Loading...

21, ఫిబ్రవరి 2009, శనివారం

పూజలేల? అర్చనలేల?

మహాదేవి వర్మ హిందీలో పేరు మోసిన గొప్ప కవయిత్రి. ఓ కవితలో పూజలో విధి విధానం కన్నా భక్తి భావన ముఖ్యమని, వస్తువులన్ని సమకూర్చామా లేదాఅని చూసేబదులు మనసు లగ్నం చేశామో లేదో చూడటం ముఖ్యమని వేదాలలో,పురాణాలలో రాసినదాన్ని కవయిత్రి చక్కటి మాటలలో చెప్పారు. అందుకే ఈ కవిత నాకు చాలా నచ్చింది.ఆవిడ రాసిన క్యా పూజన్ క్యా ఆర్చన్ రే! అనే కవితని నాకు తెలిసిన తెలుగులో రాసుకున్నది నా బ్లాగులో పెట్టుకుంటున్నాను . ఇందులో కాపిరైట్ సమస్యలు రావని అనుకుంటున్నాను.

పూజలేల? అర్చనలేల?

మన మందిరమున వెలసిన ప్రియదేవునికి
ఏ పూజావిధులేలా అర్చనలేలా?

అనంతుడగు స్వామికి కోవెల ఈ చిరు జీవనమే
అభివాదనలొనరిచునులే నా ఊపిరులే!
పదధూళిని కడిగేదో నా కంటను కన్నీరే
పులకింతలు అక్షతలైతే నా వేదన చందనమై
అలరారే!
రాగ భరిత మది ప్రమిదను వెలిగించితినే
కనుచూపుల కలువపూలు అర్పించితినే!
సుగంధముల నా స్పందనలే ధూపాలే
అధరాంకిత జప తాళమునకు కనురెప్పల నటనాలే!
- లక్ష్మీదేవి.

స్వామి అనంతుడైనా నేను శీఘ్ర గతిని అంతమయ్యే జీవనాన్ని మాత్రమే నేను కోవెలగా చేయగలనని,ప్రమిదలో నూనె కు బదులు అనురాగాన్ని నింపానని చెప్పడం ప్రతి పదమూ చాలా చక్కటి అనుభూతి తో రాశారనిపిస్తోంది.