారు కమలాలు ఎండిపోకుండా ఉంచి, మరింత ప్రకాశించేటట్లు చేస్తున్నారో, ఎవరివల్లనైతే నందనందనోద్యానవనము యొక్క శోభ దహింపబడక మరింత యోగ్యమైనదగు చున్నదో, ఎవరైతే తన వేడిమిచేత సువర్ణమేరు శిఖరాలు కరుగకుండా ప్రకాశించేలా చేస్తున్నారో, ఆ సూర్యుడు దయతో మిమ్ము రక్షించుగాక.
సాధారణముగా వేడిమికి నది శుష్కిస్తుంది. పువ్వులు ఎండి, తోటలు దహింపబడుతాయి. బంగారము కరుగుతుంది. కానీ ఇక్కడ అట్టి స్థితి కలుగక ఉపకారమే జరుగును.
___________________

౮౪.ధ్వాన్తస్య ఏవాన్తహేతుర్న భవతి మలినైకాత్మనః పాప్మనోపి
ప్రాక్పాదోపాన్తభాజాం జనయతి న పరం పఙ్కజానాం ప్రబోధమ్
కర్తా నిఃశ్రేయసానామపి న తు ఖలు యః కేవలం వాసరాణాం
సోవ్యాదే కోద్యమేచ్ఛా విహిత బహు బృహద్విశ్వకార్యోర్యమా వః ||
అర్థము
యః = ఎవడు, మలినైకాత్మనః = మలిన స్వరూపమగు, ధ్వాంతస్య ఏవ= చీకటికే , అన్తహేతుః =  నాశమునకు హేతువైన వాడు, న భవతి = కాడో? (మరియు మలిన స్వరూపముగ), పాప్మనః  అపి= పాపమునకు కూడ (మలినమగు అంధకారము నేకాక పాపమును కూడ పోగొట్టునని) మరియు పరం= కేవలమును , పంకజానాం = పద్మములకు , ప్రబోధం = వికాసమును న= కాదు, ప్రాక్ = ముందుగా పాదోపాన్త భాజాం= ఉదయ పర్వత సమీపముననున్న వాటికిని (పద్మ ప్రబోధమును మాత్రమే కాదు) , పర్వత ప్రాన్త ప్రదేశము లకును వెలుతురు కలిగించునది మరియు పాదోపాన్తభాజాం అనుటచేత తన పాదములాశ్రయించిన వారికి , తత్త్వజ్ఞానమును కలిగించునవి ) మరియు కేవలం= కేవలముగా , వాసరాణాం = పగటికాలమును (మునకు) కర్తా= చేయు వాడు, న ఖలు= కాడు కదా  , నిఃశ్రేయ సానాం అపితు= మోక్షములకు కూడ (ముక్తిని కూడ) కల్గించువాడని ముక్తులు సూర్యమార్గమున బోవుదురు. , సః = అట్టి , ఏకోద్యమేచ్ఛా విహిత బహు బృహద్విశ్వకార్యః = ఒక దానికి ఉద్యమించు ఇచ్ఛ చేతనే పెక్కు కార్యములు నిర్వహించు, అర్యమా= సూర్యుడు, వః మిమ్ము , అవ్యాత్= రక్షించుగాక.
ఈ శ్లోకమున తన పాదములాశ్రయించిన వారి హృదయ మాలిన్యమును పోగొట్టి తత్త్వజ్ఞానమును కలిగించి మోక్షమార్గమును జూపు గురువు ధ్వనించినాడు.
ఎవరు మలినస్వరూపమగు చీకటికి, పాపమునకు (రెండింటికి) నాశహేతువగుచున్నారో, ఎవరు పద్మమునకు వికాసమును , పర్వతపాదములకు వెలుగు ప్రసాదించినట్లే -ఆశ్రయించినవారికి వికాసమును, తత్త్వజ్ఞానమును ప్రసాదించుచున్నారో (అనగా సూర్యోపాసన చేయువారికి బుద్ధి వికాసము, జ్ఞానబోధ జరుగునని భావము), ఎవరు పగటికి కారణమయినట్లుగానే, ముక్తికి దారి అగుచున్నారో ఇట్లు ఒక సంకల్పముతోనే పెక్కు కార్యములు నిర్వహించు సూర్యుడు మిమ్ము రక్షించు గాక.
___________________
౮౫. లోటల్లోష్టావిచేష్టః శ్రితశయన తలో నిఃసహీభూతదేహః
సందేహీ ప్రాణితవ్యే సపది దశదిశః ప్రేక్షమాణోన్ధకారాః
నిఃశ్వాసాయాసనిష్ఠః పరమపరవశో జాయతే జీవలోకః
శోకే నేవా న్యలోకానుదయకృతి గతే యత్ర సోర్కోవతాద్వః
అర్థము
ఉదయకృతి= ఉదయకరుడైన (తనకు మేలు చేకూర్చువాడని) , యత్రః =ఎవడు, అన్యలోకాన్ గతే= పరలోకములకు పోగా(అస్తమింపగా అని) , శోకేనేవ = దుఃఖముచేతనో యనినట్లు , జీవలోకః =జంతుజాలము, (ఇందు మానవుడు కూడనున్నాడు, లోప్టా విచేష్టః =మట్టిగడ్డవలె చేష్టలు లేనిదై , లోడన్= పొరలుచున్నదై (శతశయనతలః =మంచమున జేరినదై ,నిఃసహీ భూతదేహః దేహముస్పృహతప్పినదై, ప్రాణితవ్యే= జీవింపదగిన విషయమందు , సందేహీ= సందేహము కలదై,దశదిశః=పదిదిక్కులను , అంధకారం = చీకటిని , ప్రేక్ష్యమాణః = చూచుచున్నదై, నిఃశ్వాసాయాసనిష్ఠః = నిట్టూరుపులు విడచు కష్టముకలదై, పరమ పరవశః= మిక్కిలి పరవశమైనదై, జాయతే= అగుచున్నదో, సః =అట్టి, అర్కః = సూర్యుడు , వః= మిమ్ము, అవతాత్= రక్షించుగాక.
తమకు మేలు చేయువాడు మరణించినచో ఎట్లుండునో సూర్యాస్తమయం పిదప జనుల స్థితి అట్లున్నదని ధ్వనిత్వము.
భావము (నాకు తెలిసి)
సాధారణముగా సూర్యాస్తమయం అయిన పిదప శీఘ్రమే సకల జీవరాశి విశ్రమించును, దిక్కులు చీకటితో నిండును. ప్రత్యామ్నాయ వెలుగు ఏర్పాటు లేని జీవులు అతికష్టముతో రాత్రి గడపుదురు. అట్టిచో అత్యంత ఆప్తుడు దూరమయినపుడు దుఃఖముచేత మంచము పట్టిన వానివలె సమస్త జగత్తు ఉన్నదని కవి భావన. ఈ విధము గా ఎవరి వలన జగత్తు చేతనత్వము పొందుచూ, ఎవరు లేకపోయిన యెడల జగత్తు దుఃఖములో కష్టములో మునుగుచున్నదో అట్టి సూర్యుడు మిమ్ము రక్షించుగాక.
______________________________
౮౬.క్రామల్లోలోపి లోకాన్తదుపకృతికృతౌవాశ్రితః స్థైర్యకోటిం
నృణాం దృష్టిం విజిహ్మాం విదద దపి కరోతి యన్తరత్యన్తభద్రామ్
యస్తాపస్యాపి హేతుర్భవతి నియమినామేకనిర్వాణదాయీ
భూయాత్ సప్రాగవస్థాధికతర పరిణామోదయోర్కః శ్రియే వః ||
 అర్థము
యః= ఎవడు , లోకాన్=లోకములను, క్రామన్= పరిభ్రమించుచు , లోలోపి= చంచలుడైన , తదుపకృతి కృతౌ= ఆలోకమునకుపకారము చేయుటయందు స్థైర్యకోటిం= స్థిరత్వమనెడి పక్షమునకు , ఆశ్రితః = ఆశ్రయించినవాడో (స్థిరముగా నుండెననుట) మరియు, నృణాం= జనులయొక్క , దృష్టిం= చూపును, విజిహ్మాం= మందముగా విదదత్ అపి= చేయు వాడైనను (చూపును), అంతః = లోపల అత్యన్త భద్రాం= మిక్కిలి భద్రము కలదానిని గాకరోతి= చేయుచున్నాడో, (సూర్యుని చూచినప్పుడు చూడలేని  స్థితి కలిగి రెప్పలు జడములైనను, లోపల భద్రము కలిగియేయుండును) మరియు తాపస్య తాపమునకు ,హేతుః అపి= కారణమేమైనను , నియమినాం= యోగులకు, ఏకనిర్వాణాదాయీ= తానొక్కడే సుఖమునిచ్చు వాడగు చున్నాడో, సః =అట్టిప్రాగవస్థాధికతర , పరిణామోదయః= మొదటి స్థితికన్న క్రమాభివృద్ధి కల , ఉదయం కలిగిన, అర్కః = సూర్యుడు, వః = మీయొక్క శ్రియై = సంపదకొఱకు, భూయాత్= అగుగాక.
భావము (నాకు తెలిసి)
ఎవరు నిరంతరమూ చలిస్తున్న లోకమునకు స్థిరత్వము నొసంగుచున్నారో, జనుల చూపుకు తనను చూసే శక్తిలేనప్పటికీ వారి చూపుకు భద్రము కలిగించుచున్నారో, యోగులకు ఎవరికారణంగా అలౌకికస్థితి కల్గుచున్నదో, అట్టి క్రమాభివృద్ధి స్వభావము కలిగిన సూర్యుడు మీ సంపదలకు కారణమగుగాక.
________________________________
౮౭.వ్యాపన్నర్తుః న కాలో వ్యభిచరతి ఫలం నౌషధీర్వృష్టిరిష్టా
నైష్టైః తృప్త్యన్తి దేవా నహి వహతి మరున్నిర్మలాభాని భాని
ఆశాః శాన్తా నభిన్దంతి యవధి ముదధయో బిభ్రతి క్ష్మాభృతః క్ష్మాం
యస్మిన్ స్త్రైలోక్యమేవం న చలతి తపతి స్తాత్ససూర్యః శ్రియే వః ||
అర్థము
యస్మిన్=ఎవడు, తపతి= తపించుచుండగా, కాలః కాలము , వ్యాపన్నర్తుః = ఋతువులు నశించినది, న= కాదో, మరియు , ఓషధీ సస్యములను, ఫలం= ఫలమున వ్యభిచరతి తప్పకుండనున్నదో, వృష్టిః= వర్షము, ఇష్టా= ఇష్టమైనదో ,దేవాః= దేవతలు, ఇష్టైః = యజ్ఞములు చేత తృప్త్యన్తి నహి= తృప్తి బొందుచున్నారో, మరుత్= వాయువు,వహతి = వీచుచున్నాడో, ఆశాః=దిక్కులు, శాన్తాః= శాంతి బొందుచున్నవో, ఉదధయః = సముద్రములు , అవధిం= హద్దును, నభిన్దన్తి= పగులుచుటలేదో, భాని= నక్షత్రములు, నిర్మలాభాని= నిర్మలముగా ప్రకాశించుచున్నవో, క్ష్మాభృతః= పర్వతములు, క్ష్మాం= భూమిని బిభ్రతి= భరించుచున్నవో, ఏవం= ఇట్లు త్రైలోక్యం = ముల్లోకములు, నచలతే= చలింపకున్నవో, సః =అట్టి, సూర్యః= సూర్యుడు, వః= మీయొక్క, శ్రియై= సంపదకొరకు స్తాత్= అగుగాక.

వివరణము= ఎవరయిన తీవ్రముగా తపస్సుచేస్తే అనేక ఋతువులు గతించి పోవును, తపస్సు ఫలింపకపోవచ్చును, వర్షము దానికి అభీష్టము కాదు తపస్సులో కూరుచుంటే దేవయాగములు చేయుటకుదరదు, వాయువు దిక్కులు సముద్రములు కొండలు వీనిలో వైపరీత్యం సంభవిస్తుంది.కాని సూర్యుని తపస్సులో అట్టివిపరీతములు సంభవించుట లేదు.. అన్నియు వాటివాటి స్వభావములోనున్నవి.
భావము (నాకు తెలిసి)
సాధారణంగా తాపసుల తీవ్ర నియమముల తపస్సు చేసినచో ఋతువులు మారిపోవుచూ, దేవయాగములు ప్రభావితమైతూ, సుడిగాలులు వీస్తూ, సముద్రములు పొంగుతూ, కొండలు పగులుతూ విపరీతాలు సంభవించును. కానీ సూర్యుని నిష్ఠతో కూడిన తపస్సు వలన విపరీతాలు జరుగకపోగా,  ప్రకృతికి మరింత మంచి జరుగుచున్నది. ఋతువులు ఏర్పడుతున్నాయి. ఓషధులు, పంటలు సక్రమంగా పండుతున్నాయి. యజ్ఞములచే దేవతలు తృప్తి పొందుతున్నారు. వాయువు చక్కగా వీచి దిక్కులు ప్రశాంతతను పొందుతున్నాయి.నక్షత్రములు నిర్మలముగా ప్రకాశిస్తున్నాయి. పర్వతములు పగులకుండా నిలిచి భూమిని భరిస్తున్నాయి.లోకములు చలించకుండా ఉన్నాయి. వీటికి హేతువైన సూర్యుడు మీ మీ సంపదలకు హేతువగుగాక.
_________________
౮౮. కైలాసే కృత్తివాసా విహరతి విరహాత్రే సదేహోఢ కాన్తః
శ్రాన్తః శేతే మహాహౌవధిజలధి వినా ఛద్మనా పద్మనాభః
యోగోద్యోగైకతానో గమయతి సకలం వాసరం స్వం స్వయంభూః
భూరి త్రైలోక్యాచిన్తాభృతి భువనవిభౌ యత్ర భాస్వాన్సవోవ్యాత్ ||
అర్థము
యత్ర=ఎవడు, భువనవిభౌ= లోకపతి అయిన, భూరి త్రైలోక్య చిన్తాభృతి=ముల్లోకములు యోగక్షేమములను చింతజేయువాడు కాగా కృత్తివాసాః= శివుడు, విరహాత్రే సదేహోఢకాన్తః = వియోగభయముచేత, పార్వతిని దేహమున ధరించువాడై, కైలాసే = కైలాసమందు, విహరంతి= విహరించుచున్నాడో.శ్రాన్తః = బడలిన, పద్మనాభః= విష్ణువు ఛద్మవినా= వ్యాజములేక(ఏదేనొక కార్యభారము లేక అని) , అధిజలధి= సముద్రమందు, మహాహౌ= శేషుని యందు, శేతే= శయనించుచున్నాడో మరియు, స్వయంభూః బ్రహ్మయోగోద్యోగైకతానః= ఏకాగ్రమగు యోగాభ్యాసము జేయువాడై, స్వం= తన , వాసరం సకలం =పగలంతయును, గమయతి= గడపుచున్నాడో ,సః = అట్టి భాస్వాన్= సూర్యుడు, వః= మిమ్ము, అవ్యాత్ = రక్షించుగాక.
భావము (నాకు తెలిసి)
ఎవరిని లోకపతిగా నియమించి శివుడు పార్వతితో కైలాసమందు విహరించుచూ, విష్ణువు తీరికగా శేషునిపై శయనించుచూ, బ్రహ్మ యోగధ్యానములందు గడపుచూ నిశ్చింతగా ఉన్నారో అట్టి సూర్యుడు మిమ్ము రక్షించు గాక.
_____________________________________
౮౯. ఏతద్యన్మణ్డలంఖే తపతి దినకృతస్తా ఋచోర్చీంషి యాని
ద్యోతన్తే తాని సామాన్యయమపి పురుషో మణ్డలే అణుర్యజూంషి
ఏవం యం వేద వేదత్రితయమయం వేదవేదీ సమగ్రో
వర్గం స్వర్గాపవర్గ ప్రకృతిరవికృతిః సోస్తు సూర్యః శ్రియే వః ||
అర్థము
దినకృతః= సూర్యుని యొక్క, ఏతత్ యత్ మండలం= ఏ ఈ మండల, ముఖే= ఆకసమున, తపతి= తపించుచున్నాడో ,అదితా ఋచః = ఆ ఋక్కులు (ఋగ్వేదము) మరియు యాని ఆర్చీంషి ద్యోతన్తే= ఏ వెలుగులు ప్రకాశించుచున్నవో, తాని సామాని= అవి సామవేదములు, మండలే= మండలమందు, అణుః = అణువగు , అయం అపిపరుషిః = ఈ పురుషుడు, యజూంషి= యజుర్వేదములు, ఏవం= అని, యం= ఎవనిని, వేదవేదీ సమగ్రః వర్గః =వేదము తెలిసిన సమస్తవర్గము (వేదవేత్తలగు పండితులని) యం= ఎవనిని , వేదత్రి తయమయం =మూడు వేదముల స్వరూపముగా వేద= తెలుసుకొన్నదో, సః = అట్టి, స్వర్గాపవర్గ ప్రకృతిః = స్వర్గమోక్షములు స్వభావము గా కలిగిన, అవికృతిః = వికారము (మార్పు లేని) సూర్యః = సూర్యుడు, వః = మీయొక్క, శ్రియై= సంపదకు , అన్తు= గాక.
వివరణము
సూర్యుని త్రయూతనుః(మూడు వేదములు శరీరముగా కలవాడని) చెప్పుదురు. " త్రయీహి ఏష విద్యాతపతి" తాఋచిః సఋచాం లోకః " తదేత దర్చిర్దీప్యతే తన్మహావ్రతంతాని సామాని ససామ్నాం లోకః" " యఏషోణురంత్తరాదిత్యే" మొదలగు శ్రుతులు పై విషయములకు ప్రమాణము.
భావము (నాకు తెలిసి)
సూర్యుని ముఖమండలము ఋగ్వేదమని, వెలుగులు సామవేదమని, ఈ పురుషుడు యజుర్వేదమని వేదము తెలిసినవారు సూర్యుని మూడు వేదముల స్వరూపముగా తెలిసికొన్నారు. అట్టి స్వర్గమోక్షములు స్వభావము గాకలిగిన, వికారము (మార్పు) లేని సూర్యుడు మీ సంపదలకు కారణమగుగాక.
_______________________
౯౦.నాకౌకః ప్రత్యనీకక్షతిపటుమహసాం వాసావాగ్రేసరాణాం
సర్వేషాం సాధు పాతాం జగదిదం అదితేరాత్మజత్వే సమేపి
యేనాదిత్యాభిధానం నిరతిశయగుణైరాత్మనిన్యస్తమస్తు
స్తుత్య స్త్రైలోక్యవన్ద్యై  స్త్రిదశమునిగణైః సోంశు మాఙ్ శ్రేయసే వః ||
అర్థము
నాకౌకః ప్రత్యనీకక్షతి పటునుహసాం= రాక్షసులను పడగొట్టు సమర్థమగు తేజస్సు గలవారును, ఇదం జగత్= ఈ లోకమును (జాత్యేక వచనము) , సాధు= లెస్సగా, పాతాం = రక్షించువారును, అయిన వాసవాగ్రేసరాణాం= ఇంద్రుడు మొదలగు సర్వేషాం= అందరికిని , అదితేః ఆత్మజత్వే= అదితికి పుత్రులగుట , సమేపి= సమానమైనను, యేన= ఎవనిచేత నిరతిశయగుణైః= సాటిలేని గుణములచేత, అదిత్యాభిధానం= ఆదిత్యుడనెడి పేరును, న్యస్తం అస్తి= పెట్టబడినదో , ధరింపబడినదో, సః= అట్టి, త్రైలోక్యవంద్యైః= మూడులోకములవారికిని వందనీయులైన, త్రిదశమునిగణైః = దేవతలచేత మునులచేతను, స్తుత్యః = స్తుతింపబడు, సూర్యః = సూర్యుడు, వః =మీకు, శ్రియై= సంపదకొఱకు, అస్తు= అగుగాక.
వివరణము
 అదితేః అపత్యాని ప్రమాంసః = అదిత్యాః అని దేవతలకందరికిని అదితి సంతానమగుటచేత ఆదిత్యులని పేరేకాని ప్రత్యేకముగా ఆదిత్యుడని ఏకవచనముగా చెప్పినపుడు సూర్యుడనియే అర్థము.ఆదిత్యుడనగా సూర్యుడని కోశములయందున్నది. దీనిని పురస్కరించుకొని కవి రమ్యముగా స్వభావోక్తిని చెప్పినాడు.
భావము (నాకు తెలిసి)
రాక్షసులను పడగొట్టగలిగి, లోకములను రక్షించు శక్తి గలిగి ఇంద్రుడు మొదలైనవారు కూడా దేవమాత అదితి పుత్రులై ఆదిత్యులని పిలువబడినప్పటికీ, తన సాటిలేని గుణములచేత ఆదిత్యుడను పేరు సూర్యునికి పేరుగా స్థిరపడినది. అట్టి త్రైలోక్యవంద్యుడైన స్తుతిపాత్రుడైన సూర్యుడు మీకు సంపదలకు హేతువగుగాక.
______________