Loading...

12, జూన్ 2011, ఆదివారం

గృహస్థాశ్రమంలో ఎన్ని కష్టాలో!

మానవజీవితంలో అనుసరించవలసినవిగా నాలుగుఆశ్రమాలను పేర్కొంటారు. వాటిల్లో గృహస్థాశ్రమము మిక్కిలి బాధ్యత్తో కూడుకున్నది. గృహస్థులు తమ గృహవ్యవహారములను నిర్వహించుకుంటూ, అతిథులను ఆదరిస్తూ మిగిలిన (బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస) ఆశ్రమాలలో ఉన్నవారికి శక్త్యానుసారం సహాయసహకారాలందిస్తూ ఉండవలసిన బాధ్యత ఉన్నది.


కానీ ఇవన్నీ నిర్వహిస్తూ ఇహపరసాధనలో గమ్యాన్ని చేరుటకు ప్రయత్నించుట అసాధ్యము కాదని పలువురు మహానుభావులు నిరూపించినప్పటికీ కష్టసాధ్యముగానే తోస్తున్నది. గృహస్థాశ్రమమంలో ఇహపరసాధన అనగా :-
ఇహమునందు - ఈ లోకమునందు బతికియుండగా లక్ష్యసాధన - అదీ సక్రమమైన మార్గాలద్వారా మాత్రమే సుమా. లక్ష్యసాధనలో ధనసముపార్జన మాత్రమే కాక కళత్ర, సంతానాదులతో పాటు తల్లిదండ్రులు, తోడబుట్టినవాళ్ళు , ఇతర బంధుమిత్రులు వీరందరికీ ఆర్థిక, సామాజిక పరమైన చేయూతనిస్తూ , కుటుంబవ్యవహార నిర్వహణల్లో అందరు ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ మధ్యమధ్యలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరిస్తూ, అడ్డంకుల్ని అధిగమిస్తూ ముందుకు సాగటం చేయాలి.

ఇందులో ధనార్జన లో కొన్ని కష్టాలు, అందరూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండటంలో కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ధనము సంపాదించటం యెట్లా? ఇష్టమైన పని చేద్దామంటే చాలినంత డబ్బు రాదు. చాలినంత డబ్బు అంటే ఎంత? పదివేలు వస్తే లక్ష, లక్ష వస్తే పది లక్షలు కావాలని అనిపిస్తూనే ఉంటుంది. ఈ రోజుల్లో దొరికే అన్ని సౌకర్యాల మీద మనసు పడేవాళ్ళే అరవై శాతం మంది.

ఉన్నదాంట్లో తృప్తి పడటం, అత్యాశలకు పోకుండా ఉండటం, దేన్నీ వృథా చేయకుండా వినియోగించటం అనే మంచి అలవాట్లు మన సమాజంలో ఉండేవి. ఎప్పుడు పాశ్చాత్య సంస్కృతి ప్రభావాల వల్ల తూర్పు దేశాల్లో ఇవి మృగ్యమై పోయాయో అప్పుడే సమాజంలో అశాంతి ప్రబలింది. ఈ మంచి అలవాట్లు లేకపోవటం వల్ల గృహస్థాశ్రమ నిర్వహణలో ఎంత డబ్బు సంపాదించినా, తక్కువే అనిపించటంతో మనిషి మనశ్శాంతి కోల్పోతున్నాడు.

సేద్యం చేయటం, పాడిని నిర్వహించటం ఎక్కువగా ప్రకృతి మీద ఆధారపడాల్సి రావటం వల్ల ఆ వృత్తుల్ని నిర్లక్ష్యం చేస్తూ నెలసరి జీతాల (ఎంత పెద్ద అంకైనా సరే) వైపు ఆకర్షింపబడ్డారు.

ఇంటి వ్యవహారాలు నిర్వహించుకోవటం , పిల్లలను ప్రేమతో , బాధ్యతతో పెంచటం అనేవి జీవితమంతా ఎంగేజ్డ్ గా ఉంచుతాయి కానీ, చివరి రోజుల్లో ఆర్థిక సెక్యూరిటీ ని ఇవ్వకపోవటం వల్ల వీటికి సహాయకులని, పనివాళ్ళని పెట్టుకొని నెలసరి జీతాలవైపు పరుగులు పెడుతున్నారు.


సేద్యం పూర్తిస్థాయిలో లేకపోవటం వల్ల అన్ని రకాల తిండి పదార్థాలూ సమాజానికి కావలసినంత పరిమాణంలో లభించటం లేదు. లభించినా ధరలు అందుబాటులో ఉండటం లేదు.

పాడి లేక స్వచ్ఛమైన కల్తీలేని పాలు, పెరుగు, నెయ్యి వీటికీ ఇదే పరిస్థితి. కొరత ఎక్కువగా ఉండి, కల్తీలకు పాల్పడుతున్నారు.

ఇక ఇంటివ్యవహారాలని నిర్వహించటం అంటే ఇంటిపనులు చేయటం/చేయించటం, ఇరుగు పొరుగు వారితో సఖ్యంగా ఉండటం, ఇంటి పెద్దవారిని, పిల్లలను ప్రేమతో, బాధ్యతతో చూసుకోవటమే కాక పదార్థాలనీ, వస్తువులనీ, డబ్బునీ వృథా చేయకపోవటం, అతిథుల నాదరించటం, సమాజంలో కుటుంబానికున్న గౌరవాన్నీ కాపాడుకోవటం ఇవన్నీ సమిష్టి బాధ్యతలు. వ్యక్తి ప్రాధాన్యతలు, ఇష్టాలు ప్రాముఖ్యత వహిస్తున్న ఈ రోజుల్లో ఇవన్నీ సక్రమంగా జరగటం లేదు. దీనివల్ల్ల కూడా మనిషి అశాంతి కి గురి అవుతున్నాడు.

ఇలా ధనార్జన, కుటుంబనిర్వహణల్లో అశాంతికి గురికావటం లో ఇహసాధన కష్టమౌతోంది. ఇహమే సాధించటం కష్టంగా ఉంది కాబట్టి పరం గురించి ఆలోచించనే వద్దనుకుంటున్నారు.

అంటే జన్మ ముగిసిన తర్వాత మరిక జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాలని కోరిక ఉంటే సకల స్వార్థ బావాలనూ వదిలివేసి పరమాత్మునిలా పరమార్థ భావనతో జీవించ గలగాలి. ఇంట్లో మనతో పాటు జీవించే చీమలు, దోమలు, ఎలుకలు మొదలైన వాటివి విషప్రయోగాలు చేసి చంపటం సర్వసామాన్యమై పోయింది.

ప్రతిజీవిలోనూ ఉండే పరమాత్మను దర్శించలేక స్వంత సౌఖ్యం కోసం, సౌలభ్యం కోసం వాటిని చంపటానికి వెనుదీయటం లేదు. నరహంతకుల మాట అటుంచితే మంచివారం అనుకునే మన సంగతే .

మొక్కలు నాశనమౌతాయనీ తెలిసీ రాత్రీ పగలు తేడా లేకుండా విద్ద్యుద్దీపాలను వెలిగించే ఈ లోకం ఇక వాతావరణాన్ని పూర్తిగా పాడుచేసే ఫ్రిజ్ లు, యంత్ర వాహనాలను,కర్మాగారాల్ని వదిలేస్తుందా?

ఈవిధంగా బ్రతుకుతున్న మనం పరమార్థ భావనతో జీవించటం అసాధ్యంగా మార్చుకుంటున్నాము. ఈ విధంగా ఇహపరాలు రెండింటిలో అతి ఘోరంగా విఫలమవుతున్న మానవాళికిది దిశానిర్దేశం చేయుటకు ఆ భగవంతుడే ఏదో మార్గం సూచించకపోడన్న నమ్మకం తో బతకాలి.

పూర్తిగా నిరాశావాదం కమ్ముకున్న ఈ పరిస్థితిలో భగవంతుని మాత్రమే ఆశాకిరణం అనుకోవటం గాలిలొ దీపం బెట్టి భగవంతుడికి సవాల్ విసరుతున్నట్టుగా ఉంది. అతడు దీపాన్ని రక్షించే శక్తి కలిగినవాడే.కానీ మనకు వెలుగు చూపే దీపాన్ని రక్షించుకోవటానికి దీపాన్ని గూట్లో పెట్టడమే విహితకర్మ. అలాగే మానవ ప్రయత్నం ఎలా చెయాలో , ఏం చెయ్యాలో విజ్ఞులు జనావళిచే చేయించగలగాలి.