Loading...

9, మే 2013, గురువారం

మయూరుని సూర్యశతకము- అర్థము- 8

౭౧.చక్రీ చక్రారపఙ్క్తిం హరిరపి చ హరీన్ ధూర్జటిర్ధూర్ధ్వజన్తాం
నక్షంనక్షత్ర నాధోరుణమపి వరుణః కూబరాగ్రం కుబేరః
రంహిః సంఘః సురాణాం జగదుపకృతయేనిత్యయుక్తస్య యస్య
స్తౌతి ప్రీతి ప్రసన్నో&న్వహమహిమరుచేః సో&వతాత్స్యన్దనో వః
అర్థము
జగదుపకృతయే = లోకోపకారమునకై , నిత్యయుక్తస్య= నిత్యమును సంచరణయుక్తమగు , యస్య = దేనియొక్క (రథము) చక్రారపఙ్క్తిం = చక్రపు పూటీలను, చక్రీ= విష్ణువు , హరీన్= గుఱ్ఱములను, హరిః అపిచ= దేవేంద్రుడును, ధూర్ధ్వజాన్తాన్= రథపు మొదటనున్న జెండా కొసలను, ధూర్జటిః =శివుడు, అక్షం = బండి కంటిని, నక్షత్రనాథః = చంద్రుడు , అరుణం అపి = అనూరుని , వరుణః = వరుణుడు , కూబరాగ్రం నొగ మొదలును కుబేరః = కుబేరుడు , రంహిః = వేగమును, సురాణాం సంఘః= దేవతల సమూహమున్ను, అన్వహం= ఎల్లప్పుడు, స్తౌతి = స్తుతించుచున్నారో, సః = ఆ ప్రీతి ప్రసన్నః = ప్రీతి ప్రసన్నమగు , అహిమరుచేః స్యందనః = సూర్యుని రథము, వః = మిమ్ము, అవతాత్= రక్షించుగాక.
భావము (నాకు తెలిసి)
నిత్యమూ శక్తియుతమై సంచరించుచుండు ఈ రథపు చక్రములను విష్ణువు, గుఱ్ఱములను దేవేంద్రుడు, రథపు జెండా కొసలను శివుడు, కంటిని చంద్రుడు, అనూరుని వరుణుడు, నొగ మొదలును కుబేరుడు, వేగమును దేవతల గుంపు ఎల్లప్పుడు స్తుతించుచున్నారు . అట్టి ప్రీతి ప్రసన్నమగు సూర్యుని రథము మిమ్ము రక్షించుగాక.
------------------------------
౭౨. నేత్రాహీనేన మూలే విహిత పరికరః సిద్ధ సాధ్యైర్మరుద్భిః
పాదోపాన్తే స్తుతో&లం బలిహరిరభసాకర్షణాబద్ధవేగః
భ్రామ్యన్వ్యో మామ్బురాశావశిశిరకిరణ స్యన్దనః సన్తతం వో
దిశ్యాల్లక్షీ మపారామతులిత మహిమేవా పరోమన్దరాద్రిః ||
అవతారిక
 
అర్థము
మూలే= మూలమునందు,హీనేన నేత్రా=తొడలులేక అంగహీనుడగు అనూరుని చేత, విహిత పరికరః = చేయబడిన పరికరము గలది, నేత్రాహీనేన = కవ్వపు త్రాడయిన వాసుకి చేత (మూలమున పరికరము గలది) పాదోపాన్తే== చక్రము సమీపమున తనకు సమీపముననున్న చిన్న పర్వతములచెంత సిద్ధసాధ్యైః = సిద్ధులచేత, మరుద్భిః = వాయువులచేత, మరుత్తులనెడి దేవతలచెతను, అలం= మిక్కిలి , స్తుతః = స్తుతింపబడినది, బలిహరిరభసాకర్థణాత్= బలముగల గుఱ్ఱములు తొట్రుపాటుతో లాగుటవలన , బద్ధవేగః= వేగము బంధించినది (ఈ విశేషణము రెండింటికి సమానార్థమే ఇట్లున్న మొదటి అర్థమును రథమునకన్వయించుకొనవలెను.) అతులితమహిమా= సాటిలేని మహిమ గల, అశిశిరకిరణస్యస్యందనః =సూర్యుని రథము, వ్యోమాంబురాశౌ = ఆకాశమనెడు సముద్రమునందు, భ్రామ్యన్= తిరుగుచున్నదై , అపరః  సుందరాద్రి ఇవ= వేరొక మంధర పర్వతమువలె నున్నదై , వః = మీకు, సంతతం= ఎల్లప్పుడు, అతులితాం = సాటిలేని , లక్ష్మీం= సంపదను , దిశ్యాత్= ఇచ్చుగాక.
భావము (నాకు తెలిసి)
కవి ఇక్కడ సూర్యరథమును - క్షీరసాగరమథనము నాటి మంథర గిరి తో పోలుస్తున్నాడు.
సూర్యరథము అంగహీనుడగు అనూరుని చేత ఆకాశమునందు, మంథర పర్వతము(క్షీరసాగరమథన సందర్భమున) కవ్వపు త్రాడుగా వాసుకి చేత సముద్రమునందు వలె నడుపబడుచున్నది. రెండును (సూర్యరథము, మంధరపర్వతము) తనచెంత నే నిలిచి స్తుతించు దేవతలను, వాయువులను మొదలైన వారిని కలిగి ఉన్నది. ఇటువంటి సాటిలేని సూర్యరథము మీకు సాటిలేని సంపదలనిచ్చుగాక.
_______________________________________________________
౭౩. యజ్జ్యాయో బీజమహ్నామపహతతిమిరం చక్షుషామఞ్జనంయ
ద్ద్వారంయన్ముక్తి భాజాం యదఖిలభువనజ్యోతిషామేకమోకః
యద్వృష్టమ్భోనిధానం ధరణిరససుధాపానపాత్రం మహద్య
ద్దిశ్యాదీశస్యభాసాన్తదవికలమలంమఙ్గళం మణ్డలం వః||
అర్థము
యత్= ఏది, అహ్నాం=దినములకు(పగళ్ళకు) , జ్యాయః = బీజ ప్రధానమగుకారణమో? యత్=ఏది, అపహతతిమిరం= అంధకారమును పోగొట్టెడి మరియు ఒక నేత్రవ్యాధిని పోగొట్టెడి , చక్షుషాం అఞ్జనం= కనుల కాటుక అయినదో? యత్ =ఏది, ముక్తిభాజాం= మోక్షమునకు పోవువారికి, ద్వారం= ప్రవేశద్వారమో, యత్=ఏది, వృష్ట్యంభో నిధానం= వర్షమునకు నిధియో? యత్= ఏది, అఖిల భువనజ్యోతిషాం=(సమస్తలోకముల వెలుగులకు, ఏకంఓకః= ఒక్కటే అయిన స్థానమో, యత్= ఏది, వృష్ట్యంభో విధానం= వర్షమునకు నిధియో, యత్= ఏది,ధరణిరససుధాపానపాత్రం= భూమికిరసామృతం త్రావుటకు పానపాత్రమో? లేక రసామృతపానము చేయుటకు భూమి యనెడు పానపాత్రము కలిగినదో?(సూర్యమండలమునుండి వర్షము కురియును గనుక భూజమును ఆకర్షించి సూర్యమండలము వర్షించును కనుకను రెండు విధములుగను చెప్పవచ్చును.) తత్= అట్టి, అవికలం = లోపములేనిదియు, అమలం=నిర్మలమైనదియు నైన , భాసాం ఈశస్యమండలం= సూర్యమండలము, వః = మీకు, మంగళం= శుభమును , దిశ్యాత్= ఇచ్చుగాక.
భావము (నాకు తెలిసి)
ఏ సూర్యమండలమైతే అంధకారమును పోగొడుతూ, నేత్రవ్యాధిని పోగొడుతూ ఉండగల అంజనమో, ఏదైతే మోక్షద్వారమో, ఏదైతే వర్షపుభాండాగారమో, ఏదైతే భూమికి పానపాత్రగా ఉందో మరియు ఏదైతే భూమిని పానపాత్రగా చేసుకుందో, అట్టి నిర్మలమైన సూర్యమండలము మీకు శుభములనిచ్చుగాక.
________________________________________
౭౪. వేలావర్ధిష్ణు సిన్ధోః పయ ఇవ ఖమి వార్ధోద్గతాగ్ర్యగ్రహోడు
స్తోకోద్భిన్న స్వచిహ్నప్రసవమివ మధోరాస్యమస్యన్మనాంసి
ప్రాతః పూష్ణోఽశుభాని ప్రశమయతు శిరః శేఖరీభూతమద్రేః
సౌరస్త్యస్యోద్గభస్తి స్తిమిత తమతమః ఖణ్డనం మణ్డలం వః ||
అవతారిక
కవి సూర్యమండలమును సముద్రజలముతో, ఆకసముతో వసంతఋతుప్రవేశముతోను పోల్చుచున్నాడు. విశేషణములు ఉపమేయమగు మండలమునకు ఉపమానవస్తువులకును ఒక్కటియే అర్థభేదముమాత్రముండును. విశేషణపదసామ్యము మాత్రమే.

అర్థము
సౌరస్త్య అద్రేః =ఉదయాద్రికి, శిరశ్శేఖరీభూతం= శిరోభూషణమైనదియు , ఉద్గభస్తి= కిరణముపైకి ప్రసరించుచున్నదియు , స్తిమితతమతమఃఖండనం= అంతకుముందు నిలిచియున్న చీకట్లను పోగొట్టినదియునగు , ప్రాతః పూష్ణమండలం = ఉదయించుచున్న సూర్యునిమండలము , సింధోః పయ ఇవ= సముద్రజలము వలె,  వేలావర్ధిష్ణు= వేలావర్ధిష్ణువై సూర్యమండలము వేల అనగా సమయమునకు వృద్ధి చెందు స్వభావము కల అని సముద్ర జలము వేల అనగా చెలియలికట్ట వరకు వృద్ధి బొందు స్వభావము మరియు ఖం ఇవ= ఆకాశమువలె , అర్ధోద్గతాగ్ర్యగ్రహోడు= అర్ధోద్గతౌగ్ర్యగ్రహోడువై, సూర్యమండలఅర్థము= సగము పైకి వచ్చిన ప్రధాన గ్రహనక్షత్రములు కలది అని. అనగా తన ఉదయముచేత గ్రహనక్షత్రముల కాంతి సగమైనది అని ఆకాశమునకు కూడ అదే అర్థము సరిపోవును.మరియు మధోఆస్యం ఇవ = వసంతఋతువు మొదటిభాగము వలెనే, స్తోకోద్భిన్న స్వచిహ్న ప్రసవం= స్తోకోద్భిన్న స్వచిహ్నప్రసవమై సూర్యమండల పక్షార్థము కొద్దికొద్దిగా తన ఉదయము యొక్క గురుతులు కలదై అని వసంతర్తు పక్షమున = కొద్దికొద్దిగా పుష్పిస్తున్న పుష్పములవలన తన ఆరంభసూచనలు కలదై అని (ఇట్టి లక్షణములు గల సూర్యమండలము) మనాంసి అస్యత్= మనస్సులను హరించునదై(మనోహరమై) వః = మీ అశుభాని= అశుభములను ప్రశమయతు= శమింపజేయుగాక.
(అన్వయసౌకర్యము కొరకు పై విశేషణములను విధేయ విశేషణములు చేయుట జరిగినది.)
ఉదయాద్రికి శిరోభూషణమై, కిరణాలతో సముద్రజలము చెలియలికట్టవరకు వృద్ధి బొందుట వలె వృద్ధి పొందుతూ గ్రహనక్షత్రముల కాంతి ని తగ్గిస్తుంది.వసంతఋతువు తొలి ప్రవేశము రసజ్ఞులను ఆకర్షించినట్లుగా తన ఉదయపు గురుతులతో మనసులను హరిస్తుంది. అట్టి శుభకరమైన  సూర్యమండలము మీ అశుభములను శమింపజేయుగాక.
-------------------------------------------------------
౭౫. ప్రత్యుప్తస్తప్త హేమోజ్జ్వల రుచిరచలః పద్మరాగేణ యేన
జ్యాయః కిఞ్జల్కపుఞ్జో యదలికుల శితే రమ్బరేన్దీవరస్య
కాలవ్యాలస్యచిహ్నం మహితతమమహోమూర్ధ్నిరత్నం మహద్య
ద్దీప్తాంశోః ప్రాతరవ్యాత్తదవికల జగన్మణ్డనం మణ్డలం వః ||
అర్థము
తప్తహేమోజ్జ్వలరుచిః = మెరుగుబంగారమువలె ఉజ్జ్వలమగు కాంతిగల, అచలః= ఉదయాద్రి , ప్రాతఃకాలమున , పద్మరాగేణ యేన = రాగమణి అయిన దేని చేత , ప్రత్యుప్తః = పొదగబడినదో మరియు , యత్= ఏది, అళికులశితేః = తుమ్మెదలవలెనల్లనగు, అంబరేందీవరస్య= ఆకసమనెడి కలువకు , జ్యాయః కింజల్క పుంజం= మేలయిన కేసరసమూహమైనదో ,కేసరములు= పద్మమునకు గాని కలువకు గాని మధ్య భాగము నుండి నిలువుగానున్న జూలు , యత్= ఏది, కాలవ్యాశస్య మహితతమమహామూర్ధ్ని = అందరిచేత పూజింపబడు కాలమనెడు సర్పముయొక్క గొప్పతలయందు , చిహ్నం= గురుతైన మహత్ రత్నం = గొప్పరత్నమయినదో , తత్= ఆ అవికల జగన్మండనం=జగత్తులకన్నింటికి నిండు అలంకారమయిన , దీప్తాంశోః మండలం= సూర్యమండలము , వః= మిమ్ము , అవ్యాత్= రక్షించుగాక.
తాత్పర్యము
కాలమనెడుసర్పము తల అనగా ప్రాతస్సంధ్య అది పూజింపబడుట అనగా సంధ్యావందనాదులని కాలమును సర్పముతో పోల్చుటలోని విశేషమేమనగా " కాలః పచతి భూతాని" అని సర్వపివములకును కాలమే  లయ కారణము కాలసర్పమనియును ధ్వని మరియును తలపై రత్నమున్న సర్పమును దేవతగా భావించి పూజించుటయు కలదు.
భావము (నాకు తెలిసి)
ఏ సూర్యమండలమైతే మెరుగు బంగారము వలె మెఱిసే ఉదయాద్రిపై తుమ్మెదల బోలు నల్లటి గగనకలువకు నడుమన ఉన్న గొప్పదగు కేసరములవలె ప్రకాశించుచున్నదో, ఏదైతే పూజనీయమైన కాలసర్పపు మణి వలె ప్రకాశించుచున్నదో జగత్తులకన్నింటికి అలంకారమైన ఆ సూర్యమండలము మిమ్ము రక్షించుగాక.
_______________________________

౭౬. కస్త్రాతా తారకాణాం పతతి తనురవశ్యాయ బిన్దుర్యథేన్దు
ర్విద్రాణా దృక్స్మరారే రురసి మురరిపోః కౌస్తుభోనోద్గభస్తిః
వహ్నేః సావహ్నవేదద్యుతి రుదయగతే యత్ర తన్మణ్డలంవో
మార్తాణ్డీయం పునీతాద్ దివిభువిచ తమాంసీవ ముష్ణన్మహోంసి||
అర్థము
యత్ర ఉదయగతే= సూర్యమణ్డలము ఉదయించుచుండగా, ఇందుః = చంద్రుడు , తనుః అవశ్యాయబిందుః  యథా = చిన్నమంచు బిందువలె, పతతి = పడిపోవుచున్నాడు (అప్పుడు) తారకాణాం= నక్షత్రములకు, కః త్రాతా= ఎవడు రక్షకుడు? మరియు స్మరారేః = శివునియొక్క , దృక్= నేత్రము, నిద్రాణా= నిద్రించుచున్నది మరియు మురరిపోః = విష్ణువుయొక్క , ఉరసి= వక్షస్థలమందు , కౌస్తుభః = కౌస్తుభమణి , ఉద్గభస్తిః న= కాంతులు చిమ్మునది కాకుండెను మరియు వహ్నేః ద్యుతి = అగ్ని యొక్క కాంతి పాపహ్నపాఇవ= మరుగుపడినట్లున్నది, (ఆకారణముగా) భువి= భూమియందున్న, తమాంసి ఇవ= చీకట్లను పోగొట్టినట్లు ,దివి= స్వర్గమందున్న, మహాంసిచ= వెలుగులను కూడ , ముష్టత్ = హరించుచున్న, మార్తాండీయం మండలం= సూర్యుని మండలము , వః= మిమ్ము, పునీతాత్= పావనము జెయుగాక.
భావము (నాకు తెలిసి)
సూర్యమండలము ఉదయించుసమయంలో చంద్రుడే చిన్న మంచు బిందువువలె ఆవిరవుతుంటే నక్షత్రములకు ఇక ఎవడు రక్షకుడు? శివుని నేత్రము నిద్రించునపుడు, విష్ణువు వక్షస్థలపు కౌస్తుభమణి కాంతులు చిమ్మనపుడు, అగ్ని కాంతి మరుగుపడినపుడు కూడా భూమి పై చీకట్లను పోగొట్టగలిగినట్లు స్వర్గపు వెలుగులను హరించు సూర్యమండలము మిమ్ము పావనము జేయుగాక.
_____________________________________
౭౭.యత్ప్రాచ్యామ్ప్రాక్చకాస్తి ప్రభవతిచ యతః ప్రాచ్యసావుజ్జిహానా
దిద్ధం మఖ్యేయదహ్నో భవతి తత రుచాయేన చోత్పాద్యతేఽహః
యత్పర్యాయేణ లోకానవతి చ జగతాం జీవితం యచ్చతద్వో
విశ్వానుగ్రాహి విశ్వంసృజదపిచ రవేర్మణ్డలం ముక్తయేస్తు ||
అర్థము
యత్= ఏది, ప్రాక్= ముందు, ప్రాచ్యాం = తూర్పుదిక్కునందు , చకాస్తి= ప్రకాశించుచున్నదో, మరియు యతః ఉజ్జిహానాత్= ఏది విడిచిపోగా, అసౌప్రాచీ= ఆ తూర్పుదిక్కు , ప్రభవతి= జయించుచున్నదో , యత్= అహ్నః మధ్యే , మధ్యాహ్నమందు ఇద్ధం భవతి= ప్రజ్వలించుచున్నదో తతరుచాయేన= కాంతులను వెదజల్లుతున్నదేనిచేత, అహః ఉత్పాద్యతే= పగలు కలుగుచున్నదో , యత్= ఏది, లోకాన్ ప్రతపతిః = లోకములను తపింపజేయుచున్నదో, పర్యాయేణ= (అదియే) కాలాంతర్గతమున , జగతాం జీవితం= జగత్తులప్రాణమగుచున్నదో (వర్షించి ) తత్= ఆ విశ్వానుగ్రాహి= విశ్వము ననుగ్రహించునదియు , విశ్వం సృజత్ అపిచ= విశ్వమును సృష్టించునదియు నైన , రవేఃమండలం= సూర్యమండలము, వః = మీకు, ముక్తయే = మోక్షముకొరకు, అస్తు= అగుగాక.
(ఇందు సూర్యమండలము యొక్క దశలు చెప్పబడినవి. మోక్షమునకు అదియే కారణమగుచున్నది.)
భావము (నాకు తెలిసి)
దేని కాంతుల చేత పగలు కలుగుతున్నదో, ఏదైతే లోకములను తపింపజేయుచున్నదో, ఏదైతే జగత్తులకు ప్రాణమగుచున్నదో (వర్షరూపమున)  విశ్వమును సృజించగల, విశ్వమును అనుగ్రహించగల సూర్యమండలము మీకు మోక్షకారణమగుగాక.
_____________________
౭౮.శుష్యన్త్యోఢానుకారా మకరవసతయో మారవీణాం స్థలీనాం
యేనోత్తప్తాః స్పుటన్త స్ఝడితి తిలతులాం యాన్త్యగేన్ద్రా యుగాన్తే
తచ్చణ్డాంశో రకాణ్డ త్రిభువన దహనాశఙ్కయా ధామకృచ్ఛ్రాత్
సంహృత్యాలోకమాత్ర ప్రలఘు విదధతః స్తాన్ముదే మణ్డలం వః ||
అర్థము
యుగాన్తే = యుగాన్తమునందు (ప్రళయమున) యేన= ఏ సూర్యమండలము చేత , మకరవసతయః = సముద్రములు , మారవీణాం  స్థలీనాం = నిర్జలములయిన భూములయొక్క , ఊఢానుకారాః= అనుకారమును వహించినవై (నిర్జలప్రదేశముల వలెనున్నవైన) శుష్యన్తి= ఎండుచున్నవో? మరియు (అగ్రేన్ద్రాః= పర్వతములు, ఉత్తప్తాః = బాగా దహింపబడినవై , ఝుటితి =శీఘ్రముగా, స్ఫుటన్తః = పగిలినవై , తిలతులాం= నువ్వుగింజతో సామ్యమును (అణువు గానివి) , యాన్తి=పొందుచున్నవో,(అట్టి సూర్యమండలమేమగుచున్నది) , అకాండత్రిభువన దహనాంశంకయా= కాలముగాని కాలమున ముల్లోకములు దహింపబడునేమో అను ఆశంకతో కృత్స్నంధామ= తేజస్సునంతయును, ఆలోకమాత్రం= చూచుటకు తగినట్లుండునట్లుగా , సంహృత్య= సంకోచింపజేసి , ప్రలఘు= చాలా తక్కువగా, విదధత = చేయుచున్న, చండాంశో = సూర్యుని యొక్క , తత్= ఆ మండలము వః = మీయొక్క ,ముదే= సంతోషమునకు, స్తాత్= అగుగాక.
భావము (నాకు తెలిసి)
దేని బ్రహ్మాండమైన ప్రకాశముచేత యుగాంతమందు సముద్రములు ఎండి భూమిగా మారగలవో, దేని చేత పర్వతములు దహింపబడి నువ్వుగింజలవలె పగులగలవో, అట్టి ప్రకాశమును,తేజస్సును ముల్లోకముల క్షేమము కొఱకై చూచుటకు తగినట్టు సంకోచింప జేయుచున్న సూర్యుని మండలము మీకు సంతోషము నిచ్చుగాక.
____________________________
౭౯.ఉద్ద్యద్యూద్యానవాప్యాం బహులతమతమః పఙ్కపూరం విదార్య
ప్రోద్భిన్నం పత్ర పార్శ్వేష్వ విరలమరుణచ్ఛాయయా విస్పురన్త్యా
కల్యాణాని క్రియాద్వః కమలమివ మహన్మణ్డలం చణ్డభానో
రన్వీతం తృప్తి హేతోరసకృదవికులాకారిణా రాహుణా యత్||
అవతారిక
ఈ శ్లోకమున సూర్యమండలము సాధారణధర్మముల శ్లేషానుప్రాణనముచేత రూపకభావము చేత విశేషణ సామ్యములచేత పద్మములతో పోల్చబడినవి
అర్థము
యత్ = ఏది , ద్యూద్యానవాప్యాం= ఆకసమను తోట యందలిబావి యందు , బహులతమతమః  పంకపూరం= మిక్కిలివిస్తృతమగు చీకట్లనెడు బురద ప్రవాహమును , విదార్య= చీల్చుకొని, ఉద్యత్= ఉదయించుచున్నదై (తమశ్శబ్దమునకు రాహువర్ణము సూర్యమండలమునకు దానినన్వయించుకొనవచ్చును.మరియు , విస్ఫురంత్యాః = బాగా వెలుగుచున్న,అరుణచ్చాయయా=ఎర్రని చాయతో (అరుణశబ్దమునకు అనూరుడర్థము సూర్యమండలపక్షమున దానినన్వయింపవలెను) , పత్రపార్శ్వే= తామరపాకుల ప్రక్కల (మండల పక్షమున గుర్రములు ప్రక్కన) అవిరళ ప్రోద్భినం = ఎప్పుడును గూడియుండునదయి మరియు అవికులాకారిణా= తుమ్మెదల ఆకారముగల,రాహుణా = రాహువుచేత తృప్తీహేతో= తృప్తి కొరకు, అసకృత్= మాటిమాటికీ, అన్వీతం= అనుసరింపబడినదై, కమలమివ = కమలము వలె నున్నదో, అట్టి చండభానోః = మహత్ మండలం = సూర్యుని పెద్దమండలము, వః = మీకు కల్యాణాని = శుభములను, క్రియాత్= చేయుగాక.
భావము (నాకు తెలిసి)
ఆకసమను తోటలోని బావిలో మిక్కిలి విస్తృతమగు చీకట్లనెడు బురదను చీల్చుకొని ఉదయించు కమలము వలె , తామరాకుల వలె గుఱ్ఱములు ఎప్పుడూ ప్రక్కనే గూడియుండగా ఆశతో వచ్చు తుమ్మెద వలె రాహువు మాటిమాటికీ అనుసరింపబడుతూ ఉన్నదో అట్టి గొప్ప సూర్యుని మండలము మీకు శుభము చేయుగాక.
____________________________
౮౦.చక్షుర్దక్షద్విషోయన్నతుదహతిపురః పూరయత్యేవకామం
నాస్తంజుష్టం మరుద్భిర్యదిహనియమినాం యాన పాత్రం భవాబ్ధౌ
యద్వీత శ్రాన్తి శశ్వద్భ్రమదపి జగతాం భ్రాన్తిమభ్రాన్తి హన్తి
బ్రధ్నస్యావ్యాద్విరుద్ధక్రియ మథచ హితాధాయితన్మణ్డలం వః ||
అర్థము
యత్= ఏది, (సూర్యమండలము) , దక్షద్విషః చక్షుః = శివుని నేత్రమై (సూర్యుడు పరమేశ్వరుని నేత్రమని ప్రసిద్ధి) , పురః =ఎదురుగా , కామం= మన్మథుని (కోరికను),పూరయిత్యేవ = పూరించుచున్నదే కానీన తుదహతి= దహించుటలేదో, (ఒక నేత్రము కాముని దహించినది, ఇది మాత్రము భక్తులకామమును నెరవేర్చునది) (మరియు పురః అని దానిని త్రిపురములనగా చెప్పవచ్చును. అప్పుడు త్రిపురములను దహించినదొక నేత్రము . ఈ నేత్రము దహింపలేదని కూడ చెప్పవచ్చును.మరియు యత్= ఏది(సూర్యమండలము) ఇహ= ఈ లోకమున, నియమినాం= వ్రతనియమములు గలవారికి, భవాబ్ధి= సంసారమనెడి సముద్రము నందు,యానపాత్రం=దాటించునావ అయి, మరుద్భిః నాస్తంజుష్టం = గాలికి తొట్రుపాటు చెందదో? " మామూలు నావ గాలికి అటుఇటు కదలును. సూర్యమండలమనెడి నావ తొట్రుపాటు చెందుటలేదు. మరియు యత్= ఏది , శశ్వత్= ఎల్లప్పుడు , భ్రమదపి= తిరుగుచుండియును, వీతశ్రాన్తి= శ్రమములేనిదో మరియు అభ్రాన్తి= నిస్సందేహముగా , జగతాం భ్రాంతి= లోకముల భ్రాంతిని , హన్తి= పోగొట్టుచున్నదో? తత్= ఆ విరుద్ధ క్రియం అపి= విరుద్ధమగు కృత్యములు కలదైనను, విహితవిధాయ= అనుకూలమును చేయు, బ్రధ్నస్య మండలమ్= సూర్యమండలము,వః= మిమ్ము, అన్యాత్ = రక్షించుగాక.
భావము (నాకు తెలిసి)
ఏ సూర్యమండలమైతే శివనేత్రమై కూడా కాముని దహించుటలేదో, పురములను దహించుటలేదో , ఏ దైతే నియమములు గలవారికి సంసార సముద్రము దాటించు నావ అయికూడా సాధారణ నావ వలె తొట్రుపాటు పడదో, యుగముల తరబడి అవిశ్రాంతముగా శ్రమించుచున్ననూ శ్రమను ఏమాత్రము కనిపించనివ్వదో, ఇట్టి విరుద్ధకృత్యములు నిర్వహింప కలిగిన సూర్యమండలము మిమ్ము రక్షించుగాక.