Loading...

4, సెప్టెంబర్ 2023, సోమవారం

శోకం

 ఆయువు తీరుగా కలతలన్నియు మాయునటంచు నమ్మి  నీ

సాయము కోరగా నిటుల సన్నిధిఁ జేరి వినంతిఁజేయఁ,గావవే,

న్యాయమె నీకు? నన్నిటుల యాతమనఁబెట్టెదేల! వే

గాయములందె నీ మనము, కన్నులు మూయు ముహూర్తమెన్నడో! 


--లక్ష్మీదేవి 

ఉత్పలమాల 

కవిత

 కవితాం వరయతి యో౽సౌ సుభగమ్మన్యో౽థవా స్వయం నృపశుః

కవితా వరయతి యం పునరేష వరో భవతి కవిసార్థే ।।

కవితా వనితాచైవ స్వయమేవా ౽౽గతా వరా 

బలదాకృష్యమాణా తు సరసా విరసా భవేత్।।


-- ప్రాచీన సూక్తి 



28, ఆగస్టు 2023, సోమవారం

ఛలము

 ధనధాన్యాదులమోహమో, ఘనత సంధానింపగా యత్నమో,
తనవారందరి బాగుకై పరులపై దాష్టీకదుర్మార్గమో
దినదైనందినచర్యలిప్పగిది నిర్దేశింప, నెల్లప్పుడున్
జనసామాన్యుల వర్తనన్ఛలమె యాచారమ్ముగా నిల్చెనో!


--లక్ష్మీదేవి.

మత్తేభవిక్రీడితము.

25, ఆగస్టు 2023, శుక్రవారం

కాంక్షలెన్నొ!

 

అలివేణి కురులందు నలరారు నీలంపు
సిరిరాశినై వెల్గు శ్రేయమెంతొ
యెలనాగ ముగమందు నెలమించు నగవందు
మెఱుపునై చెల్గంగ మేలదెంతొ
కలకంఠి స్వరమందుఁ గమనీయ రాగంపు
గరిమనై వినరాగ ఘనత యెంతొ
లలితాంగి నడలందు లయకారి మువ్వనై
మురిపెంపు సడికాగఁ బుణ్యమెంతొ 
 
భువినిజన్మమంది పువ్వునై వికసించి
పరిమళించనైన భాగ్యమెంతొ
కవనగీతమందు గానఫణితియందు
గమకమైనఁ జాలు కలిమి యెంతొ. 
 
-లక్ష్మీదేవి.
సీసము, ఆటవెలది.

24, ఆగస్టు 2023, గురువారం

నిలకడ

 దుర్వ్యాపారమ్మెప్డు  మనంబందున నిలువగఁ దగదు, విడగనగునే?
నిర్వ్యాపారమ్మైన స్థితిన్నే నిలిచితపములను నెఱపగనగునే?
నిర్వ్యీర్యమ్మౌ భంగుల,  నేదే నిలకడలనెఱుగని విధుల, నిటులే
దుర్వ్యాఖ్యానమ్ముల్ లిఖియింపందొరగుదునన మది దురటిలునుగదా!!


--లక్ష్మీదేవి.

సరసిజ వృత్తము.


#నాపద్యాలు

#ఆనందాలు


😊😊

 

--లక్ష్మీదేవి.
సరసిజ వృత్తము.

 

21, ఆగస్టు 2023, సోమవారం

నిత్యసత్యము

నిత్యోల్లాసమ్మందుననున్నన్నిరవధిక సుఖము నిలచునట, సదా
సత్యాన్వేషాసక్తినినున్నన్సబలమగు తపము సఫలమట, తతః
నిత్యస్సత్యమ్మైనదియేదో నికరముగఁ దెలిసి నిలబడుటకు, నా
వ్యత్యాసమ్మెల్లందెలియంగావలె, గురువు కరుణపడయగవలెనోయ్.
 
 
-లక్ష్మీదేవి.
సరసిజ వృత్తము.
ఒక ప్రయత్నము.

20, ఆగస్టు 2023, ఆదివారం

డమరుక

 
జవసత్త్వమ్ముంచుము సాజమగు యోగములలో,
శివనామమ్మందు తనించి, కడకాలములలో
భవబంధమ్మెల్లనుబోవ, మది చింతనములో
చవిఁజేకొన్నంత, ప్రభాసమగు స్వాంతనములో .

--లక్ష్మీదేవి 
డమరుక వృత్తము. 

14, ఆగస్టు 2023, సోమవారం

నొప్పించు గతిన్

ఊరంతనుఁ జాటించుచు, నుద్రేకముల
న్నూరంతలు రెట్టించుచు, నొప్పించుగతిన్,
గోరంతనుఁ బోనివ్వక కొండంతలుగా,
వీరంగములేలోగద వేయింతలుగా? 


--లక్ష్మీదేవి.

కలహంసి వృత్తము.



12, ఆగస్టు 2023, శనివారం

మౌక్తిక

 మందగామినీ మాళవీసతీ
యిందురూపిణీ హృన్నివాసినీ
కుందనాకృతీ ఘోరదర్శినీ
నందదాయినీ నన్నుఁగావుమా!

- లక్ష్మీదేవి 

10, ఆగస్టు 2023, గురువారం

విజృంభణ

 ఓఘమ్మై యాకాశంబెల్లన్వొడికముగనమరుచునునొప్పుగా వడి సాగునీ
మేఘమ్ముల్వయ్యారమ్మొల్కన్మెఱుపులఁజతగనిడుచు మేలుగాఁగురియున్గదా
దాఘమ్మెల్లందీర్చున్దానై ధరణిని జనులకును సదా, విశేషముగాననన్
శ్లాఘింపంగాదే నిత్యమ్మా జలదములను, మరిమరి సంతసించుచునెప్పుడున్.

 

-లక్ష్మీదేవి.

భుజంగవిజృంభితము
చాలా అరుదుగా వాడబడు వృత్తము.
ఈరోజే చూసి, చేసిన మొదటి ప్రయత్నము.

 

జలద వృత్తము

 

వానలు మెండుగా కురియఁ, బావనమౌ
కానలు నిండుగా పెరుగ కారణమౌ.
కానల దండిగా నిలిపి కాచినచో,
వానలకండయై పిలుచు పైడి యగున్.

 

- లక్ష్మీదేవి.

జలదము

8, ఆగస్టు 2023, మంగళవారం

పాడితి

 కరుణాలవాల నినుఁగాంచినంతనే

విరివోలె నాదు మది విచ్చెనిప్పుడే

మరుభూమిఁబోలు భువి, మందిరమ్ముగా

తరియింపఁజేయగల దైవమీవెగా


సుమసౌరభమ్ము సొగసైనతోటలో

తమకమ్ముఁబెంచి తపియింపఁజేయగా,

మమకారమిందు మనసెల్ల నిండగా

ప్రమదమ్ముఁగూర్పఁ, బదమిట్లు పాడితిన్.


--లక్ష్మీదేవి.

మంజుభాషిణి (వేర్వేరు యతిస్థానాలతో)



వియద్గంగా

 

భయోత్పాతమ్ము పుట్టించే భవచ్ఛేదమ్ము లైనంతన్
జయద్ధ్వానమ్ములెన్నెన్నో జగమ్మంతా ధ్వనింపంగా
ప్రయాణమ్మందు మోదమ్ముల్ ప్రసాదమ్మై లభింపంగా
వియద్గంగా ప్రవాహమ్మున్విహారమ్మందు నేఁజేతున్.
 
 
-లక్ష్మీదేవి.
వియద్గంగా
వృషభగతిరగడ (అంత్యప్రాసలేదు)