Loading...

22, మే 2009, శుక్రవారం

చావంటే భయమెందుకు?

చావటానికి భయమెందుకు?

ఎంతో విరక్తి తో చావాలనుకునే వాళ్ళు కూడా చావంటే భయపడుతూనే ఉంటారని నాకు అనిపిస్తుంది. ఇలా ఎందుకు అంటున్నానంటే వాళ్ళు కూడా ఎంతో బాధతో,దు:ఖంతో చావు గురించి మాట్లాడుతుంటారు.

నిజం, ఆ ప్రసక్తి వచ్చినప్పుడు ఏడుస్తూ మాట్లాడుతుంటారు అనేది నేను గమనించిన విషయం.వాళ్ళకు ఎన్నో బాధలుండవచ్చు. ఆ బాధలవల్ల వాళ్ళకు చావాలనిపిస్తుంది కానీ చావంటే భయం లేకో, బ్రతుకంటే తీపి లేకో కాదు.

జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించలేకపోయినప్పుడు తమ సామర్థ్యంపై నమ్మకం కోల్పోవాల్సి వచ్చినపుడు చావు తమకు ఇవ్వబడల్సిన శిక్షగా భావిస్తూ మాట్లాడుతుంటారు.

ఇది ఒకసారి అయితే పర్వాలేదు, ప్రతిసారీ మనముందు ఇల్లాంటి ప్రసక్తి తీసుకొచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంటే మనం మాత్రం ఏం చెప్పగలం? వాళ్ళ కన్నీళ్ళు, విరక్తి అబధ్ధం కాకపోవచ్చు. కానీ ప్రతిసారీ ఏమని ఓదార్చగలం చెప్పండి?
అదీ నాకైతే ఏళ్ళతరబడి జీవించాలని ఆశా లేదు, ఇవాళే చావు వచ్చినా బాధా లేదు.అందుకని నేనేదో బాధ్యతలు తీరిపోయి గానీ ఇంకో కారణం తోనో చావాలనుకుంటున్నానని గానీ అనుకోకండి.

అందరికున్న కష్టసుఖాలే నాకూ ఉన్నాయి.

ఆర్మీలా వీరులు కాకుండా మనలాంటి సాధారణ మనుషుల్లో కొంత మంది గురించి ఆలోచిస్తున్నాను.
వీళ్ళకు ఏ విరక్తి వచ్చినా చావు గురించి మాట్లాడడమో, చచ్చే ప్రయత్నం చేయటమో చేస్తూ ఉంటారు. చావు మీద ఎలాంటి వ్యతిరేకభావమూ లెని, చావుని ఒక సహజమైన ఘటనగా, చెప్పాలంటే ఈ సంసార నరకకూపం నుంచి విముక్తి కల్గించేదిగా గుర్తించే నాలాంటివాళ్ళు ఏమని ఓదార్చగలం? మీరేచెప్పండి!

అదీ బాగా పరిచితులైన వాళ్ళు తరచూ ఇలాంటి ఇబ్బంది కల్గిస్తూంటే ఏం చెప్పాలో తెలీదు. నా భావాలు చెప్పానా, అయితే చస్తే చావు అంటావా,నేను చస్తే నీకేం బాధ లేదా అనో మనసు కష్టపెట్టుకుంటారేమో అనిపిస్తుంది.

అలాగని అయ్యో చావు గురించి ఎందుకు మాట్లాడటమంటూ బాధ పడడం నా వల్ల కాదు.

ఆత్మీయులను పోగొట్టుకొని బాధ పడడం సహజమైన విషయం.కానీ అసలు చనిపోవటమన్నది జరగకూడనిదని, శాపమని అనుకోవటమే జీర్ణించుకోలేని విషయం.

ఇలాంటి సందర్భాలో నొప్పింపక తానొవ్వక అన్నట్టు ఎలా మాట్లాడాలో తెలీడం లేదు.పుట్టుక ఎంత సహజమో చావూ అంతే సహజమని ఎలా తెలియజేయాలో తెలీటం లేదు.